వ్యాపార సంస్థలకు ‘కానుక’!

14 Jan, 2015 04:32 IST|Sakshi
వ్యాపార సంస్థలకు ‘కానుక’!

గోధుమ పిండి, బెల్లం, కందిపప్పు టెండర్లలో గోల్‌మాల్
 
బహిరంగ మార్కెట్ కన్నా ఎక్కువగా ధర నిర్ణయం
ఒకే సంస్థ ఒక్కో జిల్లాకు ఒక్కో ధర చొప్పున సరఫరా
సంక్రాంతి సమీపించినా సగం మందికే సరుకులు

 
హైద రాబాద్: ప్రభుత్వ పెద్దల ఆశీస్సులుంటే చాలు పథకాల టెండర్లు దక్కించుకొని అక్రమంగా కోట్లు గడించవచ్చని ‘చంద్రన్న కానుక’ పథకం స్పష్టం చేస్తోంది. సంక్రాంతి పండుగ సందర్భంగా చంద్రన్న కానుక పేరిట తెల్ల రేషన్ కార్డుదారులకు అర కిలో కందిపప్పు, అర లీటర్ పామాయిల్, కిలో శనగలు, అర కిలో బెల్లం, కిలో గోధుమ పిండి, 100 గ్రాముల నెయ్యి ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేస్తోంది. సరుకుల పంపిణీని జిల్లాల వారీగా పలు సంస్థలు, కంపెనీలకు అప్పగించిన ప్రభుత్వం ఒకే సంస్థ ఒక్కో జిల్లాలో ఒక్కో ధరకు సరుకులు సరఫరా చేసేందుకు వీలుగా అనుమతులిచ్చింది. తద్వారా అవినీతికి గేట్లు ఎత్తింది. పైగా ఇంత పెద్దమొత్తంలో సరుకులు పంపిణీ చేస్తున్నప్పుడు తక్కువ ధర పలకాల్సి ఉండగా బహిరంగ మార్కెట్‌తో పోల్చుకుంటే ఎక్కువ ధర కోట్ చేసిన సంస్థలు టెండర్లు దక్కించుకోవడం గమనార్హం. మరోవైపు ఒకే సంస్థ వేర్వేరు జిల్లాల్లో వేర్వేరు రేట్లకు సరుకులు సరఫరా చేయడం విశేషం. వివరాలను పరిశీలిస్తే.. శ్రీకాకుళం, కృష్ణా జిల్లాలకు గోధుమ పిండిని సరఫరా చేసేందుకు ఓంకార్ జగన్నాథ ట్రేడర్స్ టెండర్ దక్కించుకుంది. అయితే శ్రీకాకుళం జిల్లాలో క్వింటాల్‌కు రూ.2,664 ప్రకారం సరఫరా చేస్తున్న ఈ కంపెనీ, కృష్ణా జిల్లాలో మాత్రం రూ.2,745 ధర నిర్ణయించడం గమనార్హం.

ఇక ఓ మంత్రి బంధువుకు సంబంధం ఉన్న లెసైన్సు లేని కేంద్రీయ భండార్ సంస్థ.. విజయనగరం జిల్లా వరకు రూ.2,816, తూర్పు గోదావరి జిల్లాకు రూ.2,866 ధరకు గోధుమ పిండిని సరఫరా చేస్తోంది. అదేవిధంగా కోరమాండల్ రోలర్ ఫ్లోర్ మిల్స్ ప్రైవేట్ లిమిటెడ్.. విశాఖపట్నం జిల్లా వరకు రూ.2,800 ధరకు, ప్రకాశం జిల్లాలో రూ.2,735కు సరఫరా చేస్తుండగా.. సూదులగుంట ఆగ్రో మిల్స్‌కు నెల్లూరు జిల్లా వరకు రూ.2,800, అనంతపురం జిల్లాకు రూ.2,799, కడప జిల్లాకు రూ.2,772 ధర నిర్ణయించారు. ఏయన్‌జీ ఆగ్రో ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ పశ్చిమగోదావరి జిల్లాలో రూ.2,850కు, శ్రీ వెంకట రాకేష్ ట్రేడింగ్ కంపెనీ గుంటూరు జిల్లాలో రూ.2,675కు, అసతి రాజ్‌కుమార్ రోలర్ ఫ్లోర్ మిల్స్ ప్రైవేట్ లిమిటెడ్ చిత్తూరు జిల్లాలో రూ. 2,800కు, గోదావరి రోలర్ ఫ్లోర్‌మిల్స్ కర్నూలు జిల్లాలో రూ.2,735కు క్వింటాల్ గోధుమ పిండి సరఫరా చే సేందుకు టెండర్లు దక్కించుకున్నాయి. ఇక బెల్లం సరఫరాలోనూ ఇదే పరిస్థితి నెల కొంది. వాసవి మోడరన్ దాల్ మిల్.. విజయనగరం జిల్లాలో క్వింటాల్ బెల్లం రూ. 3,863కు, గుంటూరు జిల్లాలో రూ. 3,996కు, కడప జిల్లాలో రూ.3,998కు సరఫరా చేసేందుకు వీలుగా టెండర్ దక్కించుకోవడం విశేషం.

