లివిటిపుట్టు బిక్కుబిక్కు

26 Sep, 2018 07:24 IST|Sakshi
ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి ఇంటివద్ద పోలీసు బందోబస్తు

జల్లెడ పడుతున్న పోలీసు బలగాలు

ఒక పక్క మావోయిస్టులు,మరోపక్క పోలీసుల భయం

ఆందోళన చెందుతున్న గిరిజనం

ఇళ్లకు తాళాలు వేసి బంధువుల ఇళ్లకు వెళ్లిన వైనం

మన్యంలో కొనసాగుతున్న ఉద్రిక్తత

మన్యంలో అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివారి సోమను మావోయిస్టులు హతమార్చిన నేపథ్యంలో మన్యంలో భయాందోళన పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఘటనలో ముగ్గురు మావోయిస్టులను గుర్తించిన పోలీసు బలగాలు మన్యంలో అడుగడుగునా జల్లెడ పడుతున్నాయి. మావోయిస్టుల సమాచారం రాబట్టే పనిలో నిమగ్నమవడంతో గిరిజనులు వణికి పోతున్నారు.  లివిటిపుట్టు గ్రామం భయం గుప్పెట్లో ఉంది. గిరిజనులు ఇళ్లల్లోంచి బయటకు వచ్చేందుకు భయపడుతున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందోనని ఆందోళన చెందుతున్నారు.

విశాఖపట్నం, డుంబ్రిగుడ (అరకు): డుంబ్రిగుడ మండలం పోతంగి పంచాయతీ లివిటిపుట్టు సమీపంలో అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమను మావోయిస్టులు కాల్చి చంపడంతో మన్యంలో నెలకొన్న ఉద్రిక్తత కొనసాగుతోంది. సంఘటన జరిగిన ఆదివారం నుంచి లివిటిపుట్టుతోపాటు పరిసర గ్రామాల గిరిజనులు బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు.

ప్రశ్నిస్తే.. ఏం చెప్పాలి..?
సుమారు 300 జనాభా గల ఈ గ్రామంలో 30 గిరిజన కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. కరవ మంటే కప్పకు కోపం.. విడవమంటే పాముకు కోపం అన్న చందంగా వీరి పరిస్థితి ఉంది. ఏ క్షణంలో ఎవరొచ్చి ప్రశ్నిస్తే.. ఏమి చెప్పాలో తెలియని పరిస్థితుల్లో వీరున్నారు. కొంతమంది ఇళ్లకు తాళాలు వేసుకుని బంధువుల ఇంటికి వెళ్లిపోయినట్టు సమాచారం. సాయంత్రం ఆరు గంటలు దాటితో ఇళ్లల్లోంచి బయటకు రావడం లేదు.

మండల కేంద్రం డుంబ్రిగుడలో..
మండల కేంద్రం డుంబ్రిగుడలో కూడా ఇదే పరిస్థితి. రాత్రి ఏడు గంటలకే దుకాణాలు మూసివేసి ఇళ్లకు వెళ్లిపోతున్నారు. దీంతో సెంటర్‌తోపాటు రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. పగటి వేళల్లో కూడా బితుకుబితుకు మంటూ కాలం గడుపుతున్నారు.

బూట్ల చప్పుడుతో గజగజ
ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేలను హత మార్చిన ఘటనలో పాల్గొన్న మావోయిస్టులను గుర్తించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. ప్రత్యేక్ష సాక్షుల ద్వారా ముగ్గురు మావోయిస్టుల వివరాలను సేకరించిన పోలీసులు మీడియాకు విడుదల చేయడంతో గిరిజనులు మరింత భయంతో వణికిపోతున్నారు. ఒడిశా సరిహద్దు(ఏవోబీ) ప్రాంతం ఉద్రిక్తంగా మారింది. లివిటిపుట్టుతో పాటు మారుమూల ప్రాంతాలను గ్రేహౌండ్స్‌ దళాలు, స్పెషల్‌ పార్టీ పోలీసులు, సీఆర్పీఎప్‌ బలగాలు జల్లెడపడుతున్నాయి. కూంబింగ్‌ ఆపరేషన్‌ ముమ్మరం చేశాయి. ఒక పక్క మావోయిస్టులు, మరోపక్క పోలీసుల మధ్య గిరిజనులు నలిగిపోతున్నారు. మండల కేంద్రంలో పోలీసులు అణువణువు గాలిస్తున్నారు. మూడు రోజుల నుంచి గిరిజన ప్రాంత గ్రామాలన్నీ నిర్మానుష్యంగా మారాయి. ఏక్షణంలో ఏం జరుగుతుందోనన్న ఆందోళన గ్రామాల్లో కనిపిస్తోంది.

