జీహెచ్‌ఎంసీకి ఎన్నికలు నిర్వహించాలి

15 Jan, 2015 02:28 IST|Sakshi
  • హైకోర్టులో పిల్
  • సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ)లో ప్రత్యేకాధికారుల పాలనను రద్దు చేసి, ఎన్నికలు నిర్వహించేలా తెలంగాణ ప్రభుత్వాన్ని, ఎన్నికల కమిషన్‌ను ఆదేశించాలని కోరుతూ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. ఈ వ్యాజ్యాన్ని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ కార్యదర్శి, మాజీ ఐఎఫ్‌ఎస్ అధికారి పద్మనాభరెడ్డి దాఖలు చేశారు.

    ఇందులో తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ఎన్నికల కమిషన్, జీహెచ్‌ఎంసీ స్పెషల్ ఆఫీసర్‌లను ప్రతివాదులుగా పేర్కొన్నారు. జీహెచ్‌ఎంసీ పాలక మండలి కాల పరిమితి గత ఏడాది డిసెంబర్ 3తో ముగిసిందని, ఆ మరుసటి రోజే ప్రభుత్వం జీహెచ్‌ఎంసీకి ప్రత్యేకాధికారిని నియమించిందని తెలిపారు. ప్రత్యేకాధికారుల పాలనలో అభివృద్ధి కార్యక్రమాలు ఆగిపోయే ప్రమాదం ఏర్పడిందన్నారు.

    ప్రజా ప్రాతినిధ్యం లేకపోవడం వల్ల సమస్యలు సకాలంలో పరిష్కారం కావడం లేదని తెలిపారు. పాలక మండలి గడువు ముగిసిన వెంటనే ఎన్నికలు నిర్వహించాలని, ఇలా చేయకపోవడం రాజ్యాంగంలోని అధికరణ 243(యూ)కు విరుద్ధమని వివరించారు. ప్రత్యేకాధికారుల పాలనను రద్దు చేసి, 2011 జనాభా లెక్కల ప్రకారం వార్డులను పునర్విభజన చేసి, ఎన్నికలు నిర్వహించాలని, ఆ మేరకు ప్రభుత్వాన్ని, ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని ఆయన కోర్టును అభ్యర్థించారు.
     

>
మరిన్ని వార్తలు