నాలుగేళ్ల పిల్లలు సాధారణంగా ఏం చేస్తారు..!

24 Nov, 2014 01:13 IST|Sakshi
నాలుగేళ్ల పిల్లలు సాధారణంగా ఏం చేస్తారు..!

 సీతంపేట: నాలుగేళ్ల పిల్లలు సాధారణంగా ఏం చేస్తారు... ఇళ్లంతా అల్లరి చేస్తారు... బడికి వెళతావా అంటే ఊ..హూ అంటారు.. అఆలు దిద్దిస్తే అష్ట వంకరలు తిప్పుతారు. ఏబీసీడీలు చదవమంటే నోరు మెదపరు. అయితే పాత కొత్త పణుకువలసకు చెందిన భవిత అలా కాదు. జనరల్ నాలెడ్‌‌జలో దిట్ట. ఏ ప్రశ్న అడిగినా టక్కమని సమాధానం చెబుతుంది. ఒక సారి వింటే చాలు గుర్తుపెట్టేసుకుంటుంది. ప్రపంచ దేశాలు-వాటి రాజధానులు, రాష్ట్రాలు-వాటి రాజధానులు, ఏయే సరస్సులు ఏ రాష్ట్రంలో ఉన్నాయి.. తెలుగు నెలలు, సంవత్సరాలు, ప్రముఖులు సమాధుల పేర్లు, అవి ఎక్కడ ఉన్నాయి వంటివి ఇట్టే చెప్పేస్తోంది.
 
 రోజూ ఇంటి వద్ద జనరల్‌నాలెడ్జ్ చెప్పడానికి పాప కోసం అరగంట పాటు కేటాయిస్తానని.. తొమ్మిదో తరగతి విద్యార్థికి ఓ మాస్టారు పాఠాలు చెబుతుండగా విని రాజధానులు వాటి పేర్లు చెప్పాలని ఇంటి వద్ద పట్టుబట్టిందని.. దీంతో జనరల్ నాలెడ్‌‌జ విషయాలు భవితకు చెబుతున్నామని.. అన్నీ చెప్పడమే తరువాయి ఇట్టే గుర్తుపెట్టుకుని అనర్గలంగా చెప్పేస్తుందని స్థానిక మండల పరిషత్ పాఠశాల ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న ఆమె తండ్రి దిలీప్ చెప్పారు. ఆదివారం యూటీఎఫ్ ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో సీతంపేట మండలంలో వన భోజనాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా పలువురు ఉపాధ్యాయులు ఆ చిన్నారిని పలు ప్రశ్నలు వేయగా టకటక చెప్పేస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. చిన్నారి ప్రతిభను గమనించిన ఉపాధ్యాయులు అభినందించారు.
 

మరిన్ని వార్తలు