ధర గడువు పెంపు

2 Jan, 2014 04:21 IST|Sakshi
శ్రీకాకుళం కలెక్టరేట్, న్యూస్‌లైన్:  గ్యాస్ వినియోగదారులతో కేంద్ర ప్రభుత్వం, ఇంధన సంస్థలు ఆడుకుంటున్నాయి. కొత్త సంవత్సర కానుకగా గ్యాస్ కనెక్షన్‌కు ఆధార్‌ను అనుసంధానం చేసే గడువును ఫిబ్రవరి నెలాఖరు వరకు పొడిగిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేయగా, ఇదే సమయంలో చడీచప్పుడు లేకుండా గ్యాస్ సిలెండర్ ధరను ఉత్పత్తి సంస్థలు ఒకేసారి రూ.217 మేరకు పెంచేశాయి. ఈ నిర్ణయాలు అంతిమంగా ఆధార్ అనుసంధానం చేసుకున్న వారికే ఎక్కువ నష్టం కలుగజేస్తున్నాయి. జిల్లాలో గ్యాస్‌తో ఆధార్ అనుసంధానానికి డిసెంబర్ 31 వరకు గడువు ఇచ్చారు. అప్పటివరకు అనుసంధానం చేసుకోనివారికి సబ్సిడీ పోగా రూ.419కి సిలెండర్ సరఫరా చేస్తున్నారు. అనుసంధానం చేసుకున్న వారు మాత్రం సిలెండర్‌కు మొదట రూ.1109 చెల్లిస్తే.. ఆ తర్వాత వారి బ్యాంకు ఖాతాకు రూ.614 సబ్సిడీ మొత్తం జమ చేస్తున్నారు.
 
 ఈ లెక్కన వారు సిలెండర్‌కు మిగతావారి కంటే అదనంగా రూ.152 భరిస్తున్నారు. తాజాగా రూ.217 పెంచడంతో సిలెండర్ ధర రూ.1326కు చేరింది. పెరిగిన ధర ప్రకారం సబ్సిడీ కూడా పెరిగి బ్యాంకు ఖాతాల్లో రూ.800 మేరకు జమ అవుతుందంటున్నారు. అదే సమయంలో అనుసంధానం చేసుకోని వారికి ఈ పెరుగుదల రూ.25 మాత్రమే. ఇప్పటివరకు రూ.419 చెల్లించిన వీరు ఇక నుంచి రూ.444 చెల్లించాల్సి ఉంటుంది. పైగా అనుసంధానం చేసుకోవడానికి మరో రెండు నెలల అవకాశం లభించడంతో అప్పటివరకు ధర పెరగకుండా ఉంటే ఈ సబ్సిడీ రేటే వర్తిస్తుంది. దీంతో ఎలా చూసినా ప్రభుత్వ సూచన మేరకు ముందుగానే అనుసంధానం చేసుకున్న వారే ఆర్థికంగా నష్టపోతున్నారు. జిల్లాలో 2.92 లక్షల మంది వంటగ్యాస్ వినియోగదారులు ఉన్నారు.
 
 వీరిలో ఇప్పటివరకు 80 శాతం మందే ఆధార్ అనుసంధానం చేయించుకున్నారు. ఇంకా సుమారు 60 వేల మంది మిగిలిపోవడంతో డిసెంబర్ 31తో ముగిసిన గడువును కేంద్రం ఫిబ్రవరి 28 వరకు పొడిగించింది. ఇది వీరికి ఉపయుక్తంగానే ఉన్నా.. అనుసంధాన చేసుకున్న వారు ధర పెరుగుదలతో బెంబేలెత్తుతున్నారు. సిలెండర్ విడిపించుకున్నప్పుడు పూర్తి మొత్తం చెల్లిస్తున్నప్పటికీ సబ్సిడీ మొత్తం బ్యాంకు ఖాతాలకు సక్రమంగా జమ కావడం లేదన్న ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. దీంతో బ్యాంకుల చుట్టూ, గ్యాస్ ఏజెన్సీల చుట్టూ తిరగాల్సి వస్తోందని వినియోగదారులు వాపోతున్నారు. దీనికి తోడు ధర ఎప్పటికప్పుడు పెంచేస్తుండటంతో ఆర్థిక భారంతో సతమతమవుతున్నారు. మరోవైపు డెలివరీ చార్జీల పేరిట కొంతమంది డెలివరీ బాయ్స్ అదనపు సొమ్ము గుంజుతున్నారని ఆరోపిస్తున్నారు.
 
మరిన్ని వార్తలు