నిబంధనలు బేఖాతర్‌

4 Jun, 2020 13:41 IST|Sakshi
మాస్కులు లేకుండా నడిరోడ్డుపై కూర్చుని జూదం ఆడుతున్న యువకులు హౌసీ ఆడేందుకు జూదరులు ఉపయోగించిన నంబర్ల ప్లేటు

కనీస జాగ్రత్తలు పాటించని యువకులు

పోలీసులు దాడులు చేస్తున్నా ఆగని జూదరులు

ప్రకాశం, చీరాల రూరల్‌: భౌతికదూరం పాటించి కరోనా వైరస్‌కు అడ్డుకట్ట వేయాలని ప్రచార మాధ్యమాల్లో ప్రభుత్వం విస్తృతంగా ప్రచారం చేస్తున్నా... సమావేశాలు పెట్టి పోలీసులు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నా... కొందరు యువకులు అధికారుల సూచనలను ఏ మాత్రం లెక్క చేయడం లేదు. ఇష్టాను రీతిగా వ్యవహరిస్తూ కనీసం ముఖానికి మాస్కు కూడా ధరించకుండా వైరస్‌ను వ్యాప్తి చెందే విధంగా ఎక్కడ పడితే అక్కడ జూదాలు ఆడుతున్నారు. పోలీసులు దాడులు నిర్వహిస్తూనే ఉన్నప్పటికీ జూదరులు ఏదో ఒకచోట ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తూనే ఉన్నారు. మరికొందరు భౌతిక దూరం పాటించకుండా ద్విచక్ర వాహనాపై డబుల్స్, త్రిబుల్స్‌ రైడ్స్‌ చేస్తూ పోలీసులకు పట్టుబడుతున్నారు. 

చీరాలలో జూద స్థావరాలు..
చీరాల వన్‌టౌన్‌ పరిధిలో దండుబాట, విఠల్‌ నగర్, ప్రకాశ్‌ నగర్, జయశంకర్‌ నగర్, ఉజిలిపేట, పాలేటి నగర్, జవహర్‌ నగర్, హరిప్రసాద్‌ నగర్, శ్రీరాంనగర్, కొత్తపాలెం వంటి ప్రాంతాలు, టూ టౌన్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలో జాన్‌పేట, జయంతిపేట, మరియమ్మ పేట, ఐక్యనగర్, విజయ నగర్‌ కాలనీ, రామ్‌నగర్, శాంతి నగర్, గాంధీ నగర్, ఆనంద పేట, శృంగారపేట, హారిస్‌ పేట, హయ్యర్‌పేట, థామస్‌ పేట, గంజిపాలెం, గొల్లపాలెం వంటి ప్రాంతాల్లో కొందరు యువకులు పేకాట, చింత పిక్కలాట, హౌసీ వంటి ఆటలాడుతున్నారు. 

కనీస జాగ్రత్తలూ లేవు..
ప్రభుత్వం లాక్‌డౌన్‌లో కొన్ని సడలింపులు ఇవ్వడంతో ఇప్పటిదాకా ఇళ్లకే పరిమితమైన యువకులు జూలు విదిల్చారు. ఆకతాయిలు వివిధ రకాల జూదాలపై దృష్టి సారించారు. ఎవరికి తోచిన విధంగా వారు  కనీసం మాస్కులు ధరించకుండా, భౌతిక దూరం పాటించకుండా గుంపులు గుంపులుగా చేరి ఆటలాడుతూ స్థానికులకు భయాందోళనలు కలిగిస్తున్నారు. బుధవారం స్థానిక వైకుంఠపురం, విఠల్‌ నగర్, ప్రకాష్‌ నగర్‌లలో  కనీస జాగ్రత్తలు పాటించకుండా ఆటలాడుతున్న వారిని గమనించిన సాక్షి ఫోటోలు తీస్తుండగా ఆ యువకులు ముఖాలకు చేతులు అడ్డుపెడుతూ కాలికి బుద్ధి చెప్పారు. పోలీసులు గస్తీలు ముమ్మరం చేసి జూదాలను అరికట్టాలని స్థానికులు పోలీసు ఉన్నతాధికారులను కోరుతున్నారు.

మరిన్ని వార్తలు