గడప దాటారో.. పట్టేస్తారు! 

8 Apr, 2020 10:11 IST|Sakshi
రెడ్‌జోన్‌ ప్రాంతాలకు గూగుల్‌ మ్యాప్‌లో జియోట్యాగింగ్‌ చేసి  పర్యవేక్షిస్తున్న దృశ్యం

కోవిడ్‌ కంట్రోల్‌ చర్యలకు సాంకేతికతను జోడించిన పోలీసు శాఖ

రెడ్‌జోన్‌ ప్రాంతాలకు గూగుల్‌ మ్యాప్‌లో జియోట్యాగింగ్‌  

సాక్షి, కర్నూలు: జిల్లాలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో పోలీసు యంత్రాంగం మరింత అప్రమత్తమైంది.  కోవిడ్‌ వైరస్‌ విస్తరించకుండా తీసుకుంటున్న చర్యలకు సాంకేతికతను జోడించింది. ఆన్‌లైన్‌లో పర్యవేక్షించే ఏర్పాట్లు చేసింది.  జిల్లా పోలీసు కార్యాలయంలోని వ్యాస్‌ ఆడిటోరియం పక్కన ఇందు కోసం ప్రత్యేకంగా కోవిడ్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. రెడ్‌జోన్‌ ప్రాంతాలకు గూగుల్‌ మ్యాప్‌లో జియోట్యాగింగ్‌  చేశారు. దాటి పాజిటివ్‌ కేసు ఉన్న వ్యక్తులు నివసించే పరిసరాల్లో కిలో మీటర్‌ దూరంలో పూర్తిగా నిర్భందాన్ని అమలు చేస్తున్నారు.

ఆయా ప్రాంతాలకు ఇతరులు ఎవరూ వెళ్లకుండా కట్టుదిట్టం చేశారు. చిన్న చిన్న వ్యాపార దుకాణాలతో పాటు పట్టణంలోని పెట్రోల్‌ బంకులన్నింటినీ కూడా మూత వేయించారు. జిల్లాలో 27 కంటైన్‌మెంట్‌ జోన్లు ఉన్నాయి. వాటి పరిధిలోని  ప్రజలు నిత్యావసరాల పేరుతో బయటకు వచ్చి వీధుల్లో తిరగకుండా ఎక్కడికక్కడ బారీకేడ్లు ఏర్పాటు చేసి లాక్‌డౌన్‌ను కట్టుదిట్టం చేశారు. అత్యధికంగా కేసులు నమోదైన ప్రాంతాల్లో కర్ఫ్యూ అమలు చేస్తున్నారు. అలాగే అనుమానిత ప్రాంతాల్లో వైరస్‌ నివారణ చర్యలు చేపడుతూనే సర్వే  కొనసాగిస్తున్నారు. బయటకు రాకుండా కరోనా నియంత్రణకు సహకరించాలని ప్రజలను పోలీసు అధికారులు కోరుతున్నారు.

మరిన్ని వార్తలు