కేంద్రీయ భండార్‌కు కృష్ణా జిల్లాలో రూ.3,998, నెల్లూరు జిల్లాలో రూ.3,985, కర్నూలు జిల్లాలో రూ.3,986 ప్రకారం సరుకులు సరఫరా చేస్తోంది. శబరి సూర్యనందన ట్రేడర్స్ తూర్పు గోదావరి, చిత్తూరు జిల్లాలకు రూ.3,900 చొప్పున సరఫరా చేస్తుండగా, రోహిత్ ట్రేడింగ్ కంపెనీ శ్రీకాకుళం జిల్లాకు రూ.3,700, సి.వి.రామయ్య అండ్ కంపెనీ ప్రకాశం జిల్లాలో రూ.3,900, అదినాథ్ ట్రేడర్స్ రూ.3,996, బుడ్డా సత్యనారాయణ అండ్ సన్స్ విశాఖపట్నం జిల్లాలో రూ.3,900, షర్మిస్టా ట్రేడర్స్ పశ్చిమ గోదావరి జిల్లాలో రూ.3,500 చొప్పున బెల్లం సరఫరా చేసేం దుకు టెండర్ కేటాయించారు. కందిపప్పు సరఫరా బాధ్యతను శ్రీకాకుళం, తూర్పు గోదావరి జిల్లాలకు సంబంధించి శ్రీ బాలాజీ గ్రౌండ్‌నట్ ఆయిల్ మిల్లుకు  అప్పగించారు. విజయనగరం, విశాఖపట్నం, పశ్చిమ గోదావరి, కృష్ణా, నెల్లూరు, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో సరఫరా బాధ్యతను కేంద్రీయ భండార్ దక్కించుకోవడం గమనార్హం. కేంద్రీ య భండార్ సంస్థ పై మూడు రకాల సరుకుల సరఫరా టెండర్లను దక్కించుకోవడం గమనార్హం. మరోవైపు శనగల ప్యాకింగ్ బాధ్యత ప్రభుత్వ పెద్దల బంధుగుణానికే అప్పగించారనే ఆరోపణలున్నాయి. ఇలావుండగా.. ఈనెల 12వ తేదీ లోపు మొత్తం సరుకులు లబ్దిదారులకు చేరాలని ప్రభుత్వం ఆదేశించినప్పటికీ.. ఏ జిల్లాలో కూడా ఇప్పటివరకు 30 శాతం మించి సరఫరా కాలేదని తెలుస్తోంది.
 
1.3 కోట్ల కుటుంబాలకు చంద్రన్న కానుక: మంత్రి పల్లె

మదనపల్లె: రాష్ట్రంలోని 1.30 కోట్ల కుటుంబాలకు రూ.314 కోట్లు వెచ్చించి ‘చంద్రన్న కానుక’ ఇచ్చినట్లు ఐటీ, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి తెలిపారు. ఆయన మంగళవారం ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ సంక్రాంతి పండుగను ప్రతి కుటుంబమూ ఖర్చు లేకుండా జరుపుకోవాలనే ఉద్దేశంతో ఉచితంగా సరుకులు ఇచ్చినట్లు చెప్పారు. సంప్రదాయబద్ధమైన కళలు, ఆచారాలు ప్రోత్సహించేందుకు రూ.14.2 కోట్లు వెచ్చించి, రాష్ట్రవ్యాప్తంగా సంక్రాంతి సంబరాలు జరుపుతున్నామని వెల్లడించారు.
 
 

మరిన్ని వార్తలు