గాలేరు – నగరి రెండో దశ రెండో ప్యాకేజీలో రూ.33.57 కోట్లు ఆదా

28 Dec, 2019 04:42 IST|Sakshi

రూ.343.97 కోట్ల అంచనా వ్యయంతో రివర్స్‌ టెండరింగ్‌ నోటిఫికేషన్‌ 

5 శాతం తక్కువ ధరకు పనులు దక్కించుకున్న కాంట్రాక్టు సంస్థ

ఎన్నికలకు ముందు ఇవే పనులు 4.76 శాతం అధిక ధరతో కాంట్రాక్టర్‌కు అప్పగింత

మొత్తంగా 9.76 శాతం తక్కువ ధరకు పనులు అప్పగించిన ప్రస్తుత ప్రభుత్వం

రాష్ట్రంలో రివర్స్‌ టెండరింగ్‌ విధానం వల్ల ఇప్పటి దాకా రూ.1,752.83 కోట్లు ఆదా

సాక్షి, అమరావతి: గాలేరు–నగరి సుజల స్రవంతి పథకం రెండో దశలో రెండో ప్యాకేజీ పనులకు రివర్స్‌ టెండరింగ్‌ నిర్వహించడం వల్ల రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు రూ.33.57 కోట్లు ఆదా అయ్యాయి. ఎన్నికలకు ముందు ఈ పథకం రెండో దశలో ఏడు ప్యాకేజీల పనులు చేస్తున్న కాంట్రాక్టర్లను బెదిరించి ప్రీ–క్లోజర్‌ చేసుకునేలా చక్రం తిప్పిన గత ప్రభుత్వ పెద్ద.. ఆ పనుల అంచనా వ్యయాన్ని పెంచి, అధిక ధరకు ఎంపిక చేసిన కాంట్రాక్టర్లకు అప్పగించి కమీషన్‌లు దండుకున్నారు. రెండో ప్యాకేజీ (గాలేరు–నగరి ప్రధాన కాలువ 66.15 కిలోమీటర్ల నుంచి 96.50 కిలోమీటర్ల వరకు తవ్వడం, 12 వేల ఎకరాలకు నీళ్లందించడానికి పిల్ల కాలువలు తవ్వడం) పనుల అంచనా వ్యయాన్ని రూ.343.97 కోట్లకు పెంచి లంప్సమ్‌–ఓపెన్‌ పద్ధతిలో టెండర్‌ నోటిఫికేషన్‌లను జారీ చేయించారు. తాను ఎంపిక చేసిన కాంట్రాక్టర్‌ను కాదని బిడ్‌లు దాఖలు చేసిన కాంట్రాక్టర్లపై అనర్హత వేటు వేయించారు. ఆ కాంట్రాక్టర్లు న్యాయ స్థానాన్ని ఆశ్రయించారు. న్యాయస్థానంలో ఆ కేసు విచారణలో ఉండగానే సింగిల్‌ బిడ్‌గా దాఖలు చేసిన టెండర్‌ను ఆమోదించేలా అధికారులపై ఒత్తిడి తెచ్చి 4.76 శాతం అధిక ధర (రూ.360.35)కు ఎంపిక చేసిన కాంట్రాక్టర్‌కు పనులు కట్టబెట్టారు. దాంతో ఖజానాపై రూ.16.38 కోట్ల భారం పడింది.

వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ఇలా చేసింది..
పనులు ప్రారంభించకపోవడంతో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే వాటిని రద్దు చేసిన గాలేరు–నగరి అధికారులు.. రూ.343.97 కోట్ల అంచనా వ్యయంతో 36 నెలల్లో ఆ పనులు పూర్తిచేయాలనే షరతుతో రివర్స్‌ టెండరింగ్‌ నోటిఫికేషన్‌ జారీ చేశారు. ఫైనాన్స్‌ బిడ్‌ను శుక్రవారం ఉదయం 11 గంటలకు తెరిచారు. నాలుగు సంస్థలు (ఎమ్మార్కేఆర్, ఎస్‌సీఎల్, బీవీఎస్సార్, బృందా ఇన్‌ఫ్రాటెక్‌) పోటీ పడుతూ బిడ్‌లు దాఖలు చేశాయి. 4.5 శాతం తక్కువ ధర (రూ.328.50 కోట్లు)కు కోట్‌ చేసిన సంస్థ ఎల్‌–1గా నిలిచింది. దాంతో ప్రైస్‌ బిడ్‌ స్థాయిలోనే రూ.15.47 కోట్లు ఆదా అయ్యాయి. రూ.328.50 కోట్లనే కాంట్రాక్టు విలువగా పరిగణించిన అధికారులు శుక్రవారం మధ్యాహ్నం 2.00 నుంచి సాయంత్రం 4.45 గంటల వరకు ఈ–ఆక్షన్‌ (రివర్స్‌ టెండరింగ్‌) నిర్వహించారు.

