బాధ్యతలు స్వీకరించిన ఏపీ డీజీపీ

1 Jun, 2019 12:39 IST|Sakshi

ఆంధ్రప్రదేశ్‌ నూతన డీజీపీగా గౌతమ్‌ సవాంగ్‌

బాధ్యతలు స్వీకరించిన పోలీస్‌ బాస్‌

సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ నూతన డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీసుగా సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి గౌతమ్‌ సవాంగ్‌ శనివారం మధ్యాహ్నం బాధ్యతలు స్వీకరించారు. మంగళగిరిలోని డీజీపీ కార్యాలయానికి చేరుకున్న ఆయన తొలుత గాడ్‌ ఆఫ్‌ ఆనర్‌ స్వీకరించారు. పోలీస్‌బాస్‌కు పూజారులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. ఆయనకు పుష్పగుచ్ఛాలు అందించి పోలీస్‌ అధికారులు అభినందనలు తెలిపారు. సవాంగ్‌ విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డీజీగా కొనసాగుతారు. ఇప్పటిదాకా డీజీపీగా పనిచేసిన ఆర్పీ ఠాకూర్‌ను ప్రింటింగ్, స్టేషనరీ అండ్‌ స్టోర్స్, పర్ఛేజ్‌ కమిషనర్‌గా బదిలీ చేశారు.

(డీజీపీగా గౌతమ్‌ సవాంగ్‌)

ప్రజలకు మెరుగైన సేవలు..
డీజీపీగా బాధ్యతలు చేపట్టిన అనంతరం గౌతమ్‌ సవాంగ్‌ మీడియాతో మాట్లాడారు. తనపై పూర్తి విశ్వాసం ఉంచి డీజీపీగా నియమించిన ఏపీ సీఎం జగన్‌కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. బాధ్యతలు సమర్థవంతంగా నిర్వర్తించి ప్రజలకు మెరుగైన సేవలందిస్తామని అన్నారు. గత ఐదేళ్లుగా ఏపీ పోలీసులు ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నారని తెలిపారు. ప్రతి పోలీసు సేవను వినియోగించుకుంటామని చెప్పారు. పోలీసు వ్యవస్థలో  పారదర్శకత, సంస్కరణలు, సంస్థాగత మార్పులు అవసరమని పేర్కొన్నారు.  

‘ముఖ్యమంత్రికి పోలీసులపట్ల ఎంతో అభిమానం, గౌరవం ఉంది. సేవాభావంతో పనిచేయాలని ఆయన కోరారు. పోలీస్‌శాఖకు కావాల్సిన అన్నిరకాల సదుపాయాల్ని కల్పిస్తామని సీఎం హామీనిచ్చారు. మహిళలు, పిల్లలు, వృద్ధుల రక్షణకై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటాం. క్రైమ్‌ ఎక్కువగా మహిళలు, చిన్నపిల్లలపై జరుగుతోంది. నేర రహిత ఏపీని తీర్చిదిద్దుతాం. సైబర్‌క్రైమ్‌ అరికట్టడంలో ఏపీ పోలీసులు మరింత కష్టపడాలి. రోడ్డు ప్రమాదాల్లో ఏపీ మూడో స్థానంలో ఉండటం విచారకరం. ప్రమాదాల నివారణకు చర్యలు చేపడుతాం’అన్నారు.

సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వార్తలు