దేనికైనా రెఢీ

24 Dec, 2013 03:52 IST|Sakshi
ఎన్నికలకు ఎంతో సమయం లేదు. ఇప్పటినుంచే ప్రజల్లోకి వెళ్లి పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు కృషి చేయాలి. నియోజకవర్గాలకు ఇన్‌చార్జీలను వేశాం. వారి ఆధ్వర్యంలో కలిసికట్టుగా పని చేయండి. ఎవరి పనితీరు ఏమిటో.. నాకు ఎప్పటికప్పుడు నివేదికలు అందుతున్నాయి. సక్రమంగా పని చేయనివారిపై కఠిన చర్యలు తీసుకుంటామని.. సాక్షాత్తు పార్టీ అధినేతే సమావేశాల్లో తరచూ హెచ్చరిస్తున్నా.. జిల్లా తెలుగుదేశం తీరు ఏ మాత్రం మారడం లేదు. పైగా రోజురోజుకీ గ్రూపుల గోల పెరిగిపోతోంది. నాయకులు ప్రజల్లోకి వెళ్లకపోగా పార్టీ సమావేశాల్లోనూ కీచులాడుకుంటున్నారు. ప్రధానంగా పాతుకుపోయిన రెండు గ్రూపుల నీడలో గ్రామ స్థాయి నేతలు సైతం చీలిపోయారు. ఆధిపత్యం కోసం దేనికైనా రెడీ అన్నట్లు ఢీ అంటే ఢీ అంటున్నారు.
 
 సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం:  జిల్లా తెలుగుదేశం పార్టీలో వర్గపోరు ముదిరి పాకానపడింది. గ్రూపులుగా చీలిపోయిన నేతలు కొన్ని నియోజకవర్గాల్లో పరస్పర వ్యతి రేక చర్యలకు పాల్పడుతుండటంతో ప్రజల్లో పార్టీ పలుచనవుతోంది. కింజరాపు రామ్మోహన్‌నాయుడు, కిమిడి కళావెంకట్రావు వర్గాల మధ్య నెలకొన్న ఆధిపత్య పోరు పెరుగుతోందే తప్ప ఏమాత్రం సమసిపోయే పరిస్థితి కనిపించడం లేదు. పార్టీ అధినేత ఎన్ని సార్లు హెచ్చరిస్తున్నా నేతల తీరు మారడం లేదు. సోమవారం శ్రీకాకుళంలో జరిగిన పార్టీ జిల్లాస్థాయి విస్తృత సమావేశంలో చోటుచేసుకున్న సంఘటనలే దీనికి నిదర్శనం. 
 
 రాజాం నియోజకవర్గ పార్టీ ఇన్‌చార్జి ప్రతిభా భారతి సమావేశానికి రాలేదు. వచ్చే ఎన్నికల్లో ఆమెకు టికెట్ ఇవ్వవద్దని ఈ సమావేశంలో కొందరు ఆమె పరోక్షంలోనే డిమాండ్ చేశారు. ఇస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. దీనిపై కొద్దిసేపు వాదోపవాదాలు జరిగాయి. నేతలు బహిరంగంగా విమర్శలు చేసుకునే స్థాయికి వెళ్లారు. రాజాంతోపాటు మొత్తం శ్రీకాకుళం, పాతపట్నం, ఇచ్ఛాపురం నియోజకవర్గాల్లో వర్గ విభేదాలు శ్రుతి మించాయి. 
   ఒకప్పుడు కళావెంకట్రావుతో కలిసి ప్రతిభా భారతి జిల్లా రాజకీయాలను శాసించారు. కళావెంకట్రావు పీఆర్‌పీలోకి వెళ్లినప్పటి నుంచి ఎర్రన్నాయుడు వర్గంలో కొనసాగుతున్నారు. ప్రస్తుతం రాజాం నియోజకవర్గ ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్నారు. 
 
 అయితే పీఆర్పీ నుంచి మళ్లీ సొంత గూటికి చేరిన కళావెంకట్రావు వర్గం నుంచి ఈమెకు ప్రతిఘటన ఎదురవుతోంది. తన వర్గానికి చెందిన తలే భద్రయ్యకు టికెట్ ఇప్పించాలని‘కళా’ పట్టుదలతో ఉన్నారు. రెండుసార్లు ఎమ్మెల్యేగా, ఏపీపీఎస్సీ సభ్యునిగా పని చేసిన భద్రయ్య ఆధ్వర్యంలో కొందరు ప్రతిభాభారతికి వ్యతిరేకంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. నేరుగా చంద్రబాబును కలిసి ప్రతిభాభారతిపై స్థానికంగా వ్యతిరేకత ఉందని, జిల్లా నాయకురాలై  ఉండి కూడా వర్గాలను ప్రోత్సహిస్తున్నారని ఫిర్యాదు చేసి, భద్రయ్యకు టికెట్ ఇవ్వాలని కోరాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది. 
 