ఐదు శాతం తక్కువ ధర(రూ.326.78 కోట్లు)కు కోట్‌ చేసిన సంస్థ ఎల్‌–1గా నిలిచించింది. దాంతో ఆ సంస్థకే పనులు అప్పగించాలని సిఫార్సు చేస్తూ కమిషనర్‌ ఆఫ్‌ టెండర్స్‌(సీవోటీ)కు గాలేరు–నగరి అధికారులు నివేదిక పంపనున్నారు. దీని వల్ల ఖజానాకు రూ.17.19 కోట్లు ఆదా అయ్యాయి. గతంతో 4.76 శాతం అధిక ధరలకు అప్పగించడం వల్ల ఖజానాపై రూ.16.38 కోట్ల భారం పడింది. దీన్ని పరిగణనలోకి తీసుకుంటే ప్రస్తుతం ఖజానాకు రూ.33.57 కోట్లు ఆదా అయినట్లు స్పష్టమవుతోంది. మొత్తంగా 9.76 శాతం తక్కువ ధరకు పనులు అప్పగించినట్లయింది. కాగా, ఈ నెల 19న రెండో దశలోని మొదటి ప్యాకేజీ పనులకు నిర్వహించిన రివర్స్‌ టెండరింగ్‌ వల్ల రూ.35.3 కోట్లు ఖజానాకు ఆదా అయిన విషయం తెలిసిందే. మొత్తంగా ఈ విధానం వల్ల రాష్ట్ర ఖజానాకు ఇప్పటి దాకా రూ.1752.83 కోట్లు ఆదా అయ్యాయి.

టిడ్కో నాలుగో దశ రివర్స్‌టెండరింగ్‌లో రూ.47.48కోట్లు ఆదా
ఏపీ టౌన్‌షిప్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (ఏపీ టిడ్కో) నిర్వహించిన నాలుగో దశ రివర్స్‌టెండరింగ్‌లో రూ.47.48 కోట్ల ప్రజాధనం ఆదా అయ్యింది. కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో 8,448 ఇళ్ల నిర్మాణానికి ఏపీ టిడ్కో శుక్రవారం రూ.431.62 కోట్ల అంచనా వ్యయంతో రివర్స్‌ టెండర్లు పిలవగా ఇంద్రజిత్‌ మెహతా కన్‌స్ట్రక్షన్స్‌ రూ.384.14 కోట్లకు బిడ్‌ దాఖలు చేసి ఎల్‌–1గా నిలిచింది. దాంతో రూ.47.48 కోట్ల ప్రజాధానం ఆదా అయ్యింది. ఇంతకు ముందు మూడు దశల్లో 40,160 ఇళ్ల నిర్మాణానికి ఈ విధానం ద్వారా రూ.255.83 కోట్ల ప్రజాధనం మిగిలిన విషయం తెలిసిందే. మొత్తంగా నాలుగు దశల్లో 48,608 ఇళ్ల నిర్మాణానికి రూ.2,399 కోట్ల అంచనా వ్యయంతో రివర్స్‌ టెండర్లు నిర్వహించగా రూ.303.31 కోట్ల ప్రజాధనం ఆదా అయ్యింది. రివర్స్‌ టెండరింగ్‌ ప్రక్రియ సత్ఫలితాలు ఇస్తున్నందున మరిన్ని ప్రాజెక్టుల్లో కూడా ఈ విధానాన్ని అమలు చేస్తామని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు.

మరిన్ని వార్తలు