గంగువాడ ఏటీఎంలో చోరీ యత్నం

14 Mar, 2015 01:39 IST|Sakshi

పాతపట్నం: మండలంలోని గంగువాడలోని ఎస్‌బీఐ ఏటీఎంలో చోరీకి దొంగలు గురువారం అర్ధరాత్రి తర్వాత ప్రయత్నించారు.  సెక్యూరిటీ గార్డు అడ్డుకోవడంతో పరారయ్యారు. స్థానికులు, సెక్యూరిటీ గార్డు కథనం ప్రకారం.. గంగువాడ ఏటీఎం వాచ్‌మన్ కె.భాస్కరరావు ఆ కేంద్రానికి తాళాలు వేసి లోపల పడుకున్నాడు. గురువారం అర్ధరాట్రి 12.20గంటల సమయంలో ఇద్దరు వ్యక్తులు ద్విచక్ర వాహనంపై వచ్చితాళాలు పగలు గొట్టారు. వాచ్‌మన్ నిద్రలేచి.. ఏంకావాలని ప్రశ్నించాగా డబ్బులు డ్రా చేయాలని చెప్పారు. అయితే ఉదయం రావాల్సిందేనని చెప్పినా, వారు వినిపించుకోకుండా తాళాలు బద్ధలు గొట్టారని వాచ్‌మన్ తెలిపారు. అరిచే ప్రయత్నం చేయగా ఆయనపై దాడికి దిగారు.

ఆయన తప్పించుకుని అరుస్తూ గ్రామంలోకి పరుగెత్తడంతో దుండగులు బైక్‌పై పరారయ్యారు. గ్రామస్తులు గాలించినా వారు దొరకలేదు. స్థానికులు పోలీసులకు, బ్యాంకు సిబ్బందికి ఫోన్‌ద్వారా సమాచారం ఇచ్చారు. స్థానిక సీఐ జె.శ్రీనివాసరావు, ఎస్సై బి.సురేష్‌బాబు వచ్చి విచారణ  జరిపారు. పాలకొండ డీఎస్పీ సిహెచ్.ఆదినారాయణకు విషయాన్ని తెలియజేయడంతో ఆయన వచ్చి వాచ్‌మన్‌తో మట్లాడారు.

దొంగలకు సంబంధించిన ఒక బ్యాగ్,  యాక్సిల్ బ్లేడ్ దొరికాయని పోలీసులు తెలిపారు. పాలకొండ సీఐ ఎన్.వేణుగోపాలరావు డాగ్‌స్కాడ్, వేలిముద్రలు సేకరించారు. 2012లో ఇదే స్టేట్‌బ్యాంక్‌లో దొంగలు చోరీ చేశారని, ఇది రెండోసారి అని స్థానికులు చెప్పారు. ఒడిశా సరిహద్దులో ఉండటం వల్ల ఆ ప్రాంతానికి చెందినవారే దొంగతనాలకు పాల్పడుతున్నారా? ఇంకేవరైనా ఉన్నారా? అన్నది తేలాల్చి ఉందని, సీసీ పుటేజీలు పరిశీలిస్తామని సీఐ తెలిపారు.

మరిన్ని వార్తలు