నెయ్యి ట్యాంకర్లపై నిర్లక్ష్యం

5 Feb, 2016 02:26 IST|Sakshi

ఆరు నెలల క్రితం తిరుమలకు తీసుకొచ్చిన అధునాతన ట్యాంకులు
వినియోగంలోకి తేవడంలో తీవ్ర జాప్యం  
ట్యాంకులు ఏర్పాటైతే నాణ్యమైన నెయ్యి నిల్వకు అవకాశం

 
తిరుమల: నెయ్యి నిల్వకోసం కొత్తగా తెప్పించిన ట్యాంకుల వినియోగంపై టీటీడీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. నెయ్యి నిల్వ కోసం ఆరు నెలల క్రితం అధునాతన ట్యాంకర్లు తిరుమలకు వచ్చాయి. వాటిని వినియోగంలోకి తేవడంలో టీటీడీ తీవ్ర జాప్యం చేస్తోంది. దీనిప్రభావం లడ్డూల తయారీ సంఖ్య, నాణ్యతపై పడుతున్నా సంబంధిత అధికారుల్లో చలనం లేకపోవడం విమర్శలకు తావిస్తోంది.
 
కొండకు ట్యాంకర్లతోనే  నెయ్యి సరఫరా
 తిరుమలేశునికి దర్శనానికి వచ్చే భక్తుల కోసం టీటీడీ ప్రతిరోజూ మూడు లక్షల లడ్డూలు తయారుచేస్తోంది. లడ్డూతోపాటు ఆలయ అవసరాల కోసం సుమారు 10 నుంచి 12 వేల కిలోల నెయ్యి వాడుతోంది. ఈ మొత్తం నెయ్యి నిల్వ కోసం 8 భారీ స్థాయి ట్యాంకులు తెప్పించి శ్రీవారి ఆలయానికి ఉత్తర దిశలో లడ్డూ కౌంటర్ పక్కనే  ఉంచారు. ఇందులో 4 ట్యాంకుల్లో ఒక్కో దానిలో 5వేల కిలోలు, మరో నాలుగింటిలో ఒక్కోదానిలో 4,500 కిలోల నెయ్యి నిల్వచేసుకోవచ్చు. ప్రస్తుతం టెండరుదారు నుంచి తిరుపతి మార్కెటింగ్ గోడౌన్‌కు ట్యాంకర్ల ద్వారా చేరిన నెయ్యిని తిరుమలకు తరలిస్తారు. రెండు రోజులకోసారి సుమారు 12 నుంచి 15వేల కిలోల సామర్థ్యం గల వాహన ట్యాంకుల ద్వారా నెయ్యిని లడ్డూ కేంద్రంలోని ట్యాంకులకు చేరవేసి నిల్వ చేస్తున్నారు.

పెరుగుతున్న ఫిర్యాదులు
భక్తులు అత్యంత ప్రీతిపాత్రంగా స్వీకరించే శ్రీవారి లడ్డూ విషయంలో పదేళ్లుగా ఫిర్యాదులు పెరిగాయి. మరోవైపు 3 లక్షల లడ్డూలు తయారు చేసినా సరిపోవటం లేదు. అయినప్పటికీ టీటీడీ లడ్డూ  తయారి సంఖ్య కంటే వాటి నాణ్యతకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోంది. పాత ట్యాంకుల్లో ఎక్కువ రోజులు నెయ్యి నిల్వ ఉండడం వల్ల కూడా లడ్డూ నాణ్యతలో వ్యత్యాసం ఉందని నిపుణులు టీటీడీకి సూచించారు. పాత ట్యాంకులు అడ్డంగా (హారిజాంటల్) అమర్చి ఉండడం వల్ల నెయ్యి వాడిన తర్వాత వేడినీళ్లతో శుద్ధి చేసేందుకు ఇబ్బందులు ఉన్నట్టు అధికారులు గుర్తించారు. తిరుమల వాతావరణ పరిస్థితుల వల్ల శీతాకాలంలో నెయ్యి ట్యాంకుల్లోనే గడ్డక ట్టడం, వాటివల్ల వృథా ఎక్కువగా జరగడాన్ని వారు గుర్తించారు. దీన్ని టీటీడీ ఉన్నతాధికారులు సీనియస్‌గా పరిగణించారు. అధునాతన ట్యాంకులు ఏర్పాటు చేయాలని మూడేళ్లకు ముందు నిర్ణయించారు. ఇందులో భాగంగా ట్యాంకులు అడ్డంగా (హారిజాంటల్) కాకుండా నిలువుగా (వర్టికల్‌గా ఏర్పాటు..ట్యాంకులోని ప్రతి బొట్టినెయ్యిని వినియోగించుకోవటంతోపాటు వేడినీళ్లతో శుద్ధి చేయటానికి సులభంగా ఉండేలా) డిజైన్లు రూపొందించారు. ఆరు నెలల ముందు 12వేల కిలోల నెయ్యి నిల్వ ఉండేలా నాలుగు ట్యాంకులు తెప్పించారు. ఆ ట్యాంకులకే అదనంగా వేడినీళ్లతో శుద్ధి చేసే యంత్రాలు అమర్చారు.

సివిల్ పనులతో కొత్త ట్యాంకుల ఏర్పాటులో జాప్యం
కొత్త ట్యాంకులు ఏర్పాటు చేస్తేనే అవసరమైన లడ్డూల తయారీతోపాటు నాణ్యమైన నెయ్యి, ట్యాంకుల శుద్ధి పనుల్లో పురోగతి కనిపిస్తుంది. అయితే, ఈ ట్యాంకులు అమర్చడంలో జాప్యం జరుగుతోంది. సివిల్ పనులు ఆలస్యం కావటం వల్లే ట్యాంకులు ఏర్పాటు చేయలేదనే వాదన వస్తోంది. పనుల విషయంలో జాప్యం ఉండకూడదని టీటీడీ ఈవో డాక్టర్ దొండపాటి సాంబశివరావు పదేపదే చెబుతున్నా సంబంధిత అధికారుల చెవికి ఎక్కడం లేదు. ఇకనైనా సంబంధిత అధికారులు కొత్త ట్యాంకుల ఏర్పాటును పూర్తి చేయాల్సిన అవసరం ఉంది.
 
సివిల్ పనులతో కొత్త ట్యాంకుల  ఏర్పాటులో జాప్యం
కొత్త ట్యాంకులు ఏర్పాటు చేస్తేనే అవసరమైన లడ్డూల తయారీతోపాటు నాణ్యమైన నెయ్యి, ట్యాంకుల శుద్ధి పనుల్లో పురోగతి కనిపిస్తుంది. అయితే, ఈ ట్యాంకులు అమర్చడంలో జాప్యం జరుగుతోంది. సివిల్ పనులు ఆలస్యం కావడం వల్లే ట్యాంకులు ఏర్పాటు చేయలేదనే వాదన వస్తోంది. పనుల విషయంలో జాప్యం ఉండకూడదని టీటీడీ ఈవో డాక్టర్ దొండపాటి సాంబశివరావు పదేపదే చెబుతున్నా సంబంధిత అధికారుల చెవికి ఎక్కడం లేదు. ఇకనైనా సంబంధిత అధికారులు కొత్త ట్యాంకుల ఏర్పాటును పూర్తి చేయాల్సిన అవసరం ఉంది.

>
మరిన్ని వార్తలు