ఇంకా ఆడ పిల్లనే!

30 May, 2018 12:33 IST|Sakshi

జిల్లాలో తగ్గుతున్న స్త్రీల సంఖ్య

వెయ్యి మంది స్త్రీలు...1012 మంది పురుషులు

లింగనిర్ధారణ పరీక్షలు,భ్రూణహత్యలే కారణం

పశ్చిమ ప్రాంతంలో లింగవివక్ష అధికం

ఈ సృష్టికి క్షేత్రం స్త్రీ. క్షేత్రమే లేకపోతే సృష్టి పతనం ప్రారంభమవుతుంది. ఇప్పుడు జిల్లాలో అదే జరుగుతోంది. ఆడపిల్ల జన్మిస్తే ఆర్థిక భారమని, ఆమెను కనిపెంచడం కష్టమని, ఎప్పుడైనా ఒకరింటికి వెళ్లాల్సిందే కదా అని.. తదితర కారణాలు చెబుతూ ఆడపిల్లలను కనడం తగ్గిస్తున్నారు. ఫలితంగా జిల్లాలో పురుషుల కంటే స్త్రీల సంఖ్య గణనీయంగా తగ్గుతోంది. దీనికితోడు పలువురు వైద్యుల సహాయంతో కడుపులోనే ఆడపిల్లను(భ్రూణహత్య) చంపేస్తున్నారు.  

కర్నూలు (హాస్పిటల్‌): ఆడపిల్ల.. పుట్టినప్పటి నుంచి తల్లిదండ్రులు భారంగా భావించే నేపథ్యంలో ఆ అపోహను తొలగించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు చర్యలు తీసుకుంటున్నా ఇంకా మార్పు రావడం లేదు. చదువు, పెళ్లికి ప్రోత్సాహాకాల పేరుతో భరోసానిస్తున్నా తల్లిదండ్రులు.. ‘ఆడ’ పిల్లగానే చూస్తున్నారు. అందమైన లోకంలోకి  అడుగు పెట్టకుండా అడ్డుకుంటున్నారు. జిల్లాలోని అన్ని మండలాల్లో కలిపి 2011 జనాభా లెక్కల ప్రకారం 40,53,463 మంది  ఉన్నారు. ఇందులో 20,39,227 మంది పురుషులు, 20,14,236 మంది స్త్రీలు ఉన్నట్లు అధికారులు లెక్కలు తేల్చారు. ప్రతి 1000 మంది స్త్రీలకు 1012 మంది పురుషులు సగటున జిల్లాలో ఉన్నట్లు అధికారులు ప్రభుత్వానికి లెక్కలు పంపించారు. 8 ఏళ్ల తర్వాత ఈ లెక్కలు ఇప్పటికి ఇంకా పెరిగి ఉంటాయి. ప్రతి 1000 మంది స్త్రీలకు 1050 మంది పురుషులు ఉండే అవకాశం ఉంది. అధికారిక లెక్కల ప్రకారం లెక్కలు ఇవి. వాస్తవ పరిస్థితి క్షేత్రస్థాయిలో మరింత దారుణంగా ఉంటుంవదని మేధావులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా ఆదోని, కర్నూలు డివిజన్‌లో పురుషుల కంటే స్త్రీల సంఖ్య చాలా తక్కువగా ఉంది.

కడుపులోనే చిదిమేస్తున్నారు...
జిల్లాలో భ్రూణహత్యలకు అదుపులేకుండా పోతోంది. అధికారికంగా జిల్లాలో 200కు పైగా స్కానింగ్‌ కేంద్రాలు ఉండగా,  అనధికారికంగా  రెట్టింపు సంఖ్యలో ఉంటాయి. ఇప్పటి వరకు అధికారుల వద్ద స్కానింగ్‌ కేంద్రాల కోసం 120 దాకా దరఖాస్తులు ఉన్నాయి. కర్నూలు నగరంలోని ఎన్‌ఆర్‌ పేట, కొత్తబస్టాండ్‌ పరిసర ప్రాంతాలు, ఆదోని, కోడుమూరు, నంద్యాలలోని కొన్ని స్కానింగ్‌ కేంద్రాల్లో యథేచ్ఛగా లింగనిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. సాధారణంగా స్కానింగ్‌కు రూ.600 నుంచి రూ.800 వరకు చార్జ్‌ చేస్తారు. లింగనిర్ధారణ చేయడానికి మాత్రం డిమాండ్‌ను బట్టి రూ.2 వేల నుంచి రూ.3 వేల వరకు తీసుకుంటున్నారు. గర్భంలో ఉన్నది ఆడపిల్ల అని తెలియగానే నిర్దాక్షిణ్యంగా చంపేయడానికి వెనుకాడటం లేదు. 

