తీరంలో గజ భయం!

13 Nov, 2018 07:26 IST|Sakshi
గజ తుపాను హెచ్చరికలతో మంచినీళ్లపేట బోట్లను మత్స్యకారులు జాగ్రత్త చేసుకున్న దృశ్యం

ఎగసి పడుతున్న అలలు

మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదంటూ అధికారుల హెచ్చరికలు

ఆందోళనలో రైతులు

శ్రీకాకుళం, వజ్రపుకొత్తూరు: తిత్లీ తుపాను సృష్టించిన పెను విధ్వంసం నుంచి ఇంకా తేరుకోని ఉద్దానం ప్రజలకు మరో తుపాను దూసుకువస్తోందనే సమాచారం భయపెడుతోంది. ‘గజ’ పేరుతో వస్తున్న తుపాను తమ కంటిపై కునుకు లేకుండా చేస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తీరంలో ఎగసి పడుతున్న అలలు మత్స్యకారులను వణికిస్తున్నాయి. తిత్లీ తుపానుతో పూర్తిగా వరి పంట పోగా.. అక్కడక్కడ మిగిలిన పంట కూడా గజ తుపాను ప్రభావంతో వర్షం పడితే పూర్తిగా పాడవుతోందని రైతులు భయపడుతున్నారు. ఇప్పటికే వరి, జీడి, కొబ్బరి పంట పాడై ఆవేదనలో ఉన్న రైతులకు ఉన్న కాస్త వరిలో ఉన్న గింజలు కూడా దక్కవేమోనని మరింత వేదనకు గురవుతున్నారు. తుపాను ప్రభావంతో గంటకు 80 నుంచి 100 కిలో మీటర్ల వేగంతో పెను గాలులు వీస్తాయని ఇప్పటికే ఐఎండీ ప్రకటించడం, కోస్తాంధ్రకు భారీ వర్ష సూచన ఉందని హెచ్చరించడంతో జిల్లా యంత్రాంగం సైతం అప్రమత్తమైంది. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదంటూ హెచ్చరికలు కూడా జారీ చేశారు. వజ్రపుకొత్తూరు, మందస మండలాల్లోని మత్స్యకారులు ఎవరూ చేపల వేటకు వెళ్లరాదని ఆయా మండలాల తహసీల్దార్లు తీర ప్రాంత్ర గ్రామాల్లో దండోరా కూడా  వేయించారు. అధికారులంతా అందుబాటులో ఉండాలని, మత్స్యకార, తీర ప్రాంత గ్రామాల్లో పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలియజేయాలని ఆదేశించారు.

వజ్రపుకొత్తూరు సంతబొమ్మాళి మండలాల్లోని భావనపాడు, మంచినీళ్లపేట, గుణుపల్లి, దేవునల్తాడ తీరంలో సముద్రం కల్లోంగా మారింది. సోమవారం సుమారు 120 మీటర్లమేర సముద్రం ముందుకు వచ్చి తీరం కోతకు గురవుతోంది. సముద్రం నుంచి వచ్చే ఘోష చూసి మత్స్యకారులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.

తీరంలోనే బోట్లు...
 తిత్లీ తుపాను వచ్చినప్పటి నుంచి గత నెల రోజులుగా చిరిగిన వలలు, పాడైన బోట్లను, తెప్పలకు మత్స్యకారులు మరమ్మతులు చేసుకుంటున్నారు. సర్కార్‌ నుంచి కూడా ఎలాంటి సాయం వీరికి అందడలేదు. ఇంతలోనే మరో తుపాను వస్తోందనే సమాచారంతో ఉన్న వలలు, బోట్లు, తెప్పలను మత్స్యకారులు ఒడ్డుకు చేర్చుకొని జాగ్రత్త పడుతున్నారు. పలాస నియోజకవర్గంలో దాదాపు195 వరకు బోట్లు, మరో 260 వరకు తెప్పలు, 120 వరకు నాటు పడవలు ఉన్నాయి. అన్నీ తీరంలోనే లంగరు వేయడంతో చేపల వేట సాగించలేకపోయారు. తీరా చేపల వేటకు వెళ్దామని సమాయత్తం అవుతున్న సమయంలో గజ తుపాను మా పాలిట శాపమైందని వీరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని వార్తలు