తప్పు ఎవరు చేసినా ప్రభుత్వం క్షమించదు 

21 Oct, 2019 11:45 IST|Sakshi
ఆళ్లగడ్డలో సీఎం రిలీఫ్‌ ఫండ్‌ చెక్కులు అందిస్తున్న శాసనమండలి విప్‌ గంగుల ప్రభాకర్‌రెడ్డి   

చంద్రబాబువి దిగజారుడు మాటలు 

ఆళ్లగడ్డకు డిగ్రీ కళాశాల మంజూరైనట్లు వెల్లడి 

సాక్షి, ఆళ్లగడ్డ రూరల్‌ : తప్పు ఎవరు చేసినా ప్రభుత్వం క్షమించదని, ఈ విషయాన్ని మఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టంగా చెబుతున్నారని శాసన మండలి విప్‌ గంగుల ప్రభాకర్‌రెడ్డి అన్నారు. అయితే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు వాస్తవాలు తెలుసుకోకుండా దిగజారుడు మాటలతో ప్రభుత్వంపై బుదరజల్లేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ఆయన తీరు మార్చుకోకపోతే ఊరుకోబోమని హెచ్చరించారు. సీఎం రిలీఫ్‌ ఫండ్‌ నుంచి 12 మందికి మంజూరైన రూ.3,12,000కు సంబంధించిన చెక్కులను ఆదివారం ఆయన ఆళ్లగడ్డలోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో బాధితులకు అందించారు. అనంతరం చాగలమర్రి వెళ్లిన ఆయన వైఎస్సార్సీపీ మండల కన్వీనర్‌ కుమార్‌రెడ్డి నివాసంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆయా కార్యక్రమాల్లో ఆయన మాట్లాడుతూ  ‘యురేనియం తవ్వకాలు ఆపాలని టీడీపీ  పోరాడుతుంటే ప్రభుత్వం అక్రమ కేసులు పెడుతోందని చంద్రబాబు మాట్లాడడం సిగ్గుచేటు.

40 ఏళ్ల అనుభవం ఉందని చెప్పుకునే ఆయన ఇలాంటి మాటలు మాట్లడడం సరికాదు. ఆ పార్టీ నాయకుల లావాదేవీల్లో వచ్చిన విభేదాలతో వారే కేసులు పెట్టుకున్నారు తప్ప ఇతరులెవరూ ఆ పని చేయలేదు. యురేనియం తవ్వకాలను మేము కూడా వ్యతిరేకిస్తున్నాం’ అని ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. అగ్రిగోల్డ్‌ బాధితుల కోసం ప్రభుత్వం రూ.265 కోట్లు విడుదల చేసిందని, రూ.10వేల లోపు వారికి చెల్లించే ఏర్పాటు చేస్తుందని తెలిపారు. ఇటీవలే ఆళ్లగడ్డకు డిగ్రీ కళాశాల మంజూరైనట్లు వెల్లడించారు. ఎవరు తప్పు చేసినా ఉపేక్షించవద్దని ఐఏఎస్, ఐపీఎస్‌ ఆఫీసర్ల సమావేశాల్లో కూడా చెప్పిన గొప్ప నాయకుడు సీఎం జగన్‌మోహన్‌రెడ్డి అని తెలిపారు. 90 శాతం రైతులకు వైఎస్సార్‌ భరోసా సాయం అందిందని, మిగతా 10 శాతం మందికి సాంకేతిక సమస్యలతో రాలేదన్నారు. సమస్య పరిష్కరించి వారికి కూడా సాయం అందిస్తామన్నారు. వరదల కారణంగా దెబ్బతిన్న రోడ్ల మరమ్మతులకు రూ.35 కోట్లు మంజూరైందన్నారు. వైఎస్సార్‌సీపీ నాయకులు గంధం రాఘవరెడ్డి, సింగం భరత్‌రెడ్డి, వెంకటేశ్వరరెడ్డి, చాగలమర్రి విలేకరుల సమావేశంలో  జిల్లా ప్రధాన కార్యదర్శులు వీరభద్రుడు, గణేష్‌రెడ్డి, సేవాదళ్‌ అధ్యక్షుడు వెంకటరమణ, పార్టీ నాయకులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు