పేరుకే పెద్దమనుషులు

23 Nov, 2014 02:07 IST|Sakshi

సాక్షి ప్రతినిధి, నెల్లూరు: సమాజంలో పెద్దమనుషుల్లా చలామణి అవుతున్న కొందరు నాయకులు ఎర్రచందనం అక్రమ రవాణాలో చక్రం తిప్పుతున్నారు. వారికి స్థానిక పోలీసుల సహకారం మెండుగా ఉన్నట్లు తెలుస్తోంది. సదరు పోలీసులు చేసిన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు.., ఎస్పీ వద్ద మెప్పుపొందేందుకు గతంలో ఎర్రచందనం అక్రమ రవాణాలో పాలుపంచుకున్నవారు.. తప్పు తెలుసుకుని మానేసిన వారిపై కేసులు పెట్టి వేధిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.

ఈ వేధింపులకు గురవుతున్న వారు ప్రధానంగా గతంలో ఈ పెద్ద మనుషులకు అడ్డొచ్చినవారేనని తెలిసింది. గూడూరు, ఆత్మకూరు డివిజన్ పరిధిలో కొందరు పోలీసు అధికారులు తీరే ఇందుకు నిదర్శనం. పోలీసులు, అటవీ అధికారులు గట్టి నిఘాపెట్టినా ఆ డివిజన్ పరిధిలోని ఎర్రచందనం అక్రమ రవాణా గుట్టుచప్పుడుగా సాగిపోతున్నట్లు విశ్వసనీయ సమాచారం. అందుకు కొందరు అధికారులు కూడా సహకరిస్తున్నట్లు తెలిసింది. పెద్దమనుషులుగా చలామణి అవుతున్న టీడీపీ నాయకులు కొందరు ఎర్రచందనం అక్రమరవాణా కేసుల్లో ఇరుక్కోకుండా జాగ్రత్తపడుతున్నారు.

అనంతసాగరం మండల పరిధిలో కొందరు రైతులను స్థానిక పోలీసు అధికారి ఒకరు తీవ్రస్థాయిలో వేధింపులకు గురిచేస్తున్నట్లు సమాచారం. ఏడాది క్రితం ఎప్పుడో ఒకసారి ఎర్రచందనం అక్రమరవాణాలో పాలుపంచుకున్న వారు తప్పు తెలుసుకుని అక్రమరవాణాకు దూరంగా ఉంటూ.. కూలిపని చేసుకుని జీవనం సాగిస్తున్నారు. అయితే వారిని స్టేషన్‌కు పిలిపించి రకరకాల వేధింపులకు గురిచేస్తునట్లు తెలిసింది.

సంబంధం లేదన్నా ఒప్పుకోకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నట్లు ఆ కుటుంబంలోని కొందరు నెల్లూరు కలెక్టరేట్ వద్ద విలేకరులను కలిసి బోరుమన్నారు. అదేవిధంగా అసలు సంబంధమే లేని వ్యక్తులపైనా ఎర్రచందనం అక్రమరవాణా కేసులు బనాయించి వేధింపులకు గురిచేస్తున్నారని మరి కొందరు బాధితులు వివరించారు. అయితే వారి పేర్లు చెప్పడానికి భయపడ్డారు. పేపర్లో తమ పేర్లు, ఫొటోలు వేయవద్దని బతిమలాడారు. తామ ఫిర్యాదు ఇవ్వటానికి వచ్చామని తెలిస్తే ఆ పోలీసులు మమ్మల్ని బతకనివ్వరని వాపోయారు.

 దర్జాగా దొంగలు. డివిజన్ల పరిధిలో కొందరు స్మగ్లర్లు మాత్రం దర్జాగా తిరుగుతున్నారు. ఎర్రచందనం అక్రమరవాణాలో తమకు సంబంధం లేనట్లే నడుచుకుంటూ చలామణి అవుతున్నారు. ఎర్రచందనం అధికంగా ఉన్న అటవీ ప్రాంతంలో సునాయాసంగా వెళ్లి వచ్చేందుకు కొందరు పోలీసులు, అటవీ అధికారుల సహకారంతో దారి ఏర్పాటు చేసుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం గూడూరు, ఆత్మకూరు డివిజన్ పరిధిలోని అటవీ ప్రాంతాల్లో అనేకచోట్ల ఎర్రచందనం దుంగలను డంప్ చేసినట్లు తెలిసింది.

అలా డంప్‌చేసిన దుంగలను ఇటీవల ఓ లారీకి నింపి జిల్లా సరిహద్దు దాటించినట్లు ప్రచారం జరుగుతోంది. అందుకు పెద్ద ఎత్తున ముడుపులు చేతులు మారినట్లు ఆరోపణలు ఉన్నాయి. అయితే ఇవన్నీ కప్పిపుచ్చుకునేందుకు కొందరు పోలీసులు తప్పుడు కేసులుపెట్టి హడావుడి చేస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ విషయంపై ఉన్నతాధికారులు దృష్టిపెట్టి అసలు దోషులను శిక్షించాల్సిన అవసరం ఉంది.
 
 స్మగ్లింగ్‌తో సంబంధం లేదు
 బాలాయపల్లి: వెంకటగిరి వేలుకొండ అడువుల్లో నుంచి తరలిపోతున్న ఎర్ర చందనం స్మగ్లింగ్‌కు వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ ఎటువంటి సంబందం లేదని టీడీపీ  మండల అధ్యక్షుడు రావి మస్తాన్‌నాయుడు, టీడీపీ జిల్లా కార్యదర్శి విందురు పరంధామరెడ్డి,  రైతు సంఘం ఉపాధ్యక్షుడు కొరపాటి రామచంద్రయ్య తెలిపారు. బాలాయపల్లిలో శనివారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో వారు  మాట్లాడుతూ ఎమ్మెల్యే ఓ ఉన్నత స్థానంలో ఉన్నాడన్నారు. ఎర్ర చందనం స్మగ్లింగ్ చేయాల్సిన  అవసరం ఆయనకు లేదన్నారు.

మరిన్ని వార్తలు