నగదు బదిలీ ‘కాక ’

4 Mar, 2015 01:49 IST|Sakshi

కలెక్టరేట్‌కు వెల్లువెత్తుతున్న ఫిర్యాదులు
     ఆధార్ నంబర్ ఇస్తున్నా నగదు
     బదిలీ కాని పరిస్థితి  
     అవస్థలు పడుతున్న వినియోగదారులు
 
 విజయనగరం కంటోన్మెంట్: కొత్త వలసకు చెందిన కంది సత్యనారాయణకు గ్యాస్ కనెక్షన్ ఉంది. దానికి ఆధార్ నంబర్ సీడింగ్‌తో పాటు ఎస్‌బీఐ బ్యాంకు అకౌంట్ నంబర్‌ను కూడా అందజేశారు.  ఈయనకు నగదు బదిలీ పథకాన్ని అమలు చేశారు  అయితే  ఈయన దగ్గర గ్యాస్ సిలిండర్ కోసం పూర్తిస్థాయి నగదు తీసుకున్నప్పటికీ  సబ్సిడీ డబ్బులు మాత్రం అకౌంట్లో జమ కాలేదు. దీంతో ఆయన కలెక్టరేట్‌కు వచ్చి ఫిర్యాదు చేశారు. మొత్తంగా ఇటువంటి వారు వేల సంఖ్యలో ఉన్నారు. వారంతా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పూర్తిస్థాయిలో అమలు చేయలేని ఈ పథకాన్ని ఎందుకు ప్రవేశపెట్టి ఇబ్బందులకు గురిచేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. దీని వల్ల అవస్థలు  పడుతున్నామని వాపోతున్నారు.
 
 జిల్లాలోని వినియోగదారుల ఖా తాలకు కాకుండా ఇతర ఖాతాలకు జమ అవుతున్న సందర్భాలు కూడా ఉన్నా యి. దీంతో ఈ పథకం వల్ల వినియోగదారులకు సౌకర్యాల కన్నా ఇబ్బందులే ఎక్కువగా ఉన్నాయని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఎనిమిది వందల రూపాయలకు పైగా డబ్బు గ్యాస్ సిలిండర్‌కు చెల్లిస్తున్నప్పటికీ సిలిండర్‌కు రూ.440 మినహాయిస్తే మిగతా సొమ్ము సబ్సిడీగా రావాల్సి ఉందని, దీనిని చెల్లించడం లేదని అడుగుతున్న వినియోగదారులకు గ్యాస్ ఏజెన్సీలు కూడా సక్రమంగా సమాధానాలు చెప్పడం లేదని అంటున్నారు. జిల్లా వ్యాప్తంగా  నగదు బదిలీని అమలుచేస్తామని గతంలో పలుమార్లు చెప్పిన అధికారులు ఆధార్ సీడింగ్ పూర్తిగా జరగకపోవడంతో ఇబ్బందులు కూడా పడ్డారు.
 
 అయితే ఇప్పుడు దాదాపు 95 శాతం మందికి ఆధార్ నమోదు చేయ డంతో నేరుగా నగదు బదిలీ పథకాన్ని అమలు చేస్తున్నారు. కానీ నగదు మాత్రం బదిలీ కావడం లేదు. జిల్లాలో 5 కొత్త ఏజెన్సీలతో కలిపి మొత్తం 24 ఏజెన్సీలలో 3,28,658 గ్యాస్ కనెక్షన్లున్నాయి.ఈ కనెక్షన్లలో లక్షా 25వేలు దీపం పథకానికి సంబంధించిన గ్యాస్ కనెక్షన్లున్నాయి. మొత్తం కనెక్షన్లలో దాదాపు 2.80లక్షల కనెక్షన్లకు ఆధార్ అనుసంధానం చేశారు. కానీ నగదు బదిలీ మాత్రం కావడం లేదు. ఈ నేపథ్యంలో కలెక్టరేట్‌కు ఈ తరహా ఫిర్యాదులు ఎక్కువవుతున్నాయి. దీనిపై  ఏజెన్సీ సిబ్బంది మాట్లాడుతూ ఎక్కువ మంది వస్తుండడంతో తాము సమాధానం చెప్పడానికి  ఇబ్బందులు పడాల్సి వస్తోందంటున్నారు.  
 
 మార్చి నెలాఖరు వరకూ గడువు ఇచ్చినా..
 జనవరి నెల నుంచి నగదు బదిలీ పథకాన్ని అమలు చేయనున్నామని చెప్పినప్పటికీ అన్ని వివరాలూ సమర్పించేందుకు మార్చి నెల వరకూ అవకాశం ఇచ్చారు. అయితే జిల్లాలో మాత్రం మార్చి నెల వరకూ చూడకుండా ఏకంగా జనవరి నెల నుంచే గ్యాస్ కనెక్షన్లు నిలిపివేశారు. బుక్ చేస్తే ఆధార్, బ్యాంకు అకౌంట్ నంబర్లు ఇచ్చిన వారికి కూడా మీ కనెక్షను సక్రమంగా లేదని సమాధానం వస్తోందని వినియోగదారులు వాపోతున్నారు. అదేవిధంగా గ్యాస్ బుకింగ్ కోసం ఫోన్ చేస్తే ఆధార్, బ్యాంకు అకౌంట్లు సమర్పించిన వారికి కూడా మీ ఆధార్ నంబర్ సమర్పించలేదని సమాధానాలు వస్తున్నాయని వాపోతున్నారు. దీనిపై అధికారులు చొరవ తీసుకోవాల్సి ఉందని కోరుతున్నారు.
 

>
మరిన్ని వార్తలు