యంత్రాలు ఉన్నా ఉపయోగం సున్నా..

28 Jun, 2019 14:03 IST|Sakshi
తహసీల్దార్‌ కార్యాలయంలో పనిచేయని జనరేటర్‌

ప్రభుత్వ కార్యాలయాల్లో నిరుపయోగంగా జనరేటర్లు

కొన్ని నెలలుగా పనిచేయని వైనం

లక్షల రూపాయల ప్రజాధనం వృథా

సాక్షి, పొన్నలూరు (ప్రకాశం): ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రజలకు సంబంధించిన పనులను సకాలంలో చేసి వారికి మైరుగైన సేవలు అందించేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తెచ్చారు. అలాగే మీ–సేవలో నమోదు చేసే పత్రాలను వెంటనే తనిఖీ చేసి అప్‌లోడ్‌ చేయడానికి కంప్యూటర్లు, అధికారులు నిర్వహించే వీక్షణ సమావేశాలకు ఎల్‌ఈడీ ప్రొజెక్టర్‌ను ఏర్పాటు చేశారు. అదే విధంగా విద్యుత్‌ సరఫరా నిలిచిపోతే ఉద్యోగుల విధులకు ఆటంకం కలగకుండా నిత్యం కొనసాగించేందుకు జనరేటర్లు కూడా సమకూర్చారు. అయితే అధికారుల బాధ్యాతారాహిత్యంతో పాటు పర్యవేక్షణ లేకపోవడంతో కార్యాలయాల్లో అమర్చిన జనరేటర్లు, ఎల్‌ఈడీ ప్రొజెక్టర్లు నిరుపయోగంగా మారాయి. దీంతో ప్రభుత్వ లక్ష్యంతో పాటు రూ.లక్షల ప్రజల సొమ్ము వృథా అవుతోంది.

పనిచేయని ఎల్‌ఈడీ ప్రొజెక్టర్‌
మండల అభివృద్ధి అధికారులతో పాటు కిందిస్థాయి ఉద్యోగులతో ఉన్నతాధికారులు వీడియో కాన్ఫరెన్సులు నిర్వహించేందుకు మండల పరిషత్‌ కార్యాలయంలో ఎల్‌ఈడీ ప్రొజెక్టర్‌ ఏర్పాటు చేశారు. కొన్ని రోజులు వరకు వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులతో దీని ద్వారా వీడియో కాన్ఫరెన్సులు, ఇతర సమావేశాలు నిర్వహించారు. ఆ తరువాత సెట్‌బాక్స్‌ మరమ్మతులకు గురికావడంతో కొన్ని నెలలుగా పనిచేయడం లేదు. దీంతో ఎల్‌ఈడీ ప్రొజెక్టర్‌ పనిచేయకపోవడంతో సమావేశాలు నిర్వహించడం లేదు. ప్రొజెక్టర్‌ పనిచేయని విషయాన్ని సంబంధిత ప్రతినిధులకు తెలిపామని, మరమ్మతులు తలెత్తినప్పడు బాగుచేయాల్సిన సంస్థ దృష్టికి తీసుకపోయినా స్పందించడం లేదని కార్యాలయం అధికారులు తెలిపారు.

పనిచేయని జనరేటర్లు..
తహశీల్దార్‌ కార్యాలయంలో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం కలిగినప్పడు అన్‌లైన్‌ సేవలతో పాటు ఉద్యోగుల విధులు ఆగిపోకూడదని రూ.1.50 లక్షలతో జనరేటర్‌ను ఏర్పాటు చేశారు. కానీ జనరేటర్‌ అమర్చిన తరువాత ఒకటి, రెండు సార్లు వినియోగించారు. ఆ తరువాత సుమారుగా ఐదేళ్లు దాటినా ఇప్పటివరకు ఒక్కసారి కూడా ఉపయోగించిన దాఖలాలు లేవు. డీజిల్‌ పోస్తే పనిచేస్తుంది కానీ అందుకు అయ్యే ఖర్చులు ఎవరు భరించాలో తెలియక కార్యాలయం సిబ్బంది పట్టించుకోవడం లేదు.

అలాగే ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కూడా సుమారుగా రూ.60 వేలతో ఏర్పాటు చేసిన మినీ జనరేటర్‌ నిరుపయోగంగా ఉంది. ఇలా రెండు కార్యాలయాల్లో నిరుపయోగంగా ఉన్న జనరేటర్లను ఒక్కరు కూడా కన్నెత్తిచూసిన పాపాన పోలేదని, యంత్రాలు అందుబాటులో ఉన్నా ఉపయోగమేంటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోని నిరుపయోగంగా ఉన్న యంత్రాలు, పరికరాలను వాడుకలోకి తీసుకవచ్చి విధులకు ఆటంకం కలగకుండా చేయాలని మండల ప్రజలు కోరుతున్నారు.

మరిన్ని వార్తలు