ఎమ్మెల్యేల గుప్పెట్లోకి ‘ఇంటి’ గుట్టు!

1 Apr, 2015 01:41 IST|Sakshi
ఎమ్మెల్యేల గుప్పెట్లోకి ‘ఇంటి’ గుట్టు!

జియో ట్యాగింగ్ పూర్తి చేసేందుకు  కసరత్తు
ఇదయ్యాక..ఇళ్ల నిర్మాణాలపై
సామాజిక తనిఖీ తరహా విచారణ
ఆపైన..బిల్లుల చెల్లింపుల్లో జన్మభూమి
కమిటీలకు కీలక బాధ్యత?
బిల్లులు ఆగిపోయి ఏడాదైంది...
బకాయిలు రూ.40కోట్లపైమాటే?
 

ఇందిరమ్మ పథకం అధికార పార్టీ నేతల చే తుల్లోకి వెళ్లే పరిస్థితులు కనిపిస్తున్నాయి. నియోజకవర్గాల వారీగా ఇంటి జాబితాలను ఎమ్మెల్యేలకు అందజేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. ఏప్రిల్ మొదటివారంలో ఈ జాబితాలు ఎమ్మెల్యేలకు అంద నున్నాయి. ఈ చర్యతో గ్రామాల్లో అధికారపార్టీ నేతలు చెప్పినట్టుగానే పథకం అమలయ్యే పరిస్థితులు రానున్నాయన్న ఆందోళన వ్యక్తమవుతోంది.
 
బి.కొత్తకోట:    ఇందిరమ్మ పథకం అమలు బాధ్యతను ఎమ్మెల్యేలకే అప్పగించనున్నట్లు సమాచారం. ఇప్పటికే మండలస్థాయి అధికారులకు ఈమేరకు సమావేశాల్లో ఉన్నతాధికారులు వివరించినట్టు తెలిసింది. జన్మభూమి కమిటీలకు కూడా అధికారాలు కట్టబెట్టే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. కమిటీలకు కూడా ఇందిరమ్మ లబ్ధిదారుల జాబితాను ఇవ్వడమేకాక బిల్లుల చెల్లింపు, లబ్ధిదారుల ఇంటి నిర్మాణాల పరిశీలనలో ప్రమేయం కల్పించే దిశగా చర్యలు ఉండబోతున్నాయన్న సంకేతాలు వెలువడుతున్నాయి. జన్మభూమి కమిటీల్లో అత్యధికులు అధికార టీడీపీ నేతలే ఉండడంతో చర్యలన్నీ వారి కనుసన్నల్లోనే సాగే పరిస్థితులూ లేకపోలేదు. ఏడాదిగా లబ్ధిదారులకు పైసా చెల్లించలేదు. ఇప్పుడు కమిటీలకు బిల్లుల చెల్లింపు వ్యవహారంలో అవకాశం ఇవ్వడం వెనుక అధికార పార్టీకి చెందిన వారికే లబ్ధి చేకూర్చాలన్న లోగుట్టు ఉందన్న విమర్శలూ లేకపోలేదు. ఈ విషయాన్ని ఓ ఉన్నతాధికారి దృష్టికి తీసుకెళ్లగా వివరాలు చెప్పేందుకు నిరాకరించారు.

జియో ట్యాగింగ్ అయ్యాక తనిఖీలు..

జిల్లాలోని ఇందిరమ్మ ఇళ్లకు జియో ట్యాగింగ్ ప్రారంభించాక 3,26,615 ఇళ్లకు ఫొటోలు తీసి ఆన్‌లైన్ చేశారు. ఇందులో ఆధార్ నంబర్ల సమస్య, ఒకే రకమైన పేర్లు పలు ఇళ్లకు ఉండడంతో వాటిని సరిచేసే పనిలోపడ్డారు. గృహ నిర్మాణ శాఖ అధికారులు పూర్తిస్థాయిలో ఇళ్లసర్వే, లబ్ధిదారుల జాబితా పరిశీలన, వివిధ స్థాయిలో ఆగిపోయిన నిర్మాణాల పరిశీలనతోనే ఏడాది గడిచిపోయింది. మిగిలిన ఇళ్లకు జియో ట్యాగింగ్ పూర్తిచేశాక గ్రామస్థాయిలో తనిఖీలు ప్రారంభించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం ఉపాధి హమీ పథకం పనులపై ఏడాదికోసారి సామాజిక తనిఖీలు నిర్వహించి అవినీతి గుట్టును రట్టు చేస్తున్నారు. ఇదే తరహాలో ఇందిరమ్మ ఇళ్లకు సామాజిక తనిఖీ అవసరమని ప్రభుత్వం నిర్ణయించి, వీటి బాధ్యతలను ఓ ఏజెన్సీకి అప్పగించాలని యోచిస్తున్నట్లు సమాచారం. పనుల నాణ్యతను తనిఖీ చేసే థర్డ్ పార్టీ తరహాలో కార్యక్రమం సాగనుందని అధికారవర్గాలు చెబుతున్నాయి. దీనికోసమే జిల్లాలో మిగిలిపోయిన ఇళ్లకు జియో ట్యాగింగ్ పనులు త్వరలో పూర్తిచేయాలని ప్రాజెక్ట్ డెరైక్టర్ అధికారులను ఆదేశించారని తెలిసింది.

రూ.1,236 కోట్ల ఖర్చు..

జిల్లా వ్యాప్తంగా 2004-05 నుంచి 2013 వరకు 4,43,009 గృహాలను మంజూరు చేశారు. ఇందులో 2014 మే 24 నాటికి 2,95,134 గృహాలు పూర్తిచేశారు. 31,900 గృహాలు పునాదులు, 2,130 గృహాలు గోడల స్థాయిలో, 13,170 గృహాలు రూఫ్ లెవల్లో ఉన్నాయి. ఇవి కాకుండా 1,00,671 గృహాలు ఇంతవరకు ప్రారంభానికి నోచుకోలేదు.

 ఇందిరమ్మ పథకం కోసం ఇంతవరకు రూ. 1,236.2 కోట్లను ఖర్చుచేశారు. గడచిన ఏడాదిగా ఈ లెక్కల్లో మార్పులేదు. ఇదికాక బిల్లులు నిలిపి వేసిన నాటికి రూ.16 కోట్ల చెల్లింపులు ఆగాయి. ప్రస్తుతం వివిధ దశల్లో జరిగిన నిర్మాణాల వివరాలు సేకరించిన అధికారులు వాటికీ రూ.25కోట్ల దాకా చెల్లించాల్సి వస్తుందని అంచనా వేశారు.
 
 

మరిన్ని వార్తలు