గాలేరు–నగరి రెండో దశ తొలి ప్యాకేజీలో రూ.35.3 కోట్లు ఆదా

20 Dec, 2019 03:22 IST|Sakshi

రూ.391.13 కోట్ల వ్యయంతో టెండర్లు నిర్వహించిన సర్కారు

5.04 శాతం తక్కువగా రూ.371.43 కోట్లకు కోట్‌ చేసిన కాంట్రాక్టు సంస్థ

ఇవే పనులను రూ.406.73 కోట్లకు సీఎం రమేష్‌ సంస్థకు కట్టబెట్టిన టీడీపీ సర్కార్‌

ఖజానాపై అప్పట్లో రూ.15.6 కోట్ల భారం

ఇప్పుడు మొత్తంగా 9.03 శాతం తక్కువ ధరకే కాంట్రాక్టర్‌కు అప్పగింత

సాక్షి, అమరావతి: గాలేరు–నగరి సుజల స్రవంతి పథకం రెండో దశ తొలి ప్యాకేజీ పనులకు రూ.391.13 కోట్ల అంచనా వ్యయంతో గురువారం ప్రభుత్వం నిర్వహించిన రివర్స్‌ టెండరింగ్‌ విజయవంతం అయ్యింది. 5.04 శాతం తక్కువ ధరకు కోట్‌ చేసిన కాంట్రాక్టు సంస్థ ఆ పనులను దక్కించుకుంది. ఎన్నికలకు ముందు ఇదే పనులను 3.99 శాతం అధిక ధరకు తన బినామీ అయిన సీఎం రమేష్‌కు చెందిన సంస్థకు అప్పటి సీఎం చంద్రబాబు కట్టబెట్టారు. దీంతో అప్పట్లో ఖజానాపై రూ.15.60 కోట్ల భారం పడింది. ప్రస్తుతం వైఎస్సార్‌సీపీ సర్కారు ఈ పనులను రద్దు చేసి, తాజాగా టెండర్లు నిర్వహించి.. 9.03 శాతం తక్కువ ధరకే కాంట్రాక్టర్‌కు పనులు అప్పగించడం వల్ల ఖజానాకు రూ.35.3 కోట్లు ఆదా అయ్యాయి. సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడటానికి 2 నెలల ముందు సీఎం రమేష్‌కు లబ్ధి చేకూర్చేంచేందుకు గాలేరు–నగరి రెండో దశలోని ఏడు ప్యాకేజీల కాంట్రాక్టర్లపై ఒత్తిడి తెచ్చి ఒప్పందాలను ‘ప్రీ–క్లోజ్‌’ చేసుకునేలా చంద్రబాబు చక్రం తిప్పారు.

ఇదీ టెండర్‌ కథాకమామిషూ
►మొదటి ప్యాకేజీ (ప్రధాన కాలువ 32.64 కిలోమీటర్ల నుంచి 66.15 కిలోమీటర్ల వరకు తవ్వకం.. పది వేల ఎకరాలకు నీళ్లందించేలా పిల్ల కాలువలు తవ్వడం) పనుల వ్యయాన్ని 2018–19 ధరల ప్రకారం రూ.391.13 కోట్లుగా నిర్ణయించి గత ప్రభుత్వం లంప్సమ్‌–ఓపెన్‌ పద్ధతిలో టెండర్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది.

►తక్కువ ధరకు కోట్‌ చేసిన కాంట్రాక్టు సంస్థలపై సాంకేతిక కారణాలతో అనర్హత వేటు వేసేలా అధికారులపై ఒత్తిడి తెచ్చింది. ఈ వ్యవహారంపై కాంట్రాక్టు సంస్థలు హైకోర్టును ఆశ్రయించాయి. న్యాయ విచారణ జరుగుతున్నా లెక్క చేయకుండా.. మొదటి ప్యాకేజీ పనులను 3.99 శాతం అధిక ధర (రూ.406.73 కోట్లు)కు సీఎం రమేష్‌కు చెందిన రిత్విక్‌ ప్రాజెక్ట్స్‌కు అప్పగించారు.

►రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గత ప్రభుత్వ హయాంలో టెండర్లు ఖరారు చేసి.. పనులు ప్రారంభించని కాంట్రాక్టు ఒప్పందాలను రద్దు చేసింది. గత ప్రభుత్వం నిర్ణయించిన రూ.391.13 కోట్ల విలువైన పనులకు ఈ నెల 2న టెండర్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. గురువారం ఉదయం ప్రైస్‌ బిడ్‌ తెరవగా రెండు సంస్థలు షెడ్యూళ్లు దాఖలు చేశాయి.

►ప్రైస్‌ బిడ్, రివర్స్‌ టెండరింగ్‌లో 5.04 శాతం తక్కువ ధరకు (రూ.371.43 కోట్లు) కోట్‌ చేసిన కాంట్రాక్టు సంస్థకు పనులు అప్పగించాలని సిఫార్సు చేస్తూ కమిషనర్‌ ఆఫ్‌ టెండర్స్‌(సీవోటీ)కు ప్రతిపాదనలు పంపుతామని ఎస్‌ఈ మధుసూదన్‌రెడ్డి తెలిపారు. మొత్తమ్మీద 9.03 శాతం తక్కువ ధరలకే ప్రస్తుతం కాంట్రాక్టర్‌కు పనులు అప్పగించనున్నారు. దీని వల్ల ఖజానాకు రూ.35.3 కోట్లు ఆదా అయ్యాయి. ఇప్పటి దాకా రివర్స్‌ టెండరింగ్‌ ద్వారా ఆదా అయిన మొత్తం రూ.1567.89 కోట్లకు చేరింది.

>
మరిన్ని వార్తలు