అలిగి వెళ్లి.. శవమై తేలింది

25 Nov, 2013 06:41 IST|Sakshi

కంభం రూరల్, న్యూస్‌లైన్ : పరీక్ష పేపర్ ఆలస్యంగా ఇవ్వబోగా లెక్చరర్ మందలించడంతో ఇంటి నుంచి అలిగి వెళ్లిన విద్యార్థిని ఆదివారం శవమై తేలింది. వివరాలు.. స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతున్న రవళి గత శుక్రవారం జరిగిన యూనిట్ పరీక్షలో పేపర్ సమయానికి ఇవ్వలేదు. రవళిని మందలించిన లెక్చరర్.. ఆమె రాసిన పేపర్ తీసుకోకుండానే వెళ్లిపోయాడు. మనస్తాపం చెందిన రవళి (16) మధ్యాహ్నం నుంచి ఇంటికి వెళ్లింది. తన వద్ద ఉన్న విలువైన వస్తువులను ఇంట్లో ఉంచి నేరుగా కంభం చెరువు కట్టకు వెళ్లింది.
 
 ఎవరూ గమనించని సమయంలో పెద్దకంభం తూము వద్ద చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది. విషయం తెలియని రవళి తల్లిదండ్రులు కుమార్తె కోసం తెలిసిన చోటల్లా వెతికారు. బంధువులను వాకబు చేసినా ఆమె ఆచూకీ తెలియలేదు. ఈ నేపథ్యంలో రవళి బంధువులు శనివారం కళాశాలకు వెళ్లి ప్రిన్సిపాల్, లెక్చరర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ కుమార్తె కనిపించకపోవడానికి లెక్చరరే కారణమని పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు.
 
 ఎమ్మార్పీఎస్ నాయకులు విద్యార్థిని కుటుంబానికి అండగా నిలిచారు. రవళి ఆచూకీ తెలిసేంత వరకూ ఆందోళన చేస్తామని నాయకులు హెచ్చరించారు. ఈ నేపథ్యంలో కంభ చెరువులో ఎవరిదో మృతదేహం ఉందని ఆదివారం ఉదయం ప్రచారం జరిగింది. బంధువులు వెళ్లి మృతదేహాన్ని చూసి రవళిదిగా గుర్తించారు. మృతురాలి తల్లిదండ్రులు కుమార్తె మృతదేహాన్ని చూసి భోరున విలపించారు. ఎస్సై రామకోటయ్య సంఘటన స్థలానికి వెళ్లి మృతదేహాన్ని బయటకు తీయించి పోస్టుమార్టం కోసం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.
 

మరిన్ని వార్తలు