జీవితాంతం వినాయక విగ్రహాల పంపిణీ

10 Sep, 2018 10:58 IST|Sakshi
ముచ్చువోలు గ్రామస్తులకు వినాయక విగ్రహం పంపిణీ చేస్తున్న సురేంద్రకుమార్‌రెడ్డి

పర్యాటక శాఖ జాతీయ మాజీ డైరెక్టర్‌ సురేంద్రకుమార్‌రెడ్డి

1,500 విగ్రహాల పంపిణీకి శ్రీకారం

చిత్తూరు, శ్రీకాళహస్తి రూరల్‌ : తాను బతికినంతకాలం ఏటా వినాయక చవితి సందర్భంగా ఉచితంగా వినాయక విగ్రహాలను పంపిణీ చేస్తానని పర్యాటక శాఖ జాతీయ మాజీ డైరెక్టర్‌ తురిమెళ్ల సురేంద్రకుమార్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ నెల 13న వినాయక చవితిని పురస్కరించుకుని ఆదివారం మండలంలోని ముచ్చువోలులో విగ్రహాల పంపిణీకి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 22 ఏళ్లుగా చిత్తూరు, నెల్లూరు జిల్లాలకు చెందిన పట్టణాలు, గ్రామాల్లో విగ్రహాలు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. మూడు విగ్రహాలతో ప్రారంభించి నేడు 1,500 విగ్రహాలు పంపిణీ చేస్తున్నట్లు వెల్లడించారు. ముఖ్యంగా నిరుపేదలు తమ గ్రామాల్లో వినాయక చవితి జరుపుకోవాలంటే విగ్రహాన్ని కొనే స్థోమత ఉండదని, దీన్ని దృష్టిలో పెట్టుకుని ఈ కార్యక్రమం చేపట్టినట్లు చెప్పారు.

రశీదులు తీసుకున్న గ్రామస్తులు ఈ నెల 11న తిరుపతి ప్రాంతంలోని మంగళం సమీపంలో విగ్రహాలను తీసుకోవాలని కోరారు. విగ్రహాల కోసం వచ్చే వారికి అన్నదానం చేయనున్నట్లు పేర్కొన్నారు. అనంతరం డీఎస్పీ రామకృష్ణ మాట్లాడుతూ సురేంద్రరెడ్డి చేపట్టిన కార్యక్రమం మహోన్నతమైందని కొనియాడారు. రష్‌ ఆసుపత్రి అధినేత సిపాయి సుబ్రమణ్యం మాట్లాడుతూ ఎంతో మంది డబ్బులు సంపాదిస్తారే కాని ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం అరుదన్నారు. టీటీడీ ధర్మ ప్రచార పరిషత్‌ జిల్లా కార్యదర్శి పోతుల రాజ్‌కుమార్‌ మాట్లాడుతూ భావితరాల వారికి మన ఆధ్యాత్మిక సంపదను తెలియజేయటానికి ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో నెల్లూరు జిల్లాకు చెందిన బీఎస్పీ నాయకుడు వెంకటరామారావు, రూరల్‌ సీఐ సుదర్శన్‌ప్రసాద్, శుకబ్రహ్మాశ్రమం మేనేజర్‌ ఈశ్వర్‌స్వామి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు