రెండేళ్లలో బ్రహ్మణీ స్టీల్‌ ఫ్యాక్టరీ పూర్తి

24 Jun, 2018 17:25 IST|Sakshi

లేదంటే నా పెట్టుబడి రూ.1,350 కోట్లు ఇచ్చేయండి

కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దనరెడ్డి విజ్ఞప్తి

స్టీల్‌ ప్లాంట్‌తో లక్షలాది మందికి ఉపాధి

అందుకే వైఎస్సార్‌ అంగీకారం

సాక్షి, బెంగళూరు : ఏపీ ప్రభుత్వం అవకాశమిస్తే వైఎస్సార్‌ జిల్లాలోని బ్రహ్మణి స్టీల్‌ ప్లాంటును రెండేళ్లలో పూర్తి చేస్తానని కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దనరెడ్డి చెప్పారు. అది సాధ్యం కాకపోతే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే ఆ స్టీల్‌ ప్లాంటును స్వాధీనం చేసుకుని నిర్మాణం పూర్తి చేసుకోవచ్చన్నారు. లేదంటే ఆ ప్లాంట్‌ నిర్మాణం కోసం తాను వెచ్చించిన రూ. 1,350 కోట్లు తిరిగి ఇచ్చేయాలని విజ్ఞప్తి చేశారు. ఆదివారం ఆయన బెంగళూరులోని ఓ హోటల్‌లో మీడియాతో మాట్లాడారు.

వైఎస్సార్‌ జిల్లాలో స్టీలు ప్లాంటు స్థాపించాలనే డిమాండ్‌తో జరుగుతున్న పోరాటాలను మీడియా ద్వారా తెలుసుకున్నట్లు చెప్పారు. 2007, జూన్‌ 10న జమ్మలమడుగులో బ్రహ్మణి ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ పేరిట స్టీలు ప్లాంటు నిర్మాణానికి శంకుస్థాపన జరిగిందని గాలి జనార్దనరెడ్డి గుర్తు చేశారు. ఈ స్టీలు ప్లాంటు వల్ల ప్రత్యక్షంగా 10 వేల మందికి, పరోక్షంగా లక్ష మందికిపైగా ఉపాధి లభిస్తుందని, అందుకే దివంగత సీఎం వైఎస్‌ఆర్‌ను స్టీలు ప్లాంటు ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని కోరినట్టు తెలిపారు.

అప్పుడు అనుకూలమన్న మెకాన్‌ 
అప్పట్లో మెకాన్‌ సంస్థ తమకు కన్సల్టెంట్‌గా ఉందని జనార్దనరెడ్డి చెప్పారు. ప్లాంటు ఏర్పాటుకు ఎలాంటి ఇబ్బందులు లేవని మెకాన్‌ కూడా వెల్లడించినట్లు చెప్పారు. ప్రస్తుతం ఈ అంశం  సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉండడం వల్ల కడపలో స్టీలు ప్లాంటుకు అనువైన పరిస్థితులు లేవని ప్రస్తుతం మెకాన్‌ చెప్పడం సమంజసం కాదన్నారు. సీఎం చంద్రబాబు అనుమతిస్తే బ్రహ్మణి స్టీలు ప్లాంటు నిర్మాణాన్ని ఏ క్షణమైన ప్రారంభిస్తానని ఆయన తెలిపారు.

మరిన్ని వార్తలు