చుక్క నీరందడం లేదు..

11 Oct, 2018 06:49 IST|Sakshi

నదులు, కాలువలున్నా ఫలితం సున్నా

వరుణుడి కరుణ కోసం ఎదురుచూపులు 

లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్ట్‌ మంజూరు చేయాలి..

జగన్‌మోహన్‌రెడ్డికి వినతిపత్రం అందజేసిన తుమ్మికాపల్లి గ్రామస్తులు 

ప్రజాసంకల్పయాత్ర బృందం:  గ్రామం చుట్టూ నదులు, ప్రధాన కాలువలున్నా పంట పొలాలకు చుక్క నీరు అందడం లేదు. కాలువలు, నదులు చూసుకునేందుకు తప్ప సాగుకు ఏ మాత్రం ఉపయోగపడడం లేదు.. ప్రతి ఏటా వర్షాల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి.. దీంతో అప్పులు పాలవ్వాల్సి వస్తోంది. లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్ట్‌ మంజూరు చేస్తే ఈ ప్రాంతమంతా సస్యశ్యామలవుతుంది. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చాక తమ ప్రాంతానికి లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్ట్‌ మంజూరు చేయాలని కోరుతూ తుమ్మికాపల్లికి చెందిన రైతులు వైఎస్సార్‌సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డికి బుధవారం వినతిపత్రం అందజేశారు. గజపతినగరం మండలం నారాయణ గజపతిరాజపురం వద్ద ప్రజా సంకల్పయాత్ర మధ్యాహ్న భోజన విరామ సమయంలో గ్రామస్తులు, రైతులు జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి సమస్యలు వివరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, తమ గ్రామం మీదుగా తోటపల్లి కుడి ప్రధాన కాలువ వెళ్తోందని తెలిపారు. అలాగే గ్రామం చుట్టూ చంపావతి నది ప్రవహిస్తోందని.. అయినప్పటికీ పంట పొలాలకు నీరు రావడం లేదని జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకువచ్చారు. సరైన ప్రణాళికలు లేకపోవడం వల్లే అందుబాటులో సాగునీటి వనరులున్నా పంట పొలాలకు తరలించుకోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. తోటపల్లి కాలువలో గాని చంపావతి నదిలోనైనా లిఫ్ట్‌ ఇరిగేషన్‌ పథకం ఏర్పాటు చేసి రైతులను ఆదుకోవాలని కోరారు. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి లిఫ్ట్‌ ఇరిగేషన్‌ పథకం కోసం ప్రయత్నించారని, ఇంతలో ఆయన అకాల మరణం చెందడంతో తమను ఎవ్వరూ పట్టించుకోవడం లేదని వాపోయారు. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రాగానే రైతులను ఆదుకోవాలని కోరారు. 

భద్రత కల్పించాలి..
 దివంగత ముఖ్యమంత్రి, మహానేత వైఎస్‌.రాజశేఖర్‌రెడ్డి హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా నియమితులైన రెండు వేల మంది ఆరోగ్యమిత్రలను తొలగించేందుకు ప్రభుత్వం చూస్తోందని ఆరోగ్యమిత్రల యూనిట్‌ ప్రతినిధులు జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకువచ్చారు. ప్రజలకు ఎంతో సేవ చేస్తున్న తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు.  ప్రజాసంకల్పయాత్ర మధ్యాహ్న భోజన విరామ సమయంలో వైఎస్సార్‌సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి సమస్యలు వివరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, 2007లో ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా రెండు వేల మంది ఆరోగ్యమిత్రలను ప్రభుత్వం నియమించిందని చెప్పారు. అతి తక్కువ వేతనాలతో 11 సంవత్సరాలుగా విధులు నిర్వహిస్తున్నామన్నారు. వైఎస్సార్‌ హయాంలో  నియమితులమయ్యామనే అక్కసుతోనే తమను తొలగించడానికి ప్రస్తుత ప్రభుత్వం చూస్తోందని ఆరోపించారు. 2016లో తమను తొలగించేందుకు జీఓ కూడా విడుదల చేయడంతో హైకోర్టును ఆశ్రయించామన్నారు. దీంతో కోర్టు తమను కొనసాగించాలని తీర్పునిస్తూ సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కూడా ఆదేశించిందని తెలిపారు.  అయినప్పటికీ తమను తొలగించడానికి కుట్ర పన్నుతోందన్నారు. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రాగానే తమకు ఉద్యోగ భద్రత కల్పించడంతో పాటు బీమా కల్పించాలని కోరారు.

మరిన్ని వార్తలు