జ్వరంతో గిరిజన బాలిక మృతి

27 Apr, 2019 13:05 IST|Sakshi
వైద్యం పొందుతూ మృతి చెందిన గాయత్రి మృతదేహం

పశ్చిమగోదావరి, బుట్టాయగూడెం: జంగారెడ్డిగూడెంలోని ఒక ప్రైవేట్‌ ఆసుపత్రిలో వైద్యం పొందుతూ రెండేళ్ల గిరిజన బాలిక గురువారం సాయంత్రం మృతి చెందింది. వేలేరుపాడు మండలం మోదేలుకు చెందిన కెచ్చెల బాలకృష్ణారెడ్డి, గంగారత్నంల కుమార్తె గాయత్రి (2) గత కొద్దిరోజులుగా జ్వరంతో బాధపడుతుండగా గ్రామంలోని ఒక ప్రైవేట్‌  వైద్యుడితో వైద్యం చేయించారు. అయితే పరిస్థితి మరింత విషమంగా మారడంతో గాయత్రికి మెరుగైన వైద్యం కోసం ద్విచక్ర వాహనంపై తండ్రి బాలకృష్ణారెడ్డి జంగారెడ్డిగూడెం తీసుకువచ్చి ప్రైవేట్‌ ఆసుపత్రిలో చేర్పించారు. అయితే అక్కడ వైద్యులు రక్త పరీక్షలు చేసి వైద్యం చేసే ప్రయత్నం చేశారని అయితే రిపోర్ట్‌ వచ్చేలోగా గాయత్రి మృతి చెందినట్టు తల్లిదండ్రులు తెలిపారు. మోదేలు గ్రామం బుట్టాయగూడెం మండలం మీదుగా కొండల్లో నుంచి దగ్గర మార్గం కావడంతో బాలిక మృతదేహాన్ని మళ్లీ ద్విచక్రవాహనంపై మోదేలు గ్రామం తీసుకువెళ్లారు.

మోదేలులో వైద్య శిబిరం ఏర్పాటు చేయాలి
మోదేలు గ్రామంలో గిరిజన బాలిక గాయత్రి మృతి నేపథ్యంలో ఆ గ్రామంలో వైద్యశిబిరం ఏర్పాటు చేసి గిరిజనులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలని పీవైఎల్‌ నాయకుడు తగరం బాబూరావు కోరారు. మండలంలోని మారుమూల కొండ ప్రాంతంలో ఉన్న ఆ గ్రామంలో మలేరియా స్ప్రేయింగ్‌ పనులు ఇంతవరకూ చేయలేదని ఆరోపించారు. దీని కారణంగా అక్కడి గిరిజనులు అనారోగ్యాలతో బాధపడుతున్నారన్నారు. అధికారులు వెంటనే స్ప్రేయింగ్‌ పనులు చేయించడంతో పాటు వైద్య శిబిరం ఏర్పాటు చేసి వైద్య సేవలు అందించాలని కోరారు.

మరిన్ని వార్తలు