చొక్కా.. చాంతాడంత..

6 Mar, 2017 01:20 IST|Sakshi
చొక్కా.. చాంతాడంత..

డాబాగార్డెన్స్‌ (విశాఖ): గెట్‌ మై టైలర్‌ స్టార్టప్‌ కంపెనీ రూపొందించిన అతి పొడవైన షర్ట్‌ను మంత్రి గంటా శ్రీనివాసరావు ఆదివారం నగరంలోని ఓ హోటల్లో ఆవిష్కరించారు. 47 అడుగుల పొడవు, 23 అడుగుల వెడల్పులో షర్ట్‌ను తయారు చేశారు. ఈ సందర్భంగా మంత్రి గంటా మాట్లాడుతూ విద్యార్థులు చదువు పూర్తయిన వెంటనే ఉద్యోగాలు చేయడమే ధ్యేయంగా కాకుండా ఉద్యోగాలు సృష్టించే స్థాయికి చేరుకోవాలని హితవు పలికారు.

ఫలితంగా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా మారడానికి స్టార్టప్‌ కంపెనీలు ఎంతగానో దోహదపడతాయన్నారు. తూర్పుగోదావరి జిల్లాలోని సూరంపాలెం ఆదిత్యా ఇంజినీరింగ్‌ కాలేజ్‌ చైర్మన్‌ నల్లమిల్లి శేషారెడ్డి, వైస్‌ చైర్మన్‌ నల్లమిల్లి సతీష్‌రెడ్డి ప్రోత్సాహంతో ఆ కళాశాల విద్యార్థులు ఇంతవరకు నాలుగు స్టార్టప్‌ కంపెనీలు ప్రారంభించారని తెలిపారు. స్టార్టప్‌ కంపెనీ ప్రతినిధులు మాట్లాడుతూ గెట్‌ మై టైలర్‌ ఆన్‌లైన్‌ స్టోర్‌ ద్వారా సుమారు ఐదు వేల మంది నిరుద్యోగ యువత దీనిలో భాగస్వామ్యమయ్యారని తెలిపారు. గృహిణులు, మహిళలు ఇంటి వద్దే ఉండి టైలరింగ్‌ ద్వారా ఉపాధి పొందవచ్చని సూచించారు.

మరిన్ని వార్తలు