ఆసుప్రతిలో ఆత్మల ఘోష!

2 May, 2018 08:03 IST|Sakshi

అనాధ శవాలపై కాసులకు ప్రభుత్వాస్పత్రి సిబ్బంది కక్కుర్తి

గుర్తు తెలియని మృతదేహాల వద్ద సేకరించే వస్తువులను మాయం చేస్తున్న వైనం

ప్రభుత్వాసుపత్రులలో అవినీతికి హద్దే లేకుండాపోతోంది. రోగుల వద్ద వసూళ్లు, పాలనా పరమైన విభాగాల్లో అక్రమాలు వెలుగులోకి రావటం చూశాం.. తాజాగా గుర్తు తెలియని మృతదేహాలను కూడా అక్రమార్కులు వదలటం లేదు. పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి పంపించిన శవాలపై గద్దల్లా వాలి పీక్కుతుంటున్నారు. శవాలపై ఉండే బంగారు, వెండి వస్తువులను మాయం చేస్తున్నారు.

సాక్షి, అమరావతి బ్యూరో : పోస్టుమార్టం కోసం గవర్నమెంట్‌ ఆస్పత్రికి వచ్చిన శవాలకు సంబంధించిన వస్తువులను ఏడాదికోసారి ప్రభుత్వానికి అప్పజెప్పాల్సి ఉంది. అయితే, విజయవాడ ప్రభుత్వాస్పత్రి వైద్యాధికారులు మాత్రం నిబంధనలకు పాతరేసి ఏళ్ల తరబడి వాటిని ఆసుపత్రిలోనే ఉంచేస్తున్నారు. దీంతో వాటిని ఎవరికి వారు రకరకాల మార్గాల్లో దోచేస్తున్నారు.

జరిగేది ఇలా...
జిల్లాలో ఎక్కడైనా గుర్తుతెలియని శవాలు పడి ఉంటే పోలీసులు  ప్రభుత్వాసుపత్రికి పోస్టుమార్టం కోసం తరలిస్తారు. సుమారు ఐదారేళ్లుగా దాదాపు విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో 200 వరకు (కేవలం) గుర్తుతెలియని శవాలకు పోస్ట్‌మార్టం జరిగిందని అంచనా. వాటిపై విలువైన బంగారు, వెండి వస్తువులతో పాటు నగదు ఉన్నా తీసి ఉంచుతారు. వాటిని ఆసుపత్రి అసిస్టెంట్‌ డైరెక్టర్‌ హోదాలో ఉన్న అధికారి పర్యవేక్షణలో భద్రపరుస్తారు. ప్రస్తుతం ఆసుపత్రిలో దాదాపు 88 బ్యాగుల్లో గుర్తు తెలియని శవాలకు సంబంధించిన వస్తువులు భద్రపరిచి ఉన్నట్లు సమాచారం.

నిబంధనలివీ..
గుర్తుతెలియని శవాలకు సంబంధించిన వస్తువులను ప్రతి ఆరు నెలలు లేదా ఏడాదిలోపు పరిశీలించాలి. జాతీయ బ్యాంకులలో బంగారు వస్తువులు తూకం కట్టే అప్రైజర్‌ను పిలిపించి ఆయా వస్తువుల విలువ తేల్చాలి. ఆపై ప్రభుత్వ ఖజానా కార్యాలయానికి అప్పగించాలి. ఖజానా అధికారులు ఆ వస్తువులను లెక్కకట్టి వేలం ద్వారా రెవెన్యూగా మార్చుకోవాలి. ఆ వివరాలు పత్రికల ద్వారా ప్రజలకు తెలియజేయాలి. కానీ ఎక్కడా ఈ నిబంధనలు అమలు కావటం లేదు. కొన్నేళ్లుగా వస్తువులను ప్రభుత్వ ఖజానాకు అప్పగించటం లేదని తెలుస్తోంది.

జరుగుతోంది ఇదీ..
ప్రభుత్వాసుపత్రులలో భద్రపరిచిన బంగారు, వెండి వస్తువులను కిందిస్థాయి ఉద్యోగులు కాజేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. గుర్తు తెలియని శవాలు కాబట్టి ఆ వస్తువుల గురించి ఎవరూ పెద్దగా పట్టించుకోరు. దీంతో ఉద్యోగులు సంబంధిత బ్యాగులు ఓపెన్‌ చేసి విలువైన బంగారు వస్తువులను తీసేసి వాటి స్థానంలో రోల్డ్‌ గోల్డ్‌వి ఉంచుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. విజయవాడ ప్రభుత్వాసుపత్రిలోనే కాదు ప్రతి ఆసుపత్రిలో ఇదే తంతు జరుగుతోందని పలువురు ఉద్యోగులు బాహాటంగానే చెబుతున్నారు. గుర్తుతెలియని శవానికి పోస్ట్‌మార్టం చేసే సమయంలో వస్తువులు తీసేటప్పుడు వైద్యులు ఎల్లో మెటల్‌గా బంగారు వస్తువులు, వైట్‌ మెటల్‌గా వెండి వస్తువులను చూపిస్తారు. ఎన్ని గ్రాములు, వాటి విలువ ఎంత అన్నవి నమోదు చేయరు. దీంతో విలువైన వస్తువులు తీసేసినా ఎవరికీ తెలీదు. అదే అదునుగా కొందరు విలువైన వస్తువులు మాయం చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.

అలా చేస్తే చర్యలు తీసుకుంటాం..
ఆసుపత్రిలో వస్తువులు తీయడం జరగకపోవచ్చు. ఈ విషయం నాకు తెలియదు. అలా చేస్తే మాత్రం చర్యలు తీసుకుంటాం.– చక్రధర్, విజయవాడ ప్రభుత్వాసుపత్రి,సూపరింటెండెంట్‌ 

మరిన్ని వార్తలు