తప్పులు ఒప్పుకోకుంటే చంద్రబాబు ఇంటివద్ద దీక్ష..

11 Sep, 2019 14:27 IST|Sakshi

సాక్షి, వైఎస్సార్‌ జిల్లా : వచ్చే శాసనసభ సమావేశాల నాటికి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన తప్పులను ఒప్పుకుని ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని, లేనిపక్షంలో ఆయన ఇంటి ముందు ఆమరణ దీక్షకు దిగుతానని గిద్దలూరు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు హెచ్చరించారు. టీడీపీ దుష్టపాలనకు చరమగీతం పాడి ప్రజలకు మేలు చేసే కొత్త యువ నాయకత్వాన్ని అందించింనందుకు కృతజ్ఞతగా ఈ నెల 4న గిద్దలూరు నియోజకవర్గం నుంచి ప్రారంభించిన తిరుమల పాదయాత్ర 8వ రోజైన బుధవారం నాటికి వైఎస్సార్‌ జిల్లా బద్వేలుకు చేరుకుంది.

ఈ సందర్భంగా పట్టణ శివార్లలో బద్వేలు ఎమ్మెల్యే డాక్టర్‌ జి.వెంకటసుబ్బయ్యతో పాటు పలువురు వైఎస్సార్‌సీపీ నాయకులు, ఆర్యవైశ్య సంఘం నాయకులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. అనంతరం స్థానిక సాయి ఫంక‌్షన్‌హాలులో ఎమ్మెల్యే అన్నా రాంబాబు మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు తన ఐదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించడంతో పాటు ప్రజాస్వామ్య విలువలను కాలరాస్తూ 23 మంది వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలను టీడీపీలోకి చేర్చుకుని నైతిక విలువలకు తిలోదకాలిచ్చారని మండిపడ్డారు. అటువంటి చంద్రబాబు జగన్‌ పాలనపై విమర్శలు చేయడం సిగ్గుచేటన్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ వంద రోజుల పాలనలో రాష్ట్ర ప్రజలంతా సుఖసంతోషాలతో ఉన్నారని, అది జీర్ణించుకోలేని చంద్రబాబు అనవసర రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు.  

మరిన్ని వార్తలు