బరితెగింపు!

19 Jul, 2015 00:14 IST|Sakshi

♦ అత్యాచారం నిందితుల ఆగడాలు
♦ పోలీసుల పేరిట బెదిరింపులు
 
 విజయవాడ సిటీ : ముక్కు పచ్చలారని పదిహేనేళ్ల బాలికను గదిలో నిర్భంధించి సామూహిక అత్యాచారం చేశారు. ప్రతిఘటించిన ఆమెను కర్రలతో కొట్టి చిత్రహింసలకు గురి చేశారు. మద్యం మత్తులో ఆమెకు మత్తు మందిచ్చి తమ కామవాంఛను తీర్చుకున్నారు. ఆపై అపస్మారక స్థితిలోని బాలికను ఇంటి వద్ద దించేసి వెళ్లారు. ఇదేంటని ప్రశ్నించిన వారికి తాము పోలీసుల మంటూ బెదిరింపులకు దిగారు. తప్పు చేశామనే పశ్చాత్తాపం లేకుండా నేరుగా ఆమెను ఇంటి వద్దనే వదిలేసి వెళ్లిన వారి బరితెగింపును చూసి స్థానికులు ముక్కున వేలేసుకున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి.

జిల్లాలోని గుడ్లవల్లేరు మండలం నక్కలపాలెం గ్రామానికి చెందిన దుర్గాప్రసాద్, పృధ్వీ, జాన్, వెంకటేశ్వరరావు అలియాస్ వెంకీ గుణదల బెత్లెహేంనగర్‌లో గదులు అద్దెకు తీసుకొని ఉంటూ ప్రసాదంపాడులోని చాక్లెట్ల తయారీ కంపెనీలో పని చేస్తుంటారు. సెలవు రోజులు, ఆదివారాల్లో గుణదల మేరీమాత ఆలయం సమీపంలో ఆవారాగా తిరుగుతూ మహిళలు, బాలికలను వేధింపులకు గురి చేస్తుంటారు. కొందరిని మాయ మాటలతో మభ్యపెట్టి వలలో వేసుకొని కామవాంఛను తీర్చుకుంటున్నట్టు స్థానికుల సమాచారం.

 ఇదీ జరిగింది
 మాచవరం కార్మికపురానికి చెందిన పదిహేనేళ్ల బాలిక చర్చికి రాకపోకలు సాగించే సమయంలో వీరిలో ఓ యువకుడు ఆమెను ట్రాప్ చేశాడు. ఐదో తరగతి వరకు చదివిన బాలిక తండ్రి చనిపోవడంతో తల్లి ఆమెను ఇంటి వద్దనే ఉంచుతోంది. తల్లి ఇళ్లలో దుస్తులు ఉతుకుతుండగా, ఆమె సోదరులు రోజువారీ పనులకు వెళుతుంటారు. ఈ నెల 14న తల్లి పనికి వెళ్లడంతో ఒంటరిగా ఇంట్లో ఉన్న ఆమె గుణదలలోని చర్చికి వెళ్లింది. ఇదే సమయంలో నిందితుల్లో ఒకరైన దుర్గాప్రసాద్ ఆమెను తన రూమ్‌కి తీసుకెళ్లాడు. అక్కడ సాయంత్రం వరకు ఉంచి తిరిగి ఇంటికి పంపేశాడు.

మరుసటి రోజు అతను చెప్పినట్టుగా వచ్చిన ఆమెను ముందస్తు పథకంలో భాగంగా స్నేహితులతో కలిసి జక్కంపూడిలోని జెఎన్‌యూఆర్‌ఎం గృహాలకు తీసుకెళ్లారు. అక్కడ ఖాళీ ప్లాట్లలో ఆమెపై అత్యాచారం చేశారు. ప్రతిఘటించిన బాలికను కర్రలతో తీవ్రంగా కొట్టి చిత్రహింసలకు గురి చేశారు. ఆపై ఆమెను రూమ్‌కి తీసుకొచ్చి మత్తు మందు ఇచ్చి పడుకోబెట్టారు.  మూడు రోజుల పాటు ఆమెపై లైంగిక దాడి చేశారు. దీంతో అపస్మారక స్థితికి చేరుకున్న బాలికను శుక్రవారం మోటారు సైకిల్‌పై తీసుకొచ్చి ఇంటి ముందు పడేశారు.

ఇది గమనించిన స్థానికులు వారిని నిలదీయగా తాము పోలీసులమని చెప్పారు. పైగా ఫోన్ చేసి ‘మా ఎస్‌ఐ గారు’ అంటూ మరో యువకుడితో మాట్లాడించారు. తనకు తాను ఎస్‌ఐగా చెప్పుకున్న ఆ యువకుడు ఆంజనేయస్వామి గుడి సమీపంలో ఉన్నానని చెప్పాడు. బాలికకు ఏమైందంటే తెలియదని ఆగ్రహించాడు. విషయం తెలిసి పని నుంచి వచ్చిన ఆమె తల్లి కుమార్తెకు సపర్యలు చేయగా స్పృహలోకి వచ్చి జరిగిన విషయం చెప్పింది. ఆపై వారి రూమ్ చూపించగా ఇరుగు పొరుగు, బంధువులు నిందితుల్లో ముగ్గురిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నారు.  

 పోలీసులతో దోస్తీ
 పనికి వెళ్లి వచ్చిన తర్వాత అర్ధరాత్రి వరకు వీరు రోడ్లపైనే ఉంటారని స్థానికులు తెలిపారు. ఈ సమయంలో గస్తీ తిరిగే పోలీసులతో వీరు మాట్లాడుతుంటారని తెలిసింది. ఆదివారం, ఇతర రద్దీ సమయాల్లో గుడి వద్దకు వచ్చే పోలీసులతో మాటలు కలిపి గడుపుతుంటారు. పోలీసులతో ఉన్న సత్సంబంధాలను దృష్టిలో ఉంచుకొని నేరం చేసిన తర్వాత స్థానికులను పోలీసుల పేరిట బెదిరింపులకు పాల్పడినట్టు చెపుతున్నారు. పోలీసు తరహా విచారణతో వీరి గత దురాగతాలను వెలుగులోకి తీయాలనేది స్థానికులు కోరుతున్నారు.

 అమాయకత్వం
 కుమార్తె కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేయాలనే ఆలోచన కూడా లేని ఆ మహిళ ఊళ్లలోని బంధువుల ఇళ్లకు వెళ్లి వెదికింది. అప్పటికీ ఆమె ఆచూకీ తెలియకపోవడంతో కన్నీరు మున్నీరవుతూ తెలిసిన వాళ్లద్వారా వాకబ్ చేస్తోంది. ఇలాంటి సమయంలో కుమార్తె సామూహిక అత్యాచారానికి గురికావడంతో ఆమె గుండెలవిసేలా రోదిస్తోంది.

మరిన్ని వార్తలు