ఓటీపీ చెప్పాడు.. లక్షలు వదిలించుకున్నాడు

18 Jul, 2019 08:19 IST|Sakshi
కాశీరావు ఫిర్యాదును తీసుకుంటున్న ఎస్సై సమందర్‌వలి

సైబర్‌ నేరగాళ్ల బారిన పడిన బాధితుడు

బ్యాంకు ఖాతా నుంచి రూ.1.78 లక్షలు మాయం

పోలీసుల చొరవతో నగదు బదిలీకి అడ్డుకట్ట

గిద్దలూరు: రియల్‌ వ్యాపారులకు మధ్యవర్తిగా వ్యవహరించే ఓ వ్యక్తి ఖాతా నుంచి గుర్తు తెలియని వ్యక్తి లక్షా 78వేల రూపాయలు మాయం చేసిన సంఘటన బుధవారం వెలుగులోకి వచ్చింది. అందిన సమాచారం ప్రకారం.. మండలంలోని గడికోట గ్రామానికి చెందిన సంకుల కాశీరావు కుమారునికి వ్యాపారం పెట్టించేందుకు నగదు సిద్ధం చేసుకున్నాడు. సుమారు రూ.2.50 లక్షల వరకు నగదును బ్యాంకు ఖాతాలో భద్రపరచుకున్నాడు. కాగా మంగళవారం కాశీరావుకు గుర్తు తెలియన వ్యక్తి ఫోన్‌ చేసి తాను సీఎంఓ కార్యాలయం నుంచి ఫోన్‌ చేస్తున్నానని.. మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారా అని అడిగాడు. పిల్లలు పెద్దవారయ్యారని.. ఉద్యోగం రాకపోవడంతో వ్యాపారం పెట్టించాలని ప్రయత్నిస్తున్నానని కాశీరావు అతనికి బదులిచ్చాడు. మాటలు కలిపిన గుర్తు తెలియని వ్యక్తి కాశీరావు కుటుంబ వివరాలు తెలుసుకుని బ్యాంకు అకౌంట్‌ వివరాలు అడిగాడు. దీంతో కాశీరావు తన బ్యాంకు అకౌంట్‌ నంబర్, ఏటీఎం కార్డుపై ఉన్న నంబర్‌తో పాటు, సీవీవీ నంబర్‌ చెప్పేశాడు.

అన్నీ తెలుసుకున్న ఫోన్‌చేసిన వ్యక్తి నీ సెల్‌కు మెసేజ్‌ వస్తుందని.. ఆ నంబర్‌ చెప్పాలనడంతో వెంటనే చెప్పేశాడు. దీంతో సదరు వ్యక్తి ఆన్‌లైన్‌ ద్వారా ఫ్లిప్‌ కార్డులో వస్తువులు రూ.12వేలు, రూ.18వేలు చొప్పున ఒక్క రోజే రూ.90 వేలు డ్రా చేశాడు. అయినప్పటికీ తాను మోసపోయానని గుర్తించని కాశీరావు ప్రశాంతంగానే ఉన్నాడు. తిరిగి బుధవారం ఫోన్‌ చేసి మరోసారి ఓటీపీ చెప్పాలన్నాడు. ఇన్ని పర్యాయాలు ఎందుకు ఫోన్‌ చేస్తున్నాడోనన్న అనుమానం వచ్చిన కాశీరావు ఓటీపీ చెప్పలేదు. దీంతో కాశీరావు బ్యాంకు ఖాతాలో ఉన్న నగదులో మరో రూ.88 వేలు గుర్తు తెలియని వ్యక్తి తన పేటీఎంలో వేసుకున్నాడు. ఇలా మొత్తం రూ.1.78 లక్షలు కాశీరావు ఖాతాలోంచి మళ్లించాడు. తాను మోసపోయానని గుర్తించిన కాశీరావు బ్యాంకుకు వెళ్లి అకౌంట్‌బుక్‌లో ప్రింటింగ్‌ వేయించుకోగా నగదు ఖాళీ అయింది.

దీంతో ఆయన స్థానిక ఎస్సై సమందర్‌వలిని ఆశ్రయించాడు. కాశీరావు ఫిర్యాదును స్వీకరించిన ఎస్సై కాశిరావు ఖాతాలోని నగదు ఎక్కడెక్కకు వెళ్లిందో గుర్తించి నిందితుడు ఫ్లిప్‌కార్డులో కొనుగోలు చేసిన ఆర్డర్లను క్యాన్సిల్‌ చేయాలని సంస్థ ప్రతినిధులతో ఫోన్‌లో మాట్లాడారు. పే టీఎం సంస్థ యాజమాన్యం, బ్యాంకు అధికారులతో మాట్లాడి నగదును బ్లాక్‌ చేయాల్సిందిగా ఎస్సై కోరారు. ఇలా కాశీరావు నగదు డ్రా కాకుండా అడ్డుకున్నాడు. రెండు లేదా మూడు రోజుల్లో కాశీరావు ఖాతాలోంచి డ్రా అయిన నగదు తిరిగి ఖాతాలోకి వస్తుందని ఎస్సై చెబుతున్నారు. ప్రజలు సైబర్‌ నేరగాళ్ల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఎస్సై సూచించారు. ఓటీపీ నంబర్‌ ఎవరికీ చెప్పవద్దని, అలా చెప్పడం వలన తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందన్నారు.  

మరిన్ని వార్తలు