అవే కడ‘గండ్లు’

12 Oct, 2014 00:14 IST|Sakshi
అవే కడ‘గండ్లు’
  • మరమ్మతులకు నోచుకోని గండ్లు పడ్డ నదుల గట్లు
  •   ఏళ్లు గడుస్తున్నా పట్టించుకోని అధికారులు, పాలకులు
  •   నిలిచిపోయిన నిధులు : పట్టించుకోని కొత్త సర్కారు
  •   తుపానుతో ఆందోళన చెందుతున్న పరివాహక ప్రాంత ప్రజలు
  • చోడవరం: గతంలో వచ్చిన తుపానులకు గండ్లు పడిన నదుల గట్లకు మరమ్మతులు చేపట్టకపోవడంతో ప్రస్తుతం ఏర్పడిన హుదూద్ తుపానుకు రైతులు, నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు భయాందోళన చెందుతున్నారు. మూడేళ్లుగా లైలా, జల్, నీలం, పైలీన్ తుపాన్లకు పెద్దేరు, బొడ్డేరు, శారద నదులతోపాటు పలు కొండ గెడ్డలకు గండ్లు పడిన విషయం తెలిసిందే. ఈ గండ్లు నేటికీ పూడ్చకపోవడంతో ఇప్పుడు హుదూద్ తుపాను ఎక్కడ గ్రామాలను, పొలాలను ముంచేస్తుందోనని ఆందోళన చెందుతున్నారు.

    గత తుపాన్లకు పీఎస్‌పేట, వడ్డాది, జన్నవరం, రామజోగిపాలెం, చాకిపల్లి, భోగాపురం, బోయిలకింతాడ, గవరవరం, విజెపురం, కెజెపురం, జంపెన ప్రాంతాల్లో నదీగట్లు కోతకు గురయ్యాయి. దీంతో చాకిపల్లి, రామజోగిపాలెం, కన్నంపాలెం, జన్నవరం గ్రామాల్లోకి నీరు వచ్చింది. వేలాది ఎకరాల పొలాలు, ఆయా గ్రామాలు కూడా ముంపునకు గురయ్యాయి. నది గట్ల మరమ్మతులకు సుమారు రూ.100 కోట్లు మంజూరు చేస్తామని అప్పటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రకటించారు.

    ఆ నిధుల ఎన్నికలు కారణంగా నిలిచిపోగా ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం విడుదల చేయలేదు. దీనితో ఇప్పటి వరకు దెబ్బతిన్న గ్రోయిన్లు, గండ్లు పడ్డ గట్లు పటిష్ట పరిచే పనులు జరగలేదు. ఇప్పుడు తాజాగా ముంచుకొస్తున్న హుదూద్ తుపాను మరింత బలపడితే మళ్లీ గ్రామాలు, పంటపొలాలు మునిగిపోయే ప్రమాదం ఉందని నదీ పరివాహక ప్రాంత ప్రజలు, రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ ప్రాంతాలను చోడవరం తహశీల్దార్ శేషశైలజ శనివారం పరిశీలించారు.

    గండ్లు పడ్డ ప్రదేశాల్లో ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని, సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని ఆమె సూచించారు. ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు అధికారులు, రాజకీయ నాయకులు రావడం సూచనలు ఇవ్వడం వెళ్లిపోవడం తప్ప పూర్తిస్థాయిలో గట్లు పటిష ్టపరిచే పనులు చేపట్టలే దంటూ ప్రజలు, రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిధులను వెంటనే విడుదల చేసి పనులు వేగవంతం చేయాలని కోరుతున్నారు.
     

మరిన్ని వార్తలు