సబ్సిడీకి ఎసరు!

13 Jun, 2015 03:10 IST|Sakshi
సబ్సిడీకి ఎసరు!

- గ్యాస్ సబ్సిడీ రూ.200 రద్దుకు ప్రభుత్వ పన్నాగం
- వినియోగదారులకు నచ్చజెప్పి దరఖాస్తులు పూర్తిచేయించాలని హుకుం
- గ్యాస్ ఏజెన్సీలకు టార్గెట్లు   
- త్వరలో స్పెషల్ డ్రైవ్‌లు
- ఆసక్తి చూపని వినియోగదారులు
విజయవాడ :
చుక్కలనంటుతున్న నిత్యావసర వస్తువుల ధరలతో విలవిల్లాడుతున్న వినియోగదారుడిని మరింత కుంగదీసేందుకు కేంద్ర ప్రభుత్వం పన్నాగం పన్నుతోంది. వంటగ్యాస్ కోసం ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీ సొమ్ము రద్దుచేసే ఎత్తుగడ వేసింది. గ్యాస్ సబ్సిడీ సొమ్మును స్వచ్ఛందంగా వదులుకోండంటూ ఇప్పటికే పిలుపునిచ్చిన ప్రభుత్వం నెమ్మదిగా పూర్తిస్థాయిలో రద్దు చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇందులో భాగంగానే స్వచ్ఛందంగా సబ్సిడీ వదులుకుంటున్నట్లు దరఖాస్తులు సేకరించాలని గ్యాస్ కంపెనీలను ఆదేశించింది.

ఈ నేపథ్యంలో గ్యాస్ కంపెనీల అధికారులు ఏజెన్సీలకు దరఖాస్తులు పంపి సబ్సిడీ కనెక్షన్లను తగ్గించాలని లోపాయికారి ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాలో హెచ్‌పీసీ, ఐవోసీ, బీపీసీ కంపెనీలకు చెందిన 74 గ్యాస్ ఏజెన్సీలు ఉన్నాయి. వీటిలో 11 లక్షల మంది వినియోగదారులు ఉన్నారు. వీరిలో సంపన్న, ఉద్యోగ, మధ్యతరగతి వర్గాలకు నచ్చజెప్పి సబ్సిడీ వదులుకునేలా చూడాలని గ్యాస్ కంపెనీలు టార్గెట్ విధించినట్టు సమాచారం. ఒక్కో గ్యాస్ ఏజెన్సీ నెలకు 200 నుంచి 500 మంది గ్యాస్ సబ్సిడీని వదులుకునేలా దరఖాస్తులు సేకరించాలని మౌఖిక ఆదేశాలు గ్యాస్ డీలర్లకు అందాయి. టార్గెట్ విధించి సబ్సిడీ దరఖాస్తులు పూర్తి చేయించాలని ఆదేశించడంలో డీలర్లు అనేక ఇబ్బందులు పడుతున్నారు.

వినియోగదారుల అనాసక్తి
వినియోగదారులు మాత్రం గాస్ సబ్సిడీ వదులుకునేందుకు ఆసక్తి చూపించడం లేదు. ప్రధానమంత్రి పేరుతో గ్యాస్ ఏజెన్సీల వద్ద ఏర్పాటుచేస్తున్న దరఖాస్తులను ఎవరూ పట్టించుకోవట్లేదు. ప్రస్తుతం సిలిండర్ ఒక్కింటికీ రూ.700 వసూలు చేస్తుండగా, అందులో రూ.200 సబ్సిడీని వినియోగదారుడి ఖాతాకు జమ చేస్తున్నారు. దీనిద్వారా ప్రభుత్వంపై సబ్సిడీ భారం పడుతోంది.

గృహ అవసరాలకు వినియోగించే సబ్సిడీ గ్యాస్ భారం తడిసి మోపెడవటంతో కేంద్రప్రభుత్వం రానున్న కొద్దినెలల్లో స్పెషల్ డ్రైవ్‌లు నిర్వహించి ప్రజలను చైతన్యవంతం చేసి సబ్సిడీని ఎత్తివేసే కార్యక్రమం అమలు చేయనుంది. ఇదిలా ఉంటే.. ప్రభుత్వం చట్టం చేయకుండా గ్యాస్ సబ్సిడీని రద్దు చేయటానికి పన్నాగం పన్నుతోందని ప్రజాసంఘాలు మండిపడుతున్నాయి.

మరిన్ని వార్తలు