గజపతినగరం అతివల చేతిలోనే అభ్యర్థుల గెలుపు

20 Mar, 2019 11:28 IST|Sakshi

సాక్షి, గజపతినగరం: నియోజకవర్గం అభ్యర్థుల గెలుపు అతివల చేతిలోనే ఉంది. నియోజకవర్గంలో మహిళా ఓటర్లే ఎక్కువ. నియోజకవర్గంలోని దత్తిరాజేరు, గజపతినగరం, బొండపల్లి, గంట్యాడ, జామి మండలాలు ఉన్నాయి. 2019 అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ కోసం నియోజకవర్గాన్ని 22 జోన్లుగా (సెక్టారులుగా), 34 రూట్లుగా విభజించారు. 
ఎన్నికల నిర్వహణ సౌలభ్యం కోసం ఎన్నికలు సామగ్రి తరలింపు కోసం జోన్లు, రూట్లుగా విభజించారు. నియోజకవర్గంలో మొత్తం 236 పోలింగ్‌ కేంద్రాలు ఉన్నాయి. 23 సమస్యాత్మక గ్రామాలను గుర్తించారు. ఒక్కో కేంద్రానికి ఒక పోలింగ్‌ అధికారి, ఐదుగురు ఎన్నికలు సిబ్బంది కలసి మొత్తం 1200 మందిని నియమించినట్టు ఆర్వో వెంకటరావు తెలిపారు.                   
 

నియోజకవర్గం ఆవిర్బావం
నియోజకవర్గం ఆవిర్భావం(1955) నుంచి వరుసగా స్థానికేతరులే ఎన్నికవుతూ వస్తున్నారు. కాపు సామాజిక వర్గ అభ్యర్థులే ఇక్కడ పాలన సాగిస్తున్నారు. తొలి ఎమ్మెల్యేగా సోషలిస్ట్‌ పార్టీ నుంచి విజయనగరం పూసపాటి రాజు వంశీయులు, విజయనగరం సంస్థానీదీశుడు పీవీజీ రాజు భార్య కుసుమ గజపతిరాజు (ఎంపీ అశోక్‌తల్లి) ఎన్నికయ్యారు. వ్యక్తిగత కారణాలతో ఆమె1959లో రాజీనామా చేశారు.  తదనంతరం జరిగిన ఉప ఎన్నికల్లో మెంటాడ మండలం చల్లపేట గ్రామానికి చెందిన తాడ్డి సన్యాసినాయడుపై పీవీజీ రాజు (సోషలిస్ట్‌ పార్టీ) గెలుపొందారు. 1967లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా తాడ్డి సన్యాసినాయుడు... పెనుమత్స సాంబశివరాజుపై గెలిచారు.

1972లో జరిగిన ఎన్నికల్లో ఏకగ్రీవంగా సాంబశివరాజు ఎన్నికయ్యారు. 1978 ఎన్నికల్లో జనతా పార్టీ అభ్యర్థిగా దత్తిరాజేరు మండలం గోభ్యాం గ్రామానికి చెందిన వంగపండు నారాయణప్పలనాయుడు తాడ్డి సన్యాసినాయుడుపై గెలిపొందారు. 1983లో టీడీపీ అభ్యర్థి జంపాన సత్యనారాయణరాజు గెలిపొందారు. అప్పట్లో శాసనసభ రద్దు కావడంతో రెండేళ్ల వ్యవధిలో 1985లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి వంగపండు నారాయణప్పలనాయడు తాడ్డి సన్యాసినాయడు మద్దుతో గెలిపొందారు.1

