నకిలీ బంగారం ఉచ్చువేసి.. ఆపై చిత్తు

30 Sep, 2019 10:42 IST|Sakshi
బాధితుల వద్ద ఉన్న బంగారు నగలు(ఫైల్‌)

పోలీస్‌స్టేషన్‌ మెట్లెక్కిస్తున్న అత్యాశ

రాజుల కాలం నాటి బంగారం పేరుతో కుచ్చుటోపీ

నెల్లూరు, ప్రకాశం జిల్లాలను టార్గెట్‌ చేసిన ముఠా

సాక్షి, నెల్లూరు: మాటలునేర్చిన మాయగాళ్లు వారు. అమాయకంగా కన్పించేలా నటిస్తారు. మాటల గారడితో దగ్గరవుతారు. అడవిలో పట్టే కముజు పిట్టలను విక్రయిస్తుంటారు. రోజుకోసారి వచ్చి మంచి అడవి కముజు  పిట్ట ఉచ్చులో పడింది ఆ మాంసం తినండి సారూ అంటూ చెబుతారు. ఎదుటి మనిషి మాటలను బట్టి వారిలో అత్యాశ ఉందని గ్రహిస్తారు. వారి దగ్గరవుతున్నట్లు ప్రేమ ఒలకబోస్తూ వారి ఫోన్‌ నంబర్లు తీసుకుంటారు. వారం తర్వాత సారూ.. రాజుల కాలం నాటి బంగారు నగలు తవ్వకాల్లో దొరికాయని, మాకు ఎలా విక్రయించాలో తెలియదని? అవి సగం ధరకే అమ్మిపెట్టమని మొదట కొంత బంగారం నగలు ఇచ్చి  నమ్మిస్తారు. వారి మాటలు నమ్మారో అంతే ఫేక్‌బంగారం అంటగట్టి రూ.లక్షల్లో దోచుకుంటారు. ఇలాంటి అంతర్‌జిల్లా  కేటుగాళ్లు ప్రస్తుతం నెల్లూరు, ప్రకాశం జిల్లాలో తిరుగుతున్నారు. వారి మాయమాటలు నమ్మి లక్షలు పోగొట్టుకున్న సంఘటనలు ఒక నెలలోనే రెండు వెలుగులోకి వచ్చాయి.

మోసం చేసేది ఇలా..
అడవిలో తిరిగే కముజు పిట్టలను పట్టి విక్రయించే ముఠా నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో తిరుగుతోంది. కొందరు యువకులు కముజు పిట్టలను పట్టి విక్రయిస్తామంటూ ఊరూర తిరుగుతూ వ్యవసాయం చేసుకునే కొందరిని టార్గెట్‌ చేస్తున్నారు. రోజు వారీగా పిట్టలను పట్టి రైతులకివ్వడం వారిని మంచి చేసుకుంటారు. అలా కొందరు అమాయక వ్యక్తులతో మాటలు కలిపి వారితో స్నేహంగా ఉంటారు. స్నేహం ముసుగులో వారి ఫోన్‌ నంబర్లు సేకరిస్తారు. రోజువారీగా కముజుపిట్టలను పట్టి పిట్ట మాంసం మంచిదన్న తినండి అంటూ వారిపై ప్రేమ ఒలకపోస్తారు. అలా నమ్మించే ఆ ముఠా సభ్యులు వారం కన్పించకుండాపోయి ఫోన్‌లోనే టచ్‌లో ఉంటారు. ఆపై మెల్లిగా పక్కా ప్లాన్‌తో ఫోన్‌చేసి కర్ణాటక ప్రాంతంలోని మైసూర్‌ ఏరియాలో మా స్నేహితుడు జేసీబీ  డ్రైవర్‌గా పనిచేస్తున్నాడని చెబుతారు. పురాతన భవనం తవ్వుతుంటే రాజుల కాలం నాటి బంగారు ఆభరణాలు దొరికాయని నమ్మబలుకుతారు.

కానీ ఆ బంగారం విక్రయించాలంటే మాకు ఎవరూ తెలియదని? వాటిని విక్రయించిపెడితే అందులో కొంత కమిషన్‌ ఇస్తామంటూ చెబుతారు. ముందుగా బంగారు ఆభరణాలు ఉన్నాయని, వచ్చి పరిశీలించుకోమని నమ్మిస్తారు. వారి మాటలను నమ్మిన వెళ్లిన వారికి ఫేక్‌ బంగారం నగలు చూపించి అందులో నాలుగుచోట్ల స్వచ్ఛ బంగారం పూసలు పెట్టి వారి ముందే ఆ పూసలు కట్‌చేసి పరిశీలించుకోమని నమ్మబలుకుతారు. ఆ బంగారు పూసలు తీసుకెళ్లి షాపులో చూపిస్తే మేలిమి బంగారమేనని తేలుతుంది. అంతే సగం ధరకే మేలిమి బంగారు ఆభరణాలు వస్తాయని నమ్మి కేటుగాళ్లకు డబ్బు కట్టి తీసుకుంటారు. ఆపై ఆ ముఠా సభ్యుల ఫోన్‌ నంబర్‌ మూగబోతుంది. నగలు ఇంటికి తీసుకెళ్లి మళ్లీ పరిశీలించుకుంటే అది ఫేక్‌ బంగారం తెలిసిపోయి బాధితులు లబోదిబోమంటున్నారు.

నెలలో రెండు సంఘటనలు
నెల్లూరు, ప్రకాశం జిల్లాలను టార్గెట్‌ చేసిన ఆ ముఠా సభ్యులు ఒక నెల వ్యవధిలోనే రెండు జిల్లాలో బురిడీ కొట్టించి రూ.లక్షలు దోచుకున్నారు. గత నెలలో సంగం మండల కేంద్రంలో ఇదే తరహాలో నకిలీ బంగారం అంటగట్టి రూ.లక్షలు కొట్టేసిన ఇద్దరు సభ్యులను స్థానిక పోలీసులు అరెస్ట్‌ చేసి జైలుకు పంపారు. సంగంలో కేబుల్‌ యజమానిని ఇదే తరహాలో బురిడీ కొట్టించి మోసం చేసి పోలీసులకు చిక్కి కటకటాల పాలయ్యారు. అలాగే ప్రకాశం జిల్లాకు చెందిన సింగరాయకొండ వాసులకు కూడా మరో ముగ్గురు సభ్యులు బురిడీకొట్టి నకిలీ బంగారం అంటగట్టి దాదాపు రూ.18 లక్షల నగదుతో ఉడాయించారు. అయితే నకిలీ బంగారం లావాదేవీలు  కావలి కేంద్రంగా జరగడంతో బాధితులు కావలి పోలీసులను ఆశ్రయించారు.

రాయచోటి వాసులుగా గుర్తింపు
నకిలీ బంగారం ఉచ్చువేసి సొమ్ము చేసుకునే ముఠా సభ్యులు రాయచోటి ప్రాంత వాసులుగా గుర్తించినట్లు తెలుస్తోంది. ఆ ప్రాంతానికి చెందిన ఓ ముఠా విడిపోయి జిల్లాలవారీగా తిరుగుతూ ఇలాంటి మోసాలకు పాల్పడుతున్నట్లు సమాచారం. వారి నకిలీ బంగారం ఉచ్చులో చిక్కుకున్న చాలామంది బయటకు పొక్కితే పరువుపోతుందని చెప్పుకోలేక పోతున్నారు. తాజాగా ఈ రెండు సంఘటనలతో పోలీసులు ఇలాంటి వారి పట్ల జాగ్రతగా ఉండాలని సూచిస్తున్నారు.

మరిన్ని వార్తలు