కాయ్‌ రాజా..కాయ్‌

30 Mar, 2017 12:48 IST|Sakshi
కాయ్‌ రాజా..కాయ్‌

► పదికి రూ.100, వందకు రూ.1000
► వెంకటేశ్వరపురం కేంద్రంగా జోరుగా సింగిల్‌ నంబర్లాట
► ఏజెంట్ల మధ్యవర్తిత్వంతో విచ్చవిడిగా జూదం

నెల్లూరు: నగరంలోని వెంకటేశ్వరపురం కేంద్రంగా సింగిల్‌ నంబరు నిర్వహణ జోరుగా కొనసాగుతోంది. పదికి రూ.100, వందకు రూ.1000 వస్తుందని ఆశ చూపి కొందరు నిర్వాహకులు జూదాన్ని కొనసాగిస్తున్నారు. కొన్ని నెలల నుంచి గుట్టుచప్పుడు  కాకుండా ఈ తంతు నడుస్తున్నా ఈ మధ్య కాలంలో బహిరంగంగానే ఈ ఆట కొనసాగుతోంది. వెంకటేశ్వరపురంలో కేంద్రంగా జరుగుతున్న ఈ ఆట చుట్టు పక్కల ప్రాంతాలైన జనార్ధన్‌ రెడ్డి కాలనీ, పడుగుపాడు, కోవూరు, సాలుచింతల ప్రాంతాల్లోనూ విచ్చలవిడిగా నిర్వహిస్తున్నారు.

వందకు వెయ్యి వస్తుందన్న ఆశతో చిన్న, మధ్య తరగతి వారు ప్రధానంగా యువకులు ఆకర్షితులై ఈ ఆట ఆడుతూ అప్పుల పాలై నష్టపోతున్నారు.   వెంకటేశ్వరపురంలో ఉన్న ఏజెంట్ల వద్ద వంద కడితే నంబరు తగిలితే రూ.1000 వస్తుంది. ఆ వెయ్యిలో ఏజెంట్‌ కమీషన్‌ రూపంలో రూ.200 పట్టుకొని రూ.800 ఇస్తున్నారు. రూ.10 నుంచి ఈ ఆట మొదలవుతోంది. వెంకటేశ్వరపురం సెంటర్‌లో ఉన్న ఏజెంట్లు ఈతంతగాన్ని నడిపిస్తూ కమీషన్లతో లబ్ధిపొందుతుంటే, దీని బారిన పడినవారు తీవ్రంగా నష్టపోతున్నారు. రోజంతా కష్టం చేసి కూలి డబ్బులు తెచ్చుకుని ఏజెంట్ల చేతుల్లో పెడుతున్నారు.

ఓ వ్యక్తి ఇటీవల రూ.20 వేలు నంబర్ల ఆటలో పోగొట్టుకున్నట్లు తెలిసింది. పోగొట్టుకున్న డబ్బులు తిరిగి వస్తాయన్న ఆశతో మరిన్ని అప్పులు చేస్తూ అప్పుల పాలైపోతున్న పరిస్థితిలో కూరుకుపోయాడు. ప్రతి రోజూ ఉదయం ఒకసారి, మధ్యాహ్నం ఒకసారి నంబర్లను ఏజెంట్లు ప్రకటిస్తారు. తమ అదృష్టాన్ని పరీక్షించేందుకు ఈ నంబర్ల ఆటపై మొగ్గు చూపుతున్నారు. తెల్లవారు జాము నుంచే సెంటర్లలో నిర్వాహకుల సందడి మొదలవుతోంది. ఏ నంబరుకు ఆడితే ఎంత వస్తుంది.. ఎంత మంది పందెం పెట్టారు అన్న అంశంపై చర్చతో వీరి ఆట ప్రారంభమవుతోంది.

గతంలో సింగిల్‌ నంబర్ల నిర్వాహకులను పోలీసులు అదుపులోకి తీసుకున్న సంఘటనలు ఉన్నాయి. ప్రస్తుతం పోలీసులు పట్టించుకోకపోవడంతో మళ్లీ యథావిధిగా వారి కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. పేద, మధ్య తరగతి వారే కాకుండా కొందరు వ్యాపారస్తులు సైతం ఈ నంబర్ల ఆటపై మొగ్గు చూపుతున్నారు. ఒక్క వెంకటేశ్వరపురంలోనే రోజుకు రూ.లక్ష వరకు ఈ ఆటలో లావాదేవీలు జరుగుతున్నాయి. గతంలో ‘కాటన్‌’ వలె ఇప్పుడు సింగిల్‌ నంబర్ల ఆటలో కూడా చాలా మంది డబ్బులు పొగొట్టుకొని బాధపడుతున్నారు.

ముఖ్యంగా నిర్వాహకులు కొత్త వారిని ఆకర్షిస్తూ వారితో ఆట ఆడిస్తున్నారు. రూ. లక్షల్లో ఈ ఆట కొనసాగుతుందంటే ఈ వ్యసనం ఏ మేరకు వ్యాపించిదో తెలుసుకోవచ్చు. ఇప్పటికైనా ఇలాంటి నిషేధిత ఆటలను పోలీసులు గుర్తించి మరికొంత మంది దీని బారిన పడకుండా చూడాల్సిన బాధ్యత ఉందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.

మరిన్ని వార్తలు