కాంగ్రెస్‌పై సీనియర్ల ఫైర్

15 Apr, 2014 00:37 IST|Sakshi
 •      గౌతమ్‌కు టిక్కెట్ ఇవ్వడంపై నిరసనలు
 •      కాంగ్రెస్‌కు మూకుమ్మడి రాజీనామాలు చేసిన ఎస్సీ నేతలు
 •  అమలాపురం టౌన్, న్యూస్‌లైన్ : రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేసినా... పార్టీనే నమ్ముకున్నాం. కష్టాకాలంలో తోడుగా ఉన్నాం. అలాంటి మమ్మల్ని అసెంబ్లీ అభ్యర్థుల ఎంపికలో కనీసం పరిగణనలోకి తీసుకోలేదని అమలాపురంలోని కాంగ్రెస్ పార్టీ సీనియర్ ఎస్సీ నేతలు నిరసన వ్యక్తం చేశారు. అమలాపురం కాంగ్రెస్ టికెట్‌ను స్థానికేతరుడైన జంగా గౌతమ్‌కు ఇవ్వడాన్ని తామంతా వ్యతిరేకిస్తున్నట్టు వెల్లడించారు. దీనికి నిరసనగా వారంతా సోమవారం  కాంగ్రెస్ పార్టీకి మూకుమ్మడిగా రాజీనామాలు చేశారు.

  రాజీనామా లేఖలను ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డికి ఫ్యాక్సు ద్వారా పంపించారు. స్థానిక శ్రీదేవి రెసిడెన్సీలో సమావేశమైన కాంగ్రెస్ ఎస్సీ నాయకులు గౌతమ్‌కు టిక్కెట్ ఇచ్చిన తీరుపై సుదీర్ఘంగా చర్చించారు. చర్చల సమయంలోనే ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డితో ఫోనులో మాట్లాడారు. ఈ విషయంలో తానేమి చేయలేనని ఆయన చేతులెత్తేశారు. ఎమ్మెల్యే కన్నబాబుతో కూడా మాట్లాడారు. కంగారు పడి ఏ నిర్ణయం తీసుకోవద్దని కన్నబాబు సూచించినా ఎస్సీ నాయకులు వినకుండా రాజీనామాలు చేశారు.

  జిల్లా కాంగ్రెస్ కిసాన్ సెల్ చైర్మన్ గెడ్డం సురేష్‌బాబు, ఉప్పలగుప్తం మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ఇసుకపట్ల రఘుబాబు, రాష్ట్ర కాంగ్రెస్ ఎస్సీ సెల్ కన్వీనర్ ఈతకోట బాలాస్వామి, జిల్లా టీఎన్‌టీయూసీ ఉపాధ్యక్షుడు ములపర్తి సత్యనారాయణ, రాష్ట్ర ఎస్సీ సెల్ మాజీ కన్వీనర్ యార్లగడ్డ రవీంద్ర, ఐఎన్‌టీయూసీ జిల్లా మహిళా కన్వీనర్ కుంచే స్వర్ణలత, రాష్ట్ర కాంగ్రెస్ మహిళా విభాగం ఉపాధ్యక్షురాలు పెయ్యల సంధ్య తదితరులు కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన వారిలో ఉన్నారు. వీరంతా స్థానిక పార్టీ నాయకులుగా అమలాపురం కాంగ్రెస్ టికెట్టు ఆశించినవారే. వీరితో పాటు దాదాపు 100 మంది కాంగ్రెస్ ఎస్సీ నాయకులు కూడా రాజీనామాలు చేశారు.
   
  చిరంజీవి పట్టుపడితే టిక్కెట్ ఇచ్చేస్తారా
   
  కేంద్రమంత్రి చిరంజీవికి సన్నిహితుడైన జంగా గౌతమ్‌కు అమలాపురం నియోజకవర్గంతో ఏమాత్రం పరిచయం, సంబంధం లేదని ఆయనకు టిక్కెట్ ఇవ్వటం దారుణమని నియోజకవర్గ కాంగ్రెస్ ఎస్పీ నేతలు అన్నారు. రెండు దశాబ్ధాలకు పైగా పార్టీనే అంటిపెట్టుకుని ఉన్న తమను ఇప్పుడు కరివేపాకులా పక్కన పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం గౌతమ్‌కు టిక్కెట్ ఇచ్చే ముందు తమ అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకపోవడం మరింత బాధిస్తోందని అన్నారు.

  చిరంజీవికి గౌతమ్‌పై అంత ప్రేమ ఉంటే వేరే నియోజకవర్గంలో టిక్కెట్ ఇవ్వాలే తప్ప పార్టీ కోసం పనిచేస్తున్న సీనియర్లను విస్మరించడం సరికాదని హెచ్చరించారు. ఈ ఎన్నికల్లో కార్యాచరణను రూపొందించి గౌతమ్‌ను ఓడించి పార్టీ పెద్దలకు బుద్ధి చెబుతామని ఇసుకపట్ల రఘుబాబు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా చిరంజీవికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తక్షణమే గౌతమ్‌కు ఇచ్చిన టెక్కెట్‌ను ఉపసంహరించుకుని స్థానికులైన పార్టీ ఎస్సీ నాయకుల్లో ఎవరో ఒకరికి టిక్కెట్ ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా