సల్మాన్, షారుక్‌లకు ఎక్కువగా డబ్బింగ్ చెప్పా

27 May, 2014 11:12 IST|Sakshi
సల్మాన్, షారుక్‌లకు ఎక్కువగా డబ్బింగ్ చెప్పా

ఘంటసాల.. ఆ పేరు వినగానే మధురమైన గాత్రం మనకు గుర్తుకు వస్తుంది. వేలాది సినీ గీతాలు పాడి తెలుగు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిన దివంగత ఘంటసాల వెంకటేశ్వరరావు తనయుడు రత్నకుమార్ డబ్బింగ్ విభాగంలో తనకంటూ ఓ ముద్ర వేసుకున్నారు. ఇప్పటికే మాటల రచయితగా మారిన ఈయన త్వరలో దర్శకత్వం వహిస్తానని చెప్పారు. రాజమండ్రిలో ఘంటసాల విగ్రహావిష్కరణకు వచ్చిన ఆయన సోమవారం అమలాపురంలోని ప్రముఖ సాహితీవేత్త, సినీ విమర్శకుడు పైడిపాల నివాసానికి వచ్చారు. ఈ సందర్భంగా ఆయన ‘న్యూస్‌లైన్’తో మాట్లాడారు.
 
 ప్ర : మీ కుటుంబం గురించి చెప్పండి ?
 జ : ఘంటసాల వెంకటేశ్వరరావు దంపతులకు మేము ఆరుగురు సంతానం. ముగ్గురు కుమారులు,ముగ్గురు కుమార్తెలు. నేను రెండో వాడిని. మాలో నేను తప్ప మిగిలిన వారెవరూ సినీ రంగంలో అడుగుపెట్టలేదు.
 
 ప్ర:  ఘంటసాల వారసత్వంగా నేపథ్యగానం వైపు రాకుండా డబ్బింగ్ వైపు ఎందుకెళ్లారు?
 జ:  మొదట్లో నాలుగైదు చిత్రాలకు పాటలు పాడాను. పాటలు పాడేందుకు, డబ్బింగ్‌కు గాత్రం ఒక్కటే. ఆ తరువాత అనువాద విభాగంలోనే ఎక్కువ అవకాశాలు వచ్చాయి. ఇక వారసత్వం అంటారా... నా కుమార్తె వీణ తాత వారసత్వాన్ని అందిపుచ్చుకుంది. తెలుగులో అందాల రాక్షసి, తమిళంలో ఉరుం చిత్రాల్లో నేపథ్య గాయనిగా మంచి పేరు తెచ్చుకుంది. ఇంకా కొన్ని సినిమాలకు పాడుతోంది.
 
 ప్ర: ఇండస్ట్రీలో మీ అనుభవం ?
 జ:. 30 ఏళ్లుగా చిత్ర పరిశ్రమలో ఉన్నాను. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, సంస్కృత భాషల్లో 1090 సినిమాలకు డబ్బింగ్ చెప్పాను. హీరోలు అర్జున్, కార్తీక్, అరవిందస్వామి, సల్మాన్‌ఖాన్, షారుక్‌ఖాన్‌లకు ఎక్కువ డబ్బింగ్ చెప్పాను.
 
 ప్ర: డబ్బింగ్ గురించి ... ?
 జ : డబ్బింగ్ చెప్పడం చాలా కష్టమైన కళ. గాత్రం ఒక్కటే ప్రధానం కాదు. నటుల హావభావాలు, సన్నివేశానికి అనుగుణంగా భావాన్ని పలికించాలి. నటులకు, సాంకేతిక నిపుణులకు వస్తున్న గుర్తింపు డబ్బింగ్ అరిస్టులకు రావడంలేదు. ఈ రంగంలో నాకంటూ ఓ గుర్తింపు వచ్చింది. డబ్బింగ్ ఆర్టిస్టులకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే నంది అవార్డు అందుకున్నాను. జెమినీ టీవీలో విశ్వదర్శనం సీరియల్ యాంకర్‌గా పనిచేశాను. తమిళనాడు, కర్నాటక మూవీ అసోసియేషన్లు కళై శైవం, కురల్ సెల్వం బిరుదులతో సత్కరించాయి.
 
 ప్ర: ఇప్పుడు వస్తున్న మార్పుల గురించి ?
 జ: ఇండస్ట్రీలో ఇటీవల మారుతున్న కాలానికి అనుగుణంగా కొత్త కొత్త ధోరణులు వస్తున్నాయి. తెలుగు డబ్బింగ్‌కు కూడా తమిళం వాళ్లను తీసుకు వస్తున్నారు. తమిళం వాళ్లు తెలుగు వాళ్లను తీసుకు వస్తున్నారన్నారు.
 
 ప్ర: మాటల రచయితగా మారడం వెనుక కారణం?
 జ: ఇండస్ట్రీలో 200 మంది వరకు డబ్బింగ్ ఆర్టిస్టులు ఉన్నారు. కొత్తవారికి అవకాశమివ్వాలనుకున్నాను. అందుకే మాటల రచయితగా అటువైపు అడుగులు వేశాను. ఇప్పటికే 35 సినిమాలకు మాటలను అందించా. వాటిలో ఆట ఆరంభం, వీరుడొక్కడే, అంబేద్కర్ సినిమాలున్నాయి.
 
 ప్ర: మరి మీ వారసులు..?
 జ: అనువాదంలో నా వారసులుగా శశాంక్ వెన్నెలకంటి, వాసులతో పాటు మరికొందరిని డబ్బింగ్ ఆర్టిస్టులుగా తీర్చిదిద్దాను. వారికి అవసరమైన సలహాలు, సూచనలు ఎప్పటికీ ఇస్తాను.
 
 ప్ర: మీ ఆశయం ?
 జ : ఎప్పటికైనా సినిమా దర్శకుడుగా మారాలని. ఇప్పటికే ఇందుకోసం కథ, డైలాగులు, మాటలు, పాటలు సిద్ధం చేసుకుంటున్నారు. మంచి నిర్మాత దొరికితే త్వరలోనే తీస్తా.
 

మరిన్ని వార్తలు