ఓ మనిషీ! తెలుసుకో ఇందులో పరమార్థం

21 Aug, 2019 07:52 IST|Sakshi
ఓడలరేవు నదీ సంగమ ప్రాంతంలో సముద్ర తీరానికి చేరిన వ్యర్ధాలు

సాక్షి, తూర్పుగోదావరి :  సముద్రం తన గర్భంలో ఏదీ ఉంచుకోదు ... ఆలస్యమవొచ్చేమోగానీ అంతా బయటకు తన బలమైన కెరటాలతో విసిరికొట్టేస్తోంది. సముద్రమే కాదు నది, సరస్సు, చిన్న చెరువైనా అంతే చేస్తుంది. ‘ఛీ...ఫో’ అని అంటున్నా అన్ని జలాలూ ఒక్కటై ఛీత్కరిస్తున్నా ... అర్థం చేసుకోకుండా నిస్సిగ్గుగా అన్ని నీటి వనరులనూ తమ శక్తికొలదీ కలుషితం చేయడమే పనిగా పెట్టుకున్నట్టుగా మనుషులు తయారయ్యారు. ఇందుకు ఉదాహరణే అల్లవరం మండలంలోని ఓడలరేడు సముద్ర తీరప్రాంతం. ఇటీవల గోదావరి నదికి భారీ వరదలు వచ్చిన నేపథ్యంలో ఎగువ ప్రాంతాల నుంచి వివిధ రకాల వేల టన్నుల వ్యర్థాలు సముద్రంలో కలిశాయి. వీటిని భీకర అలలతో సముద్రుడు తీరంవైపు బలంగా విసిరేయడంతో ఓడలరేవు నదీ సంగమ ప్రాంతం నుంచి కొమరగిరిపట్నం వరకూ సుమారు ఆరు కిలోమీటర్ల పొడవున రాకాసి కొండల్లా పేరుకుపోయాయి.

చెత్త, ప్లాస్టిక్‌ సీసాలు, మద్యం సీసాలు, చెట్లు, చేమలతోపాటు మృత కళేబరాలు నాలుగు అడుగుల ఎత్తులో పేరుకుపోయాయి. ఈ కాలు ష్యం కారణంగా మత్స్య సంపదకు తీరని నష్టం వాటిల్లుతోందని మత్స్యకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ‘ఓ మనిషీ ఇదిగో వ్యర్థం ... తెలుసుకో ఇందులో పరమార్థం’ అని ప్రకృతి పరోక్షంగా హెచ్చరిస్తున్నా మార్పు కనిపించడం లేదని ప్రకృతి ప్రేమికులు ఆవేదన వ్యక్తం చేస్తుండగా... ఈ పరిస్థితి పర్యావరణానికి తీవ్ర నష్టం చేకూర్చి మానవ మనుగడకు ముప్పు తెస్తుందని పర్యావరణ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.
– అల్లవరం (అమలాపురం)
ఫొటో: కట్టా మురళీ కృష్ణ

మరిన్ని వార్తలు