బాధితులకు రూ.లక్ష పరిహారం ఇవ్వాలి

30 Jun, 2014 00:35 IST|Sakshi
బాధితులకు రూ.లక్ష పరిహారం ఇవ్వాలి

 కంబాలచెరువు (రాజమండ్రి) :గ్యాస్ సిలిండర్ పేలుడు సంఘటనలో గాయపడిన బాధితులకు లక్ష రూపాయల నష్ట పరిహారం ఇవ్వాలని కేంద్ర మాజీ మంత్రి చిరంజీవి డిమాండ్ చేశారు. స్థానిక ఐదు బళ్ల మార్కెట్ వద్ద శనివారం రాత్రి గ్యాస్ సిలిండర్ లీకైన సంఘటనలో గాయపడి, రాజమండ్రి ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను ఆయన పరామర్శించారు. ఆయనతో పాటు పీసీసీ మాజీ చీఫ్ బొత్స సత్యనారాయణ, మాజీ మంత్రి సి.రామచంద్రయ్య, ఎమ్మెల్సీ గిడుగు రుద్రరాజు, మాజీ ఎమ్మెల్సీ కందుల దుర్గేష్, ప్రసాదుల హరినాథ్ ఉన్నారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ క్షతగాత్రులంతా కూలీ పనులు చేసుకునే వారేనని, దీంతో వారి కుటుంబాలు జీవనాధారాన్ని కోల్పోయే అవకాశం ఉందన్నారు. ఇటువంటి ప్రమాదాలు జరగకుండా మున్సిపల్, అగ్నిమాపక విభాగం అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. గ్యాస్ ప్రమాదాలపై ప్రజలకు తగిన అవగాహన కల్పించాలన్నారు. నగరంలో గ్యాస్ విస్ఫోటం ఘటన విచారకరమన్నారు.
 
 కలెక్టర్ పరామర్శ
 గ్యాస్ సిలిండర్ పేలుడు సంఘటనలో క్షతగాత్రులను కలెక్టర్ నీతూ ప్రసాద్ పరామర్శించారు. చికిత్స పొందుతున్న తొమ్మిది మంది పరిస్థితిని ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సులోచన ద్వారా తెలుసుకున్నారు. చికిత్స విషయంలో వెనుకాడవద్దని, అవసరమైతే ఆస్పత్రి మార్చాలని సూచించారు. అనంతరం నగరం గ్యాస్ విస్ఫోటంలో క్షతగాత్రులైన భార్యాభర్తలు వానరాసి వెంకటప్రసాద్, సూర్యకుమారిని కలెక్టర్ పరామర్శించారు. వారి పరిస్థితి మెరుగ్గానే ఉందని, త్వరలోనే డిశ్చార్జి చేస్తామని వైద్యులు తెలిపారు. ఆమె వెంట ఆర్‌డీఓ నాన్‌రాజ్, తహశీల్దార్ పిల్లి గోపాలకృష్ణ ఉన్నారు.
 

మరిన్ని వార్తలు