ఘరానా మోసగాడి అరెస్టు

16 Nov, 2014 03:18 IST|Sakshi
ఘరానా మోసగాడి అరెస్టు

‘మీ ఉన్నతాధికారిని మాట్లాడుతున్నాను. మా బంధువు పరీక్ష రాసేందుకు వస్తే బ్యాగ్ కొట్టేశారు. హాల్ టికెట్, నగదు పోయింది. కాలేజీ నిర్వాహకులతో మాట్లాడి పరీక్ష రాయించే ఏర్పాట్లు చేయండి’ అంటూ..తానే కాలేజీ ప్రిన్సిపాల్ అవతారం ఎత్తి సెక్యూరిటీ డిపాజిట్ పేరిట నగదు గుంజుతున్న ఓ ఘరానా మోసగాడు సీసీఎస్ పోలీసులకు చిక్కాడు.

విజయవాడ సిటీ: రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు శాఖల ఉన్నతాధికారి పేరిట పలువురిని మోసగించి నగదు గుంజే తూర్పు గోదావరి జిల్లా అమలాపురానికి చెందిన మాచిరాజు బాలత్రిపుర సుందరరావు అలి యాస్ సుధీర్(30)ను సీసీఎస్(సెంట్రల్ క్రైం స్టేషన్) పోలీసులు అరెస్టు చేశారు. అతడి వద్ద నుంచి రూ.50వేల నగదు, నేరం చేసేందుకు ఉపయోగించిన రెండు సిమ్‌కార్డులు, సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. అదనపు డీసీపీ(క్రైమ్స్) జి.రామకోటేశ్వరరావు శనివారం వన్‌టౌన్ పోలీసు స్టేషన్ ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏసీపీ(క్రైమ్స్) గుణ్ణం రామకృష్ణతో కలిసి ఇందుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు.

అదనపు డీసీపీ కథనం ప్రకారం.. సుధీర్ సమాచార హక్కు చట్టం వెబ్‌సైట్ ద్వారా ఉన్నతాధికారులు, ఆయా శాఖలకు సంబంధించిన జోనల్, రీజినల్ అధికారుల వివరాలు, ఫోన్ నంబర్లు సేకరించి మోసాలకు పాల్పడుతున్నాడు. ఏడాది కాలంగా విజయవాడ, విజయనగరం, చిత్తూరు, కృష్ణాజిల్లా నందిగామ సహా ఎనిమిది చోట్ల అధికారులను మోసగించి సొమ్ము చేసుకున్నాడు. ముందస్తు సమాచారంతో నిందితుడు పండిట్ నెహ్రూ బస్టాండ్ సమీపంలో ఉండగా సీసీఎస్ పోలీసులు చాకచక్యంగా పట్టుకొని అరెస్టు చేశారు.

మరిన్ని వార్తలు