అనాథ ఆశ్రమాల్లో వారే అధికం..
గర్భస్రావానికి వీలుగాకపోతే ప్రసవించాక ఆ శిశువును అనాథలను చేస్తున్నారు.  జిల్లాలోని అనాథాశ్రయాల్లో ఉన్న అనాథ పిల్లల్లో 80 శాతం ఆడపిల్లలే ఉండటం గమనార్హం. పుట్టిన వెంటనే ముళ్ల పొదల్లో పాడేసి చేతులు దులుపుకుంటున్నారు. 

అధికారుల చర్యలు శూన్యం
కర్నూలు కొత్తబస్టాండ్‌లోని పలు ప్రైవేటు ఆసుపత్రులు, కోడుమూరు, ఆదోని, నంద్యాలలోని పలు ప్రైవేటు ఆసుపత్రుల్లో భ్రూణహత్యలు జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. తూతూ మంత్రంగా అధికారులు దాడులు చేసి చేతులు దులుపుకుంటున్నారు. ఆయా ఆసుపత్రులపై చర్యలు తీసుకోవడానికి భయపడుతున్నారు. కొన్ని ఆసుపత్రులను సీజ్‌ చేసినా మరో తలుపును తెరిచి ఆసుపత్రిని నిర్వహిస్తున్నా చర్యలు తీసుకునేందుకు అధికారులు జంకుతున్నారు.

సెంట్రల్‌ కమిటీలు దాడులు చేస్తాయి..
గతంలో లింగ నిర్ధారణ చేసే స్కానింగ్‌ సెంటర్లపై స్థానిక అధికారులు దాడులు చేస్తున్నా పెద్దగా ఫలితాలు లేవు. దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సెంట్రల్‌ కమిటీల ద్వారా దాడులు నిర్వహించేలా ఆదేశాలు జారీ చేశాయి. ఇక జిల్లాపై స్కానింగ్‌ సెంటర్లపై ఎప్పుడైనా దాడులు జరగవచ్చు.    – జేవీవీ ఆర్కే ప్రసాద్, డీఎంఅండ్‌హెచ్‌ఓ

కర్నూలు నగరంలోని బుధవారపేట మాతా మారెమ్మ గుడి సమీపంలో ఈనెల 17వ తేదీన ఓ చెత్తకుప్ప వద్ద శిశువు ఆర్తనాదాలు వినిపించడంతో స్థానికులు గుర్తించి అక్కున చేర్చుకున్నారు. అనంతరం మూడవ పట్టణ పోలీసులకు చెప్పడంతో శిశువును చికిత్స నిమిత్తం ప్రభుత్వాసుపత్రిలోని చిన్నపిల్లల వార్డులో చేర్పించారు. నెలలు నిండకముందే ఈ బిడ్డ జన్మించడం, చెత్తకుప్పల పాలు కావడం పలు అనుమానాలకు తావిస్తోంది. స్కానింగ్‌లో ఒక్కోసారి లింగ నిర్ధారణ స్పష్టంగా కనిపించదు. ఈ కోవలోనే  స్కానింగ్‌లో ఆడబిడ్డ అని రిపోర్ట్‌ రావడంతో అబార్షన్‌ చేయగా బిడ్డ బయటకు వచ్చాక మగ బిడ్డ అని నిర్ధారణ అయినట్లు తెలుస్తోంది. దీంతో చేసేదేమీ లేక అవయవ లోపం ఉన్న శిశువును వదిలించుకునేందుకు ముళ్ల కంపల మధ్య పడేసినట్లు తెలుస్తోంది.

మరిన్ని వార్తలు