తడారిపోతోంది

10 Jan, 2014 03:46 IST|Sakshi
తడారిపోతోంది

 ఆలస్యమవుతున్న రబీ నాట్లు      
  ఇప్పటి వరకూ 50 శాతమే పూర్తి    
 ఏప్రిల్ 20 వరకు నీరు అవసరం
  మహా అయితే మార్చి ఆఖరు వరకే ఇస్తామంటున్న అధికారులు     
 ఆందోళనలో అన్నదాతలు  
 
 ఒకవైపు రబీ సాగు మందకొడిగా సాగుతుండగా.. మరోవైపు గోదావరిలో ఇన్‌ఫ్లో రోజురోజుకూ పడిపోతోంది. ఇప్పటికే నాట్లు పూర్తి కావాల్సి ఉండగా, కేవలం సగం ఆయకట్టులో మాత్రమే పడ్డాయి. నెలాఖరు వరకు నాట్లు పడే అవకాశముండడంతో ఏప్రిల్ 20 వరకు సాగునీరు ఇవ్వాల్సిన పరిస్థితి నెలకొంది. అయితే ఈ విషయాన్ని పట్టించుకోని ఇరిగేషన్ అధికారులు ఏప్రిల్ ఒకటి నాటికి కాలువలు మూసి, ఆధునికీకరణ పనులు చేస్తామని చెప్పడం విమర్శలకు తావిస్తోంది.
 
 అమలాపురం, న్యూస్‌లైన్ :
 జిల్లాలో రబీ వరి నాట్లు ఇప్పటి వరకు 50 శాతం మాత్రమే పూర్తయ్యాయి. సుమారు 3.77 లక్షల ఎకరాల్లో రబీ వరి సాగు జరగాల్సి ఉండగా 1.80 లక్షల ఎకరాల్లో మాత్రమే నాట్లు పడ్డాయి. నాట్లు పూర్తయిన చోట కూడా వెదజల్లు విధానమే ఎక్కువగా ఉండడం విశేషం. తూర్పుడెల్టాలో 1.33 లక్షల ఎకరాల్లో, మధ్యడెల్టాలో 39 వేల ఎకరాల్లో, మెట్టలో 8,600 ఎకరాల్లో నాట్లు పూర్తయ్యాయి. నీటి ఎద్దడి ముప్పు పొంచి ఉన్న గోదావరి డెల్టాల్లోని శివారు ఆయకట్లలో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. రెండు డెల్టాల పరిధిలోని కరప, పిఠాపురం, కాకినాడ రూరల్, ముమ్మిడివరం, అమలాపురం, పి.గన్నవరం, రాజోలు సబ్‌డివిజన్‌ల పరిధిలో నాట్లు 20 శాతం కూడా పూర్తి కాలేదు. ఆలస్యం అయిన ప్రాంతాల్లో నారుమడులు కాకుండా వెదజల్లు పద్ధతిని అవలంబించాలని అధికారులు చెబుతున్నా కొంతమంది రైతులు నారుమడులు వేస్తుండడం గమనార్హం. ఇలా అయితే సాగు చివరి సమయంలో నీటి ఎద్దడి తప్పదని వ్యవసాయ శాఖాధికారులు మొత్తుకుంటున్నా ఫలితం లేకపోతోంది. సాగులో జాప్యాన్ని బట్టి ఏప్రిల్ 15 వరకు సాగునీరందించక తప్పని పరిస్థితి నెలకొంది.
 
 బ్యారేజ్ గేట్ల మూసివేత..
 ఇన్‌ఫ్లో స్వల్పంగాా తగ్గడం, నాట్లు వేస్తున్నందున నీటి విడుదల పెంచాల్సి రావడంతో రెండు రోజుల క్రితం అధికారులు ధవళేశ్వరం బ్యారేజ్‌లోని 175 క్రస్ట్‌గేట్లను మూసి సముద్రంలోకి నీటి విడుదలను నిలిపివేశారు. ప్రస్తుతం ఇన్‌ఫ్లో 12,800 క్యూసెక్కులు కాగా వచ్చిన నీటిని వచ్చినట్టు డెల్టా కాలువలకు విడుదల చేస్తున్నారు. దీనిలో సీలేరు పవర్‌డ్రాప్ నుంచి వస్తున్న నీరే సుమారు 4,500 క్యూసెక్కులు కావడం గమనార్హం. తూర్పుడెల్టాకు 3,300, మధ్యడెల్టాకు 2,500, పశ్చిమ డెల్టాకు ఏడు వేల క్యూసెక్కుల చొప్పున నీరు విడుదల చేస్తున్నారు. వేసవిని దృష్టిలో పెట్టుకుని సీలేరు విద్యుత్ కేంద్రంలో ఏప్రిల్, మే నెలలో ఎక్కువగా ఉత్పత్తి చేయాల్సి ఉంటుంది. దీనిని దృష్టిలో పెట్టుకుని అధికారులు ఫిబ్రవరి, మార్చి నెలల్లో అక్కడ ఉత్పత్తిని తగ్గించడం వల్ల తదనుగుణంగా నీటి విడుదల కూడా తగ్గుతుంది. ఇదే సమయంలో సహజ జలాల రాక ఇప్పుడున్నదానికన్నా మరింత తగ్గే అవకాశముండడంతో ఈ రెండు నెలల్లో నీటి ఎద్దడి తప్పదని నిపుణులు అంచనా వేస్తున్నారు.
 
 రబీ షెడ్యూల్‌పైఅవగాహన లేని అధికారులు
 సాగు ఆలస్యం అవుతుండడం వల్ల రెండు డెల్టాలకు ఏప్రిల్ 20 వరకు నీరిస్తేనే రైతులు గట్టెక్కుతారు. అయితే ఇరిగేషన్ అధికారులు మాత్రం మార్చి 15 వరకు, తప్పదంటే మార్చి నెలాఖరు వరకు మాత్రమే నీరిస్తామని పాతపాటే పాడుతున్నారు. దీనిని దృష్టిలో పెట్టుకునే కాలువలకు 75 రోజులు క్లోజర్ ప్రకటించి ఆధునికీకరణ పనులు పూర్తి చేస్తామని కాకినాడలో మంగళవారం జరిగిన సమీక్ష సమావేశంలో కలెక్టర్ నీతూకుమారి ప్రసాద్‌కు ఇరిగేషన్ అధికారులు చెప్పడం విడ్డూరంగా ఉంది. రబీసాగు షెడ్యూల్‌పై అవగాహన లేకుండా ఇటువంటి హామీలు ఇవ్వడం ద్వారా అధికారులు తమను గందరగోళానికి గురి చేస్తున్నారని రైతులు విమర్శిస్తున్నారు.

మరిన్ని వార్తలు