ఇక 3 ముక్కలు.. 6 నోట్లు

5 Apr, 2015 01:44 IST|Sakshi

జూద నిలయం కానున్న రాజధాని ప్రాంతం
పేకాట క్లబ్‌ల ఏర్పాటుకు రంగం సిద్ధం
మూతపడిన క్లబ్‌లను లీజుకు తీసుకుంటున్న అనంతపురం జిల్లా దేశం నేత
స్థానిక పోలీసుల ఒత్తిళ్లు లేకుండా పై స్థాయి సిఫార్సులు

 
సాక్షి, గుంటూరు : నవ్యాంధ్రప్రదేశ్ నూత న రాజధానిని అత్యాధునిక హంగులతో సింగపూర్ తరహాలో నిర్మిస్తామంటున్న అధికార పార్టీ నేతలు అక్కడి తరహాలో విచ్చలవిడి జూదాన్ని కూడా ఇక్కడ నిర్వహించేందుకు ఏర్పాట్లు ముమ్మరం చేస్తున్నట్టు కనిపిస్తోంది. రాజధాని నగరంగా రూపుదిద్దుకోనున్న గుంటూరుజిల్లాతోపాటు, సమీపంలోని కృష్ణా, ప్రకాశం, పశ్చిమగోదావరి జిల్లాల్లో పేకాట క్లబ్‌లుగా ఒక వెలుగు వెలిగి కొన్నేళ్లుగా మూతపడిన క్లబ్‌లను లీజుకు తీసుకుని అందులో పేకాట నిర్వహించేందుకు సమాయత్తం అవుతున్నారు.

దీనికి అనంతపురం జిల్లాకు చెందిన ఓ ప్రజాప్రతినిధి తనకు సన్నిహితంగా ఉండే ఓ సీనియర్ పోలీసు అధికారి ద్వారా హైదరాబాద్ స్థాయిలో పైరవీలు సాగిస్తున్నట్లు తెలిసింది. క్లబ్‌లు ఉండే ప్రాంతాల్లో ఉన్న అధికారపార్టీ ప్రజాప్రతినిధుల సహకారంతో వారిని భాగస్తులుగా చేసుకుని క్లబ్బుల్లో పేకాట నిర్వహించేందుకు తీవ్రస్థాయిలో ప్రయత్నాలు జరుపుతున్నట్లు సమాచారం. టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇదే ఆలోచనలో ఉన్న సీమనేత రెండు నెలలుగా ప్రయత్నాలను ముమ్మరం చేశారు. బినామీలతో క్లబ్‌లను లీజుకు తీసుకునేలా చేసి స్థానిక పోలీసుల ఒత్తిడి లేకుండా పైస్థాయి అధికారులతో చెప్పించుకుని యథేచ్చగా జూదం నిర్వహించాలని ఆలోచనతో ముందుకు సాగుతున్నారు.

కార్‌‌డ్స రూమ్‌ల ఏర్పాటు..

ముఖ్యంగా గుంటూరు జిల్లాలో కొంతకాలంగా మూతపడి ఉన్న మూడు క్లబ్‌లను వేర్వేరు పేర్లతో రెండు నెలల క్రితం లీజుకు తీసుకుని అందులో కార్డ్స్ రూమ్‌లను ఏర్పాటు చేస్తున్నారు. మంగళగిరి నియోజకవర్గంలోని ఉండే ఓ క్లబ్‌ను విజయవాడకు చెందిన టీడీపీ నేతలతో లీజుకు తీసుకునేలా చేసి అతి త్వరలో ఆ క్లబ్‌లో పేకాట ఆడించేందుకు చర్యలు చేపడుతున్నట్లు సమాచారం. ఈ క్లబ్‌కు పంచాయతీ నుంచి ఎన్వోసీ ఇచ్చేందుకు టీడీపీకి చెందిన ఓ సర్పంచ్ రూ. 10 లక్షలు డిమాండ్ చేసినట్లు చెప్పుకుంటున్నారు. గుంటూరు నగరంలోని పట్టాభిపురంలో 2006 నుంచి మూతపడి ఉన్న నార్త్‌క్లబ్‌ను తెరిచి అందులో పేకాట ఆడిస్తున్నారు.

క్లబ్ స్థాపించిన కుటుంబీకుల్లో ఇద్దరు ఈ విషయాన్ని అర్బన్‌ఎస్పీ సర్వశ్రేష్ఠ త్రిపాఠికి ఫిర్యాదు చేయడంతో గురువారం రాత్రి గుంటూరు వెస్ట్ ఏఎస్పీ వెంకటప్పలనాయుడు ఆధ్వర్యంలో పోలీసులు క్లబ్‌పై దాడులు చేసి పేకాట ఆడుతున్న ఎనిమిది మందిని అరెస్టు చేసి వారి వద్ద నుంచి రూ. 54 వేలు స్వాధీనం చేసుకున్నారు. దీన్ని బట్టి ఒక్కో క్లబ్‌లో ఒక్కో సమయంలో పేకాటను ప్రారంభిస్తూ నెలరోజుల్లో అన్ని క్లబ్‌లు కళకళలాడేలా చేయాలనేది వీరి ప్రయత్నం.

పేకాటకు పూర్వ వైభవం..

గుంటూరు రూరల్ జిల్లాపరిధిలోని చిలకలూరిపేట పట్టణంలో గత ఏడాది మూతబడిన ఓ క్లబ్‌ను తిరిగి తెరిపించి స్థానిక ప్రజాప్రతినిధుల సహకారంతో మళ్లీ పాతరోజులు గుర్తుకు తెచ్చేలా పేకాట నిర్వహించాలని ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం. దీనిలో భాగంగా సదరు క్లబ్ సభ్యులంతా గురువారం రాత్రి క్లబ్‌లో సమావేశమై దీనిపై చర్చించినట్లు తెలుస్తోంది. అదేవిధంగా కృష్ణా జిల్లా ఆరిగిరిపల్లి వద్ద ఉన్న ఓ క్లబ్ కొన్నేళ్లుగా మూతపడి ఉంది. దీన్ని సైతం నెల క్రితం తెరిచి అనంతపురం ప్రజాప్రతినిధితోపాటు, విజయవాడ నగరానికి చెందిన ఓ ప్రజాప్రతినిధి కలిసి, నిర్వహించాలనే ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం.

పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో ఉన్న క్లబ్‌లో సైతం పేకాట నిర్వహించేందుకు సీమనేత తీవ్రస్థాయిలో పైరవీలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది. రానున్న రోజుల్లో రాజధాని ప్రాంతంతోపాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో పేకాట క్లబ్‌లు ఏర్పాటు చేసి, ధనార్జనే ధ్యేయంగా అధికారపార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు ఆలోచన సాగిస్తున్నారు. ప్రజాప్రతినిధులే జూదాన్ని ప్రోత్సహించేలా వ్యవహరిస్తుండటంపై ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది.

మరిన్ని వార్తలు