989లో జరిగిన ఎన్నికల్లో బొండపల్లి మండల పరిషత్‌ అధ్యక్షురాలిగా ఉన్న పడాల అరుణ టీడీపీ తరఫున పోటీచేసి వంగపండు నారాయణప్పలనాయడుపై గెలిపొందారు. 1994లో జరిగిన ఎన్నికల్లో తాడ్డి వంగపండు వర్గాలు ఒక్కటైనా మరలా టీడీపీ అభ్యర్థి పడాల అరుణను గెలిపించాయి. 1999లో జరిగిన ఎన్నికల్లో మోంటాడ మండల అధ్యక్షుడిగా ఉన్న తాడ్డి వెంకటరావు కాంగ్రెస్‌ పార్టీ నుంచి గెలిపొందారు. 2004లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ నుంచి తాడ్డి ఇండిపెండెంట్‌గా వంగపడు పోటీ చేయగా వారిపై టీడీపీ అభ్యర్థి పడాల అరుణ మూడో సారి గెలుపొందారు. 2009లో పడాల అరుణపై ప్రస్తుత వైఎస్సార్‌ సీపీ అభ్యర్థి బొత్స అప్పలనర్సయ్య గెలుపొందారు. 2014లో జరిగిన ఎన్నికల్లో రెండు సార్లు టీడీపీ నుంచి ఎంపీగా పోటీచేసి ఓడి పోయిన కొండపల్లి అప్పలనాయుడు వైఎస్సార్‌సీపీ అభ్యర్థి కడుబండిపై గెలిపొందారు.

 ప్రధాన సమస్యలు... 

  • నియోజకవర్గ కేంద్రం గజపతినగరంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల లేదు. దీంతో ఇక్కడి విద్యార్థులు పొరుగు నియోజకవర్గాలకు వెళ్లి చదువులు సాగించాల్సి వస్తోంది. 
  • నియోజకవర్గం ఇంచుమించుగా వ్యవసాయ ప్రాంతం. తోటపల్లి ప్రాజెక్టు నీటిని నియోజకవర్గానికి అందించేందుకు కృషిచేసిన ముఖ్యమంత్రి వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి మరణంతో పనులు నిలిచిపోయాయి. కాలువ పనులు ముందుకు సాగలేదు. 
  • ప్రజల చిరకాల ఆకాంక్ష అయిన బైపాస్‌ రోడ్డు నిర్మాణం కలగానే మిగిలింది. గజపతినగరం నడిబొడ్డులో ఉన్న ఆర్టీసీ కాంప్లెక్స్‌కు వెళ్లాలంటే భయం వేస్తోంది. 
  • గజపతినగరంలో మురుగునీటి పారుదల వ్యవస్థ అధ్వానం. కాలువల నిర్మాణం సరిగా లేకపోవడంతో ఎక్కడికక్కడే మురుగునీరు నిల్వ ఉంటోంది. అండర్‌ డ్రైనేజీ నిర్మాణాన్ని టీడీపీ నేతలు పూర్తిగా విస్మరించారు. 
  • నియోజకవర్గ ప్రజలను తాగునీటి సమస్య వెంటాడుతోంది. 
  • గంట్యాడ మండలంలోన ఉన్న తాటిపూడి ఒకప్పుడు పర్యాటక కేంద్రంగా కళకళలాడేది. నిధులు కేటాయించకపోవం, అభివృద్ధి పనులు సాగకపోవడంతో పర్యాటక కళ తప్పింది. తాటి జలాశయం వద్ద మెట్లు పాడైనా పట్టించుకోవడంలేదు. అక్కడికి వెళ్లేందుకు రోడ్డు కూడా బాగులేకపోవడంతో రాకపోకలకు పర్యాటకులు ఇబ్బందులు పడుతున్నారు. 
  • నియోజకవర్గ వాసులకు సంక్షేమ పథకాలు అందని ద్రాక్షగా మారాయి. జన్మభూమి కమిటీల కాళ్లుపట్టుకునేవారికే పింఛన్లు, ఇళ్లు, బీసీ రుణాలు మంజూరు చేశారు. అర్హులకు మొండిచేయి చూపారు. ఐదేళ్లలో నియోజకవర్గంలో అవినీతి పాలన సాగింది. 


 గజపతినగరం నియోజకవర్గం ప్రొఫైల్‌... 

మొత్తం ఓటర్లు 1, 90,878
పురుషులు 94,350
మహిళలు 96,524
థర్డ్‌ జండర్‌ 4

రాజకీయంగా ప్రభావితం చేసే కులాలు:  (తూర్పు కాపు, కొప్పల వెలమ)
నియోజకవర్గ విస్తీర్ణం: 14,210 స్కేర్‌ మీటర్లు, (162 కిలో మీటర్లు)
పంచాయతీలు: 136
పింఛన్లు: పాతవి 34,074
మొత్తం రేషన్‌ కార్డులు: 79,364 (అంత్యోదయ రేషన్‌కార్డులు: 5,765, తెలుపు రేషన్‌ కార్డులు: 64,092)


 

మరిన్ని వార్తలు