‘గ్యాస్’ బుకింగ్ ఇకపై ఆన్‌లైన్‌లో..

29 Jul, 2014 01:33 IST|Sakshi

ఒంగోలు టూటౌన్ :  గ్యాస్ వినియోగదారులకు బుకింగ్ కష్టాలు తప్పాయి. గ్యాస్ ఏజెన్సీల వద్దకు వెళ్లకుండానే ఇంటి నుంచే సెల్‌ఫోన్ ద్వారా సిలిండర్ బుక్ చేసుకునే వ్యవస్థను గ్యాస్ కంపెనీలు అందుబాటులోకి తెచ్చాయి. గ్యాస్ అక్రమాలకు చెక్ పెట్టేందుకు ఇంటరాక్టివ్ వాయిస్ రికార్డింగ్ సిస్టం(ఐవీఆర్‌ఎస్) పద్ధతిని ప్రవేశపెట్టాయి. ఆన్‌లైన్ బుకింగ్‌కు గాను గ్యాస్ కంపెనీలకు ప్రత్యేక నంబర్లు కేటాయించారు. ఇచ్చిన నంబర్లకు నేరుగా వినియోగదారుడు ఫోన్ చేస్తే సిలిండర్ బుక్ చేసుకునే విధానం గురించి తెలియజేస్తారు.

 వినియోగదారుడు ఏ గ్యాస్ ఏజెన్సీ పరిధిలో ఉన్నాడో.. ఆ ఏజెన్సీ ఫోన్ నంబర్‌ను సెల్‌ఫోన్‌లో ఎంటర్ చేయాలి. అనంతరం గ్యాస్ బుక్ నంబర్‌ను నమోదు చేయాలి. ...అలా ఆన్‌లైన్‌లో ఒక వాయిస్ అడిగిన సమాచారాన్ని ఫోన్‌లో ఎంటర్ చేస్తే మీ గ్యాస్ బుకింగ్ అయిపోయినట్లే. గ్యాస్ బుక్ చేసినట్లు సెల్‌కు మెసెజ్ కూడా పంపిస్తారు. ఈ విధానం ప్రస్తుతం అమలు చేస్తున్నట్లు డీఎస్‌ఓ కే రంగాకుమారి తెలిపారు. జిల్లాలో ఇండేన్ గ్యాస్, భారత్ గ్యాస్, హెచ్‌పీ గ్యాస్ కంపెనీలకు సంబంధించిన 57 ఏజెన్సీలు ఉన్నాయి. సింగిల్ సిలిండర్లు 3, 3,403, డబుల్ సిలిండర్లు 2,47,092, దీపం కనెక్షన్లు 1,45,516, వాణిజ్య సిలిండర్లు 9,426 ఉన్నాయి. వీరందరూ ఇక నుంచి ఆన్‌లైన్‌లో గ్యాస్ బుక్ చేసుకోవాల్సిందేనని డీఎస్‌ఓ స్పష్టం చేశారు.

మరిన్ని వార్తలు