తిరుపతి కమిషనర్‌గా గిరీషా

23 Jun, 2019 09:36 IST|Sakshi
గిరీషా, విజయ్‌రామరాజు

మరో ఇద్దరు ఐఏఎస్‌ల బదిలీ

తిరుపతి నగర పాలక సంస్థకు జేసీ  

ఏపీ మార్క్‌ఫెడ్‌ ఎండీగా విజయ్‌ రామరాజు

నూతన జాయింట్‌ కలెక్టర్‌ మార్కండేయులు 

సాక్షి, చిత్తూరు కలెక్టరేట్‌/తిరుపతి తుడా: తిరుపతి నగర పాలక సంస్థ కమిషనర్‌గా జిల్లా జాయింట్‌ కలెక్టర్‌గా విధులు నిర్వరిస్తున్న పీఎస్‌ గిరీషా నియమితులయ్యారు. ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ఐఏఎస్‌ల బదిలీలను చేపట్టింది. ఇందులో భాగంగా కొంతమందిని శుక్రవారం రాత్రి బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ఈ బదిలీల్లో తిరుపతి నగర పాలక సంస్థ కమిషనర్‌గా ఉన్న వి.విజయ్‌ రామరాజును రాష్ట్ర మార్క్‌ఫెడ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌గా బదిలీ చేశారు. ఆయన స్థానంలో జిల్లా జాయింట్‌ కలెక్టర్‌గా ఉన్న గిరీషాను నియమిస్తూ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అలానే తుడా వైస్‌ చైర్మన్‌గానూ గిరీషాను నియమించారు. రాష్ట్ర ఎన్నికల సంఘ కార్యాలయంలో సంయుక్త ఎన్నికల అధికారిగా పనిచేస్తున్న మార్కండేయులును జిల్లా జాయింట్‌ కలెక్టర్‌గా నియమించారు.

జాయింట్‌ కలెక్టర్‌గా తనదైన మార్క్‌
అన్ని శాఖల్లో కీలకమైన రెవెన్యూ శాఖకు ఉన్నతాధికారిగా ఉండే జాయింట్‌ కలెక్టర్‌ పోస్టులో గత రెండు సంవత్సరాల్లో గిరీషా తనదైన మార్క్‌ను సంపాదించుకున్నారు. సంవత్సరాల కొద్ది పరిష్కారం కాని భూ సమస్యల పరిష్కారానికి చొరవ చూపారు. కబ్జాలకు గురైన ప్రభుత్వ భూముల సంరక్షణకు కృషి చేశారు. గత ఎన్నికల్లో రాజంపేట పార్లమెంట్‌ ఆర్వో, జిల్లా డిప్యూటీ ఎన్నికల అధికారిగా విధులు నిర్వహించి ఎన్నికలను సజావుగా నిర్వహించారు. జిల్లాలో జరుగుతున్న అభివృద్ధిలో భూములు కోల్పోయిన రైతులకు, ప్రజలందరికి నష్టపరిహారం అందించే విషయంలో ప్రత్యేక చొరవ చూపారు.
 
నూతన జేసీగా మార్కాండేయులు
రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయంలో సంయుక్త  ఎన్నికల అధికారిగా పనిచేస్తున్న మార్కాండేయులును జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ గా నియమించారు. ఆయన సోమవారం బాధ్యతలను స్వీకరించనున్నారు. 
 
ఎంతో సంతృప్తినిచ్చింది
జిల్లాలో జేసీగా పనిచేయడం ఎంతో సంతృప్తినిచ్చింది. కార్పొరేషన్‌లో పనిచేయాలనే కోరిక ఉండేది అది ప్రస్తుతం లభించింది. సీఎం ఆశయాలను నెరవేర్చేందుకు శక్తివంచన లేకుండా విధులు నిర్వహిస్తాను. ఇన్నాళ్లు రెవెన్యూలో విధులు నిర్వహించాను. ఇకపై కార్పొరేషన్‌లో పనిచేయడం ఓ కొత్త అనుభూతినిస్తుందని భావిస్తున్నాను.  సోమ లేదా మంగళవారంలో తిరుపతి మున్సిపల్‌ కమిషనర్‌ గా బాధ్యతలు స్వీకరిస్తాను.                 – జాయింట్‌ కలెక్టర్‌ గిరీష 

కీలక ప్రాజెక్టులను పట్టాలెక్కించిన విజయ్‌రామరాజు
2018 మే12న తిరుపతి కమిషనర్‌గా విజయ్‌రామరాజు బాధ్యతలు చేపట్టారు. అంతకు ముందు ఆయన రామజహేంద్రవరం కమిషనర్‌గా కమిషనర్‌గా పనిచేశారు. ఏడాదికి పైగా 40 రోజుల పాటు తిరుపతి కమిషనర్‌గా పనిచేశారు. ఆయన ఆధ్వర్యంలో స్మార్ట్‌ సిటీలోని పలు కీలక ప్రాజెక్టులను పట్టాలెక్కించారు. ఎలివేటెడ్‌ కారిడార్, మల్టీపర్పస్‌ కాంప్లెక్‌స, ఇండోర్‌ స్టేడియం, పార్కుల అభివృద్ధి, అండర్‌ కేబుల్‌ సిస్టమ్, ఈ స్కూటర్‌ వంటి పలు ప్రాజెక్టులను టెండర్‌ దశకు తీసుకెళ్లారు. స్వచ్చ సర్వేక్షన్‌ పోటీల్లో తిరుపతిని జాతీయ స్థాయిలో 8వ స్థానంలో నిలిపారు. ప్లాస్టిక్‌ నిషేధం అమలుకు కఠిన చర్యలు తీసుకున్నారు. ఈ నేపధ్యంలో ప్లాస్టిక్‌ ఫ్రీ సిటీగా తిరుపతిని నిలిపి జాతీయ స్థాయిలో మరోసారి మంచి గుర్తింపు పొందేలా చేశారు.

మరిన్ని వార్తలు