 
   శ్రీకాకుళం నియోజకవర్గానికి ప్రస్తుతం కళావెంకట్రావు వర్గంలో ఉన్న అప్పల సూర్యనారాయణ ఇన్‌చార్జిగా ఉన్నారు. ఒకవేళ తనకు కాకుంటే తన భార్య, కుమారుల్లో ఒకరికి టికెట్ ఇవ్వాలని ఇటీవల ఆయన అధిష్టానానికి విజ్ఞప్తి చేశారు. దీనిపై కింజరాపు వర్గీయులు అగ్గి మీద గుగ్గిలం అవుతున్నారు. జన సమస్యలపై స్పందించి పనిచేసే వారికే అవకాశం ఇవ్వాలనే నినాదాన్ని తెరపైకి తెచ్చారు. కింజరాపు రామ్మోహన్‌నాయుడి సహచరుడైన కొర్ను నాగార్జున(ప్రతాప్)కు టికెట్ ఇవ్వాలని ఈ వర్గం పట్టుపడుతోంది. ప్రతాప్‌కు పట్టణంలోని టీడీపీ శ్రేణులతో మంచి సంబంధాలు ఉన్నాయని వారు వాదిస్తున్నారు. ఈ పరిణామాలతో పట్టణంలో పార్టీ  రెండు వర్గాలుగా విడిపోయింది. ముఖ్యమైన సమావేశాలకు సైతం ఒక వర్గం వారు వస్తే మరో వర్గం గైర్హాజరవుతోంది. 
 
   పాతపట్నం నియోజకవర్గ టీడీపీ ఇన్ చార్జిగా ‘కళా’ వర్గీయుడైన కొవగాపు సుధాకర్ కొనసాగుతుండగా కింజరాపు వర్గానికి చెందిన కలిశెట్టి అప్పలనాయుడు ఆయనకు వ్యతిరేకంగా పావులు కదుపుతున్నారు. ఎలాగైనా తనకు టికెట్ తెచ్చుకోవాలనే ఆలోచనలో కలిశెట్టి చాప కింద నీరులా పని చేస్తున్నారు. కింజరాపు మద్దతు ఉన్నందున తనకు తప్పకుండా టికెట్ వస్తుందనే నమ్మకంతో  సుధాకర్‌కు వ్యతిరేకంగా ప్రత్యక్ష పోరాటానికి దిగారు. ఈ అంతర్గత పోరును పరిష్కరించేందుకు ఇటీవల పార్టీ పెద్దలు పంచాయితీ పెట్టినా విభేదాలు సమసిపోలేదు.   ఇచ్చాపురంలోనూ ఇదే వర్గపోరు కొనసాగుతోంది. ఈ నియోజకవర్గ పార్టీ ఇన్‌చార్జిగా డాక్టర్ బెందాళం అశోక్‌బాబు పనిచేస్తునారు. కింజరాపు వర్గీయుడైన ఈయనకు వ్యతిరేకంగా కళా వెంకట్రావు వర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే దక్కత అచ్యుతరామిరెడ్డి కుమారుడు శ్రీనివాసరెడ్డి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తనకు టికెట్ ఇవ్వాలని ఇప్పటికే ఆయన చంద్రబాబునాయుడును కోరారు. కళావెంకట్రావు కూడా ఈయనకే ఇవ్వాలని అధినేత వద్ద పట్టుబట్టినట్లు సమాచారం. 
 
       జిల్లాలోని మిగిలిన నియోజకవర్గాల్లోనూ పార్టీ పరిస్థితి ఆశాజనకంగా లేకపోవడం, వర్గపోరు కొనసాగుతుండటంతో అసంతృప్తి చెందుతున్న పలువురు నేతలు పక్క చూపులు చూస్తున్నారు.
     దీనికి తోడు సమైక్యాంధ్ర విషయంలో పార్టీ అనుసరిస్తున్న ద్వంద్వ వైఖరితో ప్రజల్లో  పార్టీ పరపతి కోల్పోయిందని, జనం పట్టించుకోనప్పుడు పార్టీలో ఉండటం దండుగ అని ముఖ్య కార్యకర్తలు భావిస్తున్నారు. ఎన్నికల సమయం దగ్గరపడుతున్న తరుణంలో రాజకీయ మనుగడ కోసం పార్టీని వీడేందుకు అనేకమంది నేతలు ప్రయత్నిస్తున్నారు.
 

 

మరిన్ని వార్తలు