జీరో ఎఫ్‌ఐఆర్‌ అమలుచేస్తాం

3 Dec, 2019 04:27 IST|Sakshi

పోలీస్‌స్టేషన్‌ పరిధితో సంబంధం లేకుండా 

ఏ స్టేషన్‌లో అయినా ఫిర్యాదు చేయొచ్చు 

ఫిర్యాదు తీసుకోని పోలీసులపై చర్యలు 

డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ 

సాక్షి, అమరావతి: పోలీస్‌స్టేషన్‌ పరిధితో సంబంధం లేకుండా ఏ స్టేషన్‌లో అయినా ఫిర్యాదు చేసేలా జీరో ఎఫ్‌ఐఆర్‌ విధానాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయనున్నట్లు డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ తెలిపారు. ఈ మేరకు అన్ని రేంజీల డీఐజీలు, జిల్లా ఎస్పీలు, స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్లకు మెమో జారీ చేశామన్నారు. ప్రజలు తమ సమస్యలపై కేసు పెట్టేందుకు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లినప్పుడు నేరం లేదా ఘటన జరిగిన చోటు తమ పరిధిలో లేదని వెనక్కి పంపుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని.. ఇది సరికాదని పేర్కొన్నారు. సోమవారం మంగళగిరిలోని పోలీసు ప్రధాన కార్యాలయంలో గ్రామ, వార్డు మహిళా సంరక్షణ కార్యదర్శులకు శిక్షణ ఇచ్చే ట్రైనర్లకు శిక్షణా కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.

తమ పరిధిలో లేని చోట నేరం జరిగినా దానిపై ఫిర్యాదు వస్తే సంబంధిత పోలీస్‌స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని, ఆ తర్వాత దాన్ని సంబంధిత పోలీస్‌స్టేషన్‌కు బదిలీ చేయాలని ఆదేశించారు. ఏ పోలీసు అధికారైనా తమ పరిధి కాదని ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయడానికి నిరాకరిస్తే వారిని ఐపీసీ166–ఏ ప్రకారం ప్రాసిక్యూట్‌ చేయడానికి ఆదేశిస్తామని, శాఖాపరమైన చర్యలకు సిఫారసు చేస్తామని స్పష్టం చేశారు. అన్ని యూనిట్ల అధికారులు తమ పరిధిలోని పోలీసుస్టేషన్లు, అధికారులకు ఈ మార్పును తెలిపి అమలయ్యేలా చూడాలన్నారు. ‘స్పందన’ కార్యక్రమంలో ఇప్పటికే 11 వేల కేసులు నమోదు చేశామన్నారు. వీటిలో 18 శాతం మహిళలపై వేధింపులవేనని, ఫిర్యాదుదారుల్లో 52 శాతం మహిళలేనని వెల్లడించారు.   

అన్ని సేవలు ఒకే చోట పొందేలా యాప్‌.. 
మహిళలు, చిన్నారులు ఆపదలో ఉన్నప్పుడు 100, 112, 181 తదితర టోల్‌ఫ్రీ నంబర్లకు ఫోన్‌ చేయాలని డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ చెప్పారు. ఈ నంబర్లన్నింటినీ ఏకీకృతం చేసే ప్రయత్నాల్లో ఉన్నామని, అప్పుడు దేనికి ఫోన్‌ చేయాలనే సందిగ్ధం బాధితులకు ఉండదన్నారు. అన్ని సేవలు ఒకే చోట పొందేలా ఒక యాప్‌ను రూపొందిస్తున్నట్లు తెలిపారు. మహిళల రక్షణ సవాల్‌గా మారిందని, గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందని ఆశిస్తున్నామన్నారు.

గ్రామ సచివాలయంలోనూ మహిళలు ఫిర్యాదులు ఇవ్వొచ్చని, మహిళా సంరక్షణ కార్యదర్శులు వాటిని పోలీస్‌స్టేషన్‌కు పంపుతారని వివరించారు. పరిపాలన వ్యవస్థను క్షేత్ర స్థాయికి తీసుకువెళ్లే గ్రామ సచివాలయ వ్యవస్థ ఒక విప్లవమని పేర్కొన్నారు. మహిళల భద్రత, రక్షణ, రూల్‌ ఆఫ్‌ లా, పోలీసు సమస్యలు, శాంతిభద్రతలు, మహిళా శిశు సంక్షేమ సేవలపై మహిళా సంరక్షణ కార్యదర్శులకు అవగాహన కల్పిస్తామన్నారు. 14,967 మంది గ్రామ, వార్డు మహిళా సంరక్షణ కార్యదర్శులకు రెండు వారాలపాటు శిక్షణ ఇస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో అదనపు డీజీ రవిశంకర్‌ అయ్యన్నార్, ఇతర పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.  

ప్రధానమంత్రి లైఫ్‌ సేవింగ్‌ మెడల్‌కు అర్జునరావు పేరు 
విజయవాడలో బందరు కాలువలో కొట్టుకుపోతున్న మహిళను ప్రాణాలకు తెగించి రక్షించిన ఆర్‌ఎస్‌ఐ అర్జునరావును ప్రధానమంత్రి లైఫ్‌ సేవింగ్‌ మెడల్‌కు ప్రతిపాదిస్తున్నట్లు డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ ఒక ప్రకటనలో తెలిపారు. అతడి ధైర్యసాహసాలను అభినందిస్తున్నట్లు చెప్పారు.   

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా