వామ్మో.. ఈశ్వరమ్మ!

29 May, 2018 12:48 IST|Sakshi

సూళ్లూరుపేటరూరల్‌:   క్యామెల్‌ సేవా సంస్థతో రూ.కోట్లు కాజేసిన సూళ్లూరుపేట మున్సిపల్‌ వైస్‌ చైర్‌పర్సన్‌ గరిక ఈశరమ్మ అవినీతి, అక్రమాలు రోజుకొకటి వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే నాబార్డు, స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలను మోసగించి రూ.9.21 కోట్ల రుణం పొందారు. అందులో రూ.7.08 కోట్లు తిరిగి చెల్లించని కారణంగా నాబార్డు సంస్థ జిల్లా కేంద్ర సహకార బ్యాంక్‌ అధికారుల సాయంతో ఈశ్వరమ్మపై కేసు పెట్టడం, ఈ కేసులో ఆమెను మాజీ మంత్రి పరసా వెంకటరత్నం పోలీస్‌ కస్టడీ నుంచి తప్పించడం తెలిసిందే. తాజాగా మెప్మా ద్వారా మరుగుదొడ్ల సొమ్మును కాజేసినట్లు వెలుగులోకి వచ్చింది. దేవాలయం భూములను పట్టాలుగా ఇప్పిస్తానని అంకణానికి ఇంత చొప్పున వసూలు చేసిన విషయం వెలుగు చూసింది. 

ఆత్మగౌరవం అభాసుపాలు
కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛభారత్‌ అని, రాష్ట్ర ప్రభుత్వంఆత్మగౌరవమని పేర్లు పెట్టి పేదలకు వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించే పథకానికి శ్రీకారం చుట్టితే ఈశ్వరమ్మ ఆ పథకాన్ని అభాసుపాల్జేసింది. సూళ్లూరుపేట మున్సిపాలిటీలోని 16వ వార్డులో ఈశ్వరమ్మ మరుగుదొడ్లు నిర్మించే బాధ్యతను భుజానకెత్తుకుంది. ఈ పథకంలో ఒక్కో మరుగుదొడ్డికి ప్రభుత్వం రూ.15 వేలను మూడు విడతలుగా విడుదల చేసింది. నాగరాజపురం, వేనాటి మునిరెడ్డి లెప్రసీ కాలనీ, కాలువకట్ట గిరిజనులకు మొత్తం 68 మరుగుదొడ్లు మంజూరయ్యాయి.

పురపాలక సంఘ పరిధిలోని పొదుపు సమాఖ్య నాయకుల జాయింట్‌ అకౌంట్‌లో దీనికి సంబంధించిన సొమ్ము జమ అయ్యేది. ఈశ్వరమ్మ ఆ సమాఖ్య నాయకుల సహకారంతో సొమ్ము మొత్తం స్వాహా చేసింది. కానీ మరుగుదొడ్లు మాత్రం నిర్మించిన దాఖలాలు లేవు. లెప్రసీ కాలనీలో మరుగుదొడ్ల నిర్మాణానికి తెచ్చిన సిమెంట్‌ ఇటుకలను మళ్లీ తీసుకెళ్లి పోయింది. దీంతో ఆ కాలనీలోని 33 ఇళ్లకు ఒక్క మరుగుదొడ్డి కూడా నిర్మితం కాలేదు. గిరిజనకాలనీలో మరుగుదొడ్లు కట్టించిన దాఖలా లేదు. నాగరాజపురంలో చాలా మందికి కేవలం రూ.5 వేలు మాత్రమే చెల్లించింది. కొందరు తమ సొంత సొమ్ముతో మరుగుదొడ్లు నిర్మించుకున్నారు. దీంతో ప్రభుత్వ ఉద్దేశం పక్కదారి పట్టింది. ఈ వ్యవహారంపై పురపాలక సంఘం ఏఈ ప్రవీణ్‌ మాట్లాతూ వెంటనే విచారణ జరిపిస్తామన్నారు.  

దేవాలయ భూములకు పట్టాలిప్పిస్తానని..  
సూళ్లూరుపేటలోని నాగరాజపురంలో తడ మండలం వాటంబేడు శివాలయానికి చెందిన దేవుడి మాన్యం ఉంది. ఈ స్థలాన్ని చాలా మంది ఆక్రమించుకుని పక్కా ఇళ్లు నిర్మించుకున్నారు. వాటిల్లో క్యామెల్‌ సేవా సంస్థకు చెందిన రెండు పెద్ద భవనాలు కూడా ఉన్నాయి. దీంతో ఈశ్వరమ్మ ఇక్కడ ఆక్రమించుక్ను స్థలాలకు ప్రభుత్వం నుంచి పట్టా తెప్పిస్తానని మాయమాటలు చెప్పి స్థానికుల నుంచి ఒక్కో అంకణానికి రూ.100 చొప్పున సొమ్ము వసూలు చేసింది. ఏళ్లు గడుస్తున్నా ఇక్కడున్న వారిలో ఎవరికీ పట్టాలు వచ్చిన దాఖలాలు లేవు.  

అంధులనే కనికరం కూడా లేదు
వీరిద్దరూ కళ్లు కనిపించని వృద్ధులు. ఈమె పేరు ఊరుబిండి శ్రీనివాసన్, చెల్లమ్మ దంపతులు. వీరికి పిల్లు లేరు. వీరికి 30 ఏళ్ల క్రితం ప్రభుత్వం లెప్రసీ కాలనీలో ఇంటి స్థలం పట్టా ఇచ్చింది. వీరికి నేటికీ పక్కా ఇల్లు కట్టించిన దాఖలాలు లేవు. ఇంత కాలం వీరు పరదా కప్పిన గుడిసెలో జీవిస్తూ వచ్చారు. ప్రస్తుతం సూళ్లూరుకు చెందిన బూదూరు వెంకటయ్య అనే బేల్దారి మేస్త్రీ తన సొంత ఖర్చులతో రేకుల ఇల్లు కటిస్తున్నాడు. శ్రీనివాసన్‌ దంపతులు వారానికి ఒక్కసారి సబ్‌ అర్బన్‌ రైల్లో చెన్నైకు వెళ్లి దేవాలయాల ముంగిట భిక్షమెత్తుకుంటారు. ఆ వచ్చిన డబ్బులతో వీరు కాలం వెల్లదీస్తున్నారు. అలాంటి వీరికి మరుగుదొడ్డి అవసరమైన సౌకర్యం. ఈశ్వరమ్మ వీరికి దొడ్డి కట్టిస్తానని ఇటుక రాళ్లను ఇంటి ముందు దించింది. కొన్ని రోజుల తర్వాత వాటిని తీసుకెళ్లి పోయింది. దీంతో నేటికీ ఈ ముసలి వారు పక్కనున్న కాళం గి నదినే ఆశ్రయిస్తూ కాలం గడుపుతున్నారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు