ప్రాణాలు తీసిన పిన్ని

13 Jun, 2017 10:33 IST|Sakshi
ప్రాణాలు తీసిన పిన్ని

గత ఏడాది ఆగస్టులో నాలుగేళ్ల బాలిక హత్య
వివాహేతర సంబంధం, అసూయతో పిన్ని దురాగతం
తిరుమలలో ఘటన... ఛేదించిన పోలీసులు


సాక్షి, తిరుమల:  అభం శుభం తెలియని నాలుగేళ్ల పసిహృదయాన్ని పిన్ని చిదిమేసింది. తానూ ఒక బిడ్డకు తల్లిననే విషయాన్ని మరిచి ముక్కుపచ్చలారని ఆడబిడ్డను కట్టెతో మోది, చెట్టుకు కటేసి అతి కర్కశంగా హత్య చేసింది. గత ఆగస్టు 24వ తేది జరిగిన ఈ హత్యాఘటన తిరుమల పోలీసులు దర్యాప్తులో ఛేదించారు. పోలీసుల కథనం కర్ణాటకలోని ఎట్టిగ గ్రామానికి చెందిన దేవరాజ్‌ (40) కొంతకాలంగా తిరుమలలో కూలి పనులు చేస్తున్నాడు. ఇతని భార్య ఉలిగమ్మ (35), ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు. అయినా, అదేప్రాంతంలోని జ్యోతి (30)ని పెళ్లి చేసుకున్నాడు. ఈమెకు కుమారుడున్నాడు. తల్లి దుర్గమ్మ, మొదటి భార్యతోపాటు దేవరాజ్‌ కూలీ పనులకెళితే వారి పిల్లల ఆలనాపాలనా రెండో భార్య జ్యోతి  చూసుకునేది.

వివాహేతర సంబంధం
జ్యోతికి పెళ్లికి ముందే సొంతూరిలోని జయానాయక్‌తో వివాహేతర సంబంధం ఉంది. మరో కులానికి చెందిన దేవరాజ్‌ జ్యోతిని పెళ్లి చేసుకోవడం జయానాయక్‌కు నచ్చలేదు. ఇదే సందర్భంలో దేవరాజ్‌ కూడా మొదటిభార్యకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు. దీంతో జ్యోతి ఆగ్రహం పెంచుకుంది. వారి ముగ్గురు కుమార్తెల్లో నాలుగేళ్ల రాధను హత్య చేయాలని నిర్ణయించుకుంది. గత ఏడాది ఆగస్టు 24వ తేదిన ఉదయం జ్వరం పేరుతో రాధను అశ్విని ఆస్పత్రికి తీసుకెళ్లి పేరు నమోదు చేసి చికిత్స చేయించింది.

తర్వాత బాటగంగమ్మ ఆలయం మీదుగా పాపవినాశానికి వెళ్లే మెట్ల మార్గానికి 500 మీటర్ల దూరంలోని ముళ్ల పొదల్లో పెద్ద కట్టెతో మూడుసార్లు మోది రాధను హత్య చేసింది. బతికి వస్తుందేమో అన్న అనుమానంతో బండరాయిపై కూర్చోబెట్టి రాధ ప్యాంట్‌తోనే చేతులను పక్కనే ఉన్న చెట్టుకు కట్టేసి తిరిగి వచ్చేసింది. తర్వాత అనుమానం రాకుండా అదే రోజు భర్త దేవరారాజ్‌తో కలసి వన్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో మిస్సింగ్‌ కేసు నమోదు చేసింది.

దాగని నేరం
పోలీసు విచారణలో నేరం బయటపడింది. సోమవారం ఉదయం డీఎస్‌పి మునిరామయ్య, సీఐ తులసీరామ్, ఫోరెన్సిక్‌క్లూస్‌టీం బృందం నిందితురాలు జ్యోతిని వెంట బెట్టుకుని ఘటన స్థలికి వెళ్లారు. అక్కడ రాధకు చెందినదిగా భావిస్తున్న పుర్రె, వెంట్రుకలు, ఎముకలు, దుస్తులు, పాదరక్షలు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఇదే సందర్భంగా రాధను ఎలా కూర్చోబెట్టింది? ఎలా కట్టెతో మోదింది? ఆ బిడ్డ ప్యాంటుతో ఎలా చెట్టుకు కట్టేసి హత్య చేసిందన్న వివరాలను ఘటన స్థలంలో పోలీసులకు చూపింది.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు