అవగాహనతోనే క్షయ దూరం

19 Mar, 2018 12:25 IST|Sakshi
టీబీ వ్యాధిగ్రస్తుడు(పాత చిత్రం)

24న ప్రపంచ క్షయ దినోత్సవం

క్షయ నిర్మూలనకు అందుబాటులో మందులు

జిల్లా వ్యాప్తంగా 4467 మంది రోగులు

వేపాడ : ప్రజల్లో చైతన్యం, అవగాహన కల్పిస్తే క్షయ వ్యాధిని అంతమొందించవచ్చు. క్షయ వ్యాధి మూలాలు కనుగొని 136 సంవత్సరాలు అయింది. ప్రతి ఏటా మార్చి 24న వైద్య సిబ్బంది ప్రపంచ క్షయ దినోత్సం నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా అవగాహన ర్యాలీలు, సదస్సులు నిర్వహించి ప్రజలను చైతన్యపరుస్తున్నారు. క్షయ వ్యాధి దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం

వ్యాధి లక్షణాలు 

రెండు వారాలకు మించి జ్వరం, దగ్గు ఉన్నా..  అలాగే ఆకలి మందగించడం, బరువు తగ్గటం, దగ్గినప్పుడు కఫంతో పాటు రక్తపు జీరలు పడినా క్షయ వ్యాధి లక్షణాలుగా గుర్తించాలి. తక్షణమే ఆస్పత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకోవాలి. ట్యూబర్‌ క్యులోసిస్‌ అనే సూక్ష్మ క్రిమి వల్ల ఈ వ్యాధి సంక్రమిస్తుంది. క్షయ వ్యాధి సోకిన తర్వాత వెంటనే చికిత్స తీసుకోకపోతే అతడి నుంచి మరో 15 మంది వ్యాధి వ్యాపించే అవకాశం ఉంది. సాధారణ వ్యక్తులు కన్నా  హెచ్‌ఐవీ వ్యాధిగ్రస్తులు ఎక్కువగా ఈ వ్యాధి భారిన పడతారు. వ్యాధి సోకిన వెంటనే చికిత్స తీసుకోవాలన్న అవగాహన రోగుల్లో ఉంటే వ్యాధిని అంతమొందించవచ్చు.

మొండి క్షయ ..
సకాలంలో చికిత్స పొందని పక్షంలో సాధారణ క్షయ మందులకు లొంగని మొండి క్షయ వ్యాధిగా మారుతుంది. ప్రపంచవ్యాప్తంగా 2016 నాటికి  4,90,000 మంది మొండి క్షయ వ్యాధిగ్రస్తులు ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి.

నూతన డ్రగ్‌ పాలసి


క్షయ వ్యాధిగ్రస్తుల బరువు ఆధారంగా ఆరు నుంచి ఎనిమిది నెలల వ్యవధిలో మందులు వేసుకునేలా నూతన డ్రగ్‌ పాలసీని వైద్య సిబ్బంది నిర్ణయించారు. వ్యాధి నిర్మూలనకు ఐ.ఎన్‌.హెచ్‌ 75 ఎంజీ, రిఫామ్పిసిన్‌ 150 ఎంజీ, పెరిజినామిడ్‌ 400 ఎంజీ, ఈతాంబుటాల్‌ 275 ఎంజీ,  స్ట్రేప్టుమైసిన్‌ ఇంజిక్షన్‌ 0.75 ఎంజీలను వైద్యుల సూచనల మేరకు వాడాల్సి ఉంటుంది. చిన్న పిల్లలు వ్యాధి బారిన పడకుండా పుట్టిన బిడ్డ నుంచి ఏడాదిలోపు చిన్నారులకు బీసీజీ ఇంజిక్షన్‌ వేయించాలి.

మరిన్ని వార్తలు