భయం గుపెట్లో నాయకులు
అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమను మావోయిస్టులు కాల్చి చంపడంతో మన్యంలోని ప్రజాప్రతినిధులు, నాయకులు భయంతో వణికిపోతున్నారు. మైదాన ప్రాంతానికి తరలిపోవాలని పోలీసులు హెచ్చరించడంతో వారిలో మరింత ఆందోళన నెలకొంది.

ఆర్కే, చలపతి మళ్లీ తెరపైకిగాలింపు ముమ్మరం చేసిన పోలీసు బలగాలు
సీలేరు (పాడేరు): ఆంధ్రా, ఒడిశా, తూర్పుగోదావరి, చత్తీస్‌గడ్‌ రాష్ట్రాల్లో మావోయిస్టుల ఉద్యమాన్ని ఒంటిచేత్తో నడిపిస్తున్న అగ్రనేతలు ఆర్కే, చలపతి రెండేళ్ల తర్వాత మళ్లీ ఉద్యమాన్ని బలోపేతం చేశారనడానికి ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే హత్యే ఉదాహరణ. గతం వరకు వారిద్దరిని మట్టుబెడితే సరిపోతుందని బలగాలు వారికోసం వెంటాడాయి. అయితే రెండేళ్లుగా ప్రశాంతంగా ఉండి పోలీసుల నుంచి వచ్చిన ఘటనలను ఎదుర్కొంటున్న అగ్రనేతలంతా వ్యూహా రచనతో పెద్ద సంచలనాన్ని సృష్టించడంతో పోలీసుశాఖ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అరకు సంఘటనకు పదిరోజుల ముందే ఆర్కే, చలపతి విశాఖ ఏజెన్సీలోకి వచ్చారని ఇంటలిజెన్స్‌ సమాచారం ఉంది. ఈ సంఘటన అనంతరం వారిద్దరిని పట్టుకోవాలనే లక్ష్యంతో ఈ ప్రాంతంలో కూంబింగ్‌ ముమ్మరం చేశారు. అడవుల్లో అణువణువు గాలింపులు చేపడుతున్నారు. తూర్పుగోదావరి, ఒడిశా పోలీసు బలగాలు కూడా రంగంలోకి దిగాయి. ఏ క్షణంలోనైనా మావో యిస్టులు, పోలీసులకు ఎదురు కాల్పులు జరిగే అవకాశం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.  

