గండికోటకు ‘వారసత్వ హోదా’ వచ్చేనా?

17 Jun, 2019 06:47 IST|Sakshi

సాక్షి, కడప : భారతదేశపు గ్రాండ్‌ క్యానియన్‌గా పేరుగాంచి దేశానికి తలమానికంగా నిలిచిన గండికోటకు వారసత్వ హోదా వచ్చే అవకాశంపై పర్యాటకాభిమానుల్లో తిరిగి ఆశలు మొలకెత్తుతున్నాయి. 2012 నుంచి గండికోటకు వారసత్వ హోదా కోసం జిల్లాలోని పర్యాటకాభిమానులేగాక ఇతర జిల్లాలకు చెందిన వారు కూడా ఎన్నో రకాలుగా డిమాండ్‌ చేశారు. గత ప్రభుత్వం, సంబంధిత మంత్రులు, అధికారులను గట్టిగా ఈ విషయంపై అడిగారు.

ఉత్సవాల సందర్భంగా ప్రతి సంవత్సరం జరిగే గండికోట వారసత్వ ఉత్సవాల్లో భాగంగా రెండు సంవత్సరాలుగా సాక్షాత్తు జిల్లా మంత్రి ఆదినారాయణరెడ్డి స్వయంగా నెలరోజుల్లో వారసత్వ హోదా వస్తుందని నమ్మబలికా రు. గత సంవత్సరం కూడా అదే హామీ ఇచ్చారు. కానీ హోదాకు సంబంధించి ఇంతవరకు జిల్లా నుంచి కనీస అభ్యర్థనలు వెళ్లలేదని తెలుసుకున్న పర్యాటకాభిమానులు ఆవేదనకు గురయ్యారు.

వారసత్వహోదా వస్తే....
గండికోటకు వారసత్వ హోదా వస్తే ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు లభిస్తుంది. సంవత్సరానికి రూ. 100 కోట్లు కోట అభివృద్ధికి, మౌలిక వసతుల కల్పన, ఇతర పనుల కోసం కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా అన్ని ప్రముఖ విశ్వవిద్యాలయాలకు చెందిన చరిత్ర పరిశోధకులు, అధ్యయనం కోసం ఈ కోటను ప్రతి సంవత్సరం రెండు, మూడు నెలలపాటు పరిశీలిస్తారు. వారితోపాటు ఆయా దేశాలకు చెందిన పర్యాటకులు కూడా వచ్చే అవకాశం ఉంది.

2012లో గండికోటలో చారిత్రక సంపద అభివృద్ధిలో భాగంగా గండికోటలో వారసత్వ ఉత్సవాలు నిర్వహించాలని జిల్లా పర్యాటకాభిమానులు కోరారు.  ఎట్టకేలకు ప్రభుత్వం దిగివచ్చి 2015 నుంచి ఉత్సవాలను నిర్వహించింది. అప్పటి నుంచి 2019 ఫిబ్రవరి వరకు జరిపారు. ప్రతి సంవత్సరం నిధుల కొరత ఉందని ఉత్సవాలను నిలిపివేసే ప్రయత్నం చేస్తుండడం జిల్లాకు చెందిన పర్యాటకాభిమానులు, పర్యాటక సంస్థల ప్రతినిధులు గట్టిగా పట్టుబట్టడంతో అప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కొద్దిగా ఇవ్వగా.. వేరే శాఖల నుంచి కొద్దిమొత్తాన్ని ఇచ్చి కోట్లాది రూపాయలు ఖర్చయ్యాయని ప్రచారం చేశారు. కానీ ఆ స్థాయి కార్యక్రమాలు జరగకపోవడం గమనార్హం.

దీనికి అంతర్జాతీయ వారసత్వ కట్టడంగా యునెస్కో గుర్తింపు లభిస్తే పుష్కలంగా నిధులు వచ్చి అనుకున్న విధంగా కోటను అభివృద్ధి చేసే అవకాశం లభిస్తుంది. గత ప్రభుత్వాలు అదిగో ఇదిగో అంటూ కాలం గడిపేశారేగానీ ఈ విషయంపై  అభ్యర్థన పంపింది లేదు. ప్రస్తుతం పర్యాటకానికి ప్రత్యేకంగా మంత్రిని నియమించడం, ఆయన కూడా ఈ రంగం అభివృద్ధి పట్ల  ఆసక్తి కనబరుస్తుండడంతో జిల్లా వాసుల్లో గండికోటకు   యునెస్కో గుర్తింపు లభించగలదని ఆశిస్తున్నారు.  ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, పర్యాటకశాఖ మంత్రి గండికోటను సందర్శించాలని కోరుతున్నారు. 

మరిన్ని వార్తలు