బాలిక అనుమానాస్పద మృతి

23 Dec, 2013 00:38 IST|Sakshi

మహేశ్వరం, న్యూస్ లైన్: ఓ బాలిక అనుమానాస్పద స్థితితో మృతిచెందింది. మృతదేహంపై గాట్లు ఉన్నాయి, దుస్తులు చిరిగిపోయాయి. తెలిసిన వారే ఆమెపై అత్యాచారం చేసి చంపేసి ఉండొచ్చని మృతురాలి బంధువులు, పోలీసులు అనుమానిస్తున్నారు. తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసిన ఈ సంఘటన మండల పరిధిలోని అమీర్‌పేట గ్రామంలో ఆదివారం వెలుగుచూసింది. సీఐ గంగాధర్, స్థానికుల కథనం ప్రకారం.. అమీర్‌పేట గ్రామానికి చెందిన ఏర్పుల కుమార్‌కు భార్యలు శోభ, అరుణ ఉన్నారు.  శోభకు కుమారుడు శ్రీకాంత్, కుమార్తె అశ్విని(17) ఉన్నారు. బాలిక గ్రామంలోని పాఠశాలలో ఏడో తరగతి చదువుతోంది. శనివారం రాత్రి అశ్విని కుటుంబీకులతో భోజనం చేసిన అనంతరం 11 గంటల వరకు టీవీలో సినిమా చూసి పడుకుంది. ఆదివారం ఉదయం 10 గంటల సమయంలో బాలిక ఇంటి ఎదుట ఉన్న పొదల్లో మృతదేహంగా పడి ఉంది. అశ్విని తల్లి శోభ, కుటుంబీకులు గమనించి లబోదిబోమన్నారు. సమాచారం అందుకున్న సీఐ గంగాధర్, ఎస్ రామసూర్యన్ సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు.
 
 బాలిక మెడ, నడుము భాగాల్లో గాట్లు ఉన్నాయి. దుస్తులు  కొద్దిగా చినిగిపోయి ఉన్నాయి. అశ్వినితో గతంలో చనువుగా ఉండే పొరుగింటికి చెందిన డప్పు కృష్ణ అలియాస్ చిన్నపై కుటుంబీకులు అనుమానం వ్యక్తం చేశారు. అతడే అత్యాచారం చేసి హత్యకు పాల్పడి ఉండొచ్చని బాలిక బంధువులు అతడిపై దాడికి యత్నించారు. దీంతో పాటు అశ్విని సవతి తల్లి అరుణపై కూడా స్థానికులు అనుమానం వ్యక్తం చేశారు. బాలిక హత్యలో ఆమె ప్రమేయం ఉండొచ్చని భావిస్తున్నారు. కాగా బాలిక తండ్రి కుమార్ ఇటీవల అనారోగ్యంతో మృతిచెందాడు. అశ్విని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నగరంలోని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.  
 
 పోలీసుల అదుపులో అనుమానితులు..
 డప్పు కృష్ణ అలియాస్ చిన్న, అరుణల ప్రవర్తన, కదలికలు అనుమానంగా ఉండడంతో వారిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఓక్రమంలో గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు జోక్యం చేసుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఎలాంటి ఘర్షణలు జరగకుండా పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు.  
 
 అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నాం
 మృతురాలి బంధువులు, స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్న కృష్ణ, అరుణలను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నాం. పోస్టుమార్టం నివేదికలో అన్ని వివరాలు వెల్లడవుతాయి. కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నాం. త్వరలో ఛేదిస్తాం.   
              సీఐ, గంగాధర్

>
మరిన్ని వార్తలు