పెద్ద దిక్కు కోల్పోయాం
పాడేరు: నాన్న దూరమవడంతో పెద్దదిక్కును కోల్పోయాం. మా కుటుంబం రోడ్డున పడిందని, ప్రభుత్వమే మాకు దారి చూపాలని కిడారి సర్వేశ్వరరావు కుమారులు శ్రావణ్‌ కుమార్, సందీప్‌ కుమార్‌ కోరారు. మంగళవారం ఇక్కడ వారు విలేకరులతో మాట్లాడుతూ తమ తండ్రి హత్యోదంతంపై కన్నీరు పెడుతూ తమకు ఎంతో అన్యాయం జరిగిందని, మా జీవనం అగమ్యగోచరంగా మారిందని వాపోయారు. మావోయిస్టులు మా తండ్రిని  దారుణంగా చంపారని, తప్పు చేసి ఉంటే ఒక్కసారైనా హెచ్చరించి ఉంటే బాగుండునని, సరిదిద్దుకునే అవకాశం ఇవ్వకుండా చంపడం అన్యాయమని అన్నారు. తనకు మావోయిస్టుల వల్ల ఇలాంటి ముప్పు ఉంటుందని ఏనాడూ మా నాన్న తమకు చెప్పలేదని అన్నారు. గతంలో ఎన్నడూ మా నాన్నను హెచ్చరికలు చేసిన సందర్భాలు కూడా లేవని, ఆకస్మికంగా హత్య చేయడం నమ్మలేకపోతున్నామని అన్నారు. ప్రజల కోసం మంచి పనులు చేస్తున్నామని, చాలా అభివృద్ధి చేయగలిగానని నాన్న సర్వేశ్వరరావు చెప్పేవారని, తనకు ఎటువంటి ఇబ్బంది ఉండదని కూడా అంటుండేవారని వారు వెల్లడించారు. నాన్న రాజకీయ వ్యవహారాల్లో తామెప్పుడు జోక్యం చేసుకోలేదని, నాన్న అప్పుడుప్పుడు మంచి కార్యక్రమాలు చేసినపుడు మాకు చెప్పేవారని, మమ్మల్ని మాత్రం ఎప్పుడు బాగా చదువుకోవాలని చెబుతుండేవారన్నారు. మా ఇద్దరితో పాటు చెల్లెలు తనిష్క కూడా చదువుకుంటోందన్నారు. తండ్రి మృతితో మా భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని, ప్రభుత్వమే తమను అన్నివిధాలా ఆదుకోవాలని వారు కోరా>రు.  

ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరికిభద్రత పెంపు
పాడేరు: పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరికి పోలీసులు భద్రత పెంచారు. అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమలను మావోయిస్టులు హత్య చేసిన నేపథ్యంలో పాడేరులోని ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి ఇంటివద్ద అదనంగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. పర్యటనలకు వెళ్లినపుడు తమకు సమాచారం ఇవ్వాలని పోలీసుశాఖ ఆంక్షలు విధించింది. ఎమ్మెల్యేకు ఇప్పుడున్న గన్‌మెన్‌లతో పాటు అదనంగా గన్‌మెన్‌ ఏర్పాటు చేసేందుకు పోలీసుశాఖ ఏర్పాటు చేసింది.

మా కుటుంబాన్ని ఆదుకోవాలి :సివేరితనయుడు అబ్రహం
డుంబ్రిగుడ (అరకు): ఎమ్మెల్యే  కిడారి సర్వేశ్వరరావు,మాజీ ఎమ్మెల్యే సివేరి సోమలను మా వోయిస్టులు కాల్చి చం పేశారు. దీంతో మాకు పెద్ద దిక్కుగా ఉన్న మా తండ్రి మృతి చెందడంతో వీధిన పడ్డామని, తమ కుటుంబాన్ని సీఎం చంద్రబాబు ఆదుకుని న్యాయం చేయాలని సివేరి సోమ కుమారుడు అబ్రహం కోరారు. లివిటిపుట్టు గ్రామ సమీపంలో తండ్రి సోమ మృతి చెందిన సంఘటన స్థలాన్ని మంగళవారం పరిశీలించిన ఆయన కన్నీరు మున్నీరుగా విలపించారు.  మావోయిస్టులు దారుణంగా మా తండ్రిని చంపడం ఎంతో బాధాకరమన్నారు. దీని వెనుక మావోయిస్టులతో పాటు రాజకీయ కుట్ర కూడా ఉంటుందన్నారు. దీనిపై ప్రభుత్వం పూర్తిస్థాయిలో దర్యాప్తు నిర్వహించి దోషులను శిక్షించి తమకు న్యాయం చేయాలని ఆయన కోరారు. ఆయన వెంట కుటుంబ సభ్యులు ఉన్నారు.

మరిన్ని